Asia Cup 2023: సుమారు ఆరు నెలలుగా  భారత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు కత్తులు దూసుకుంటున్న   ‘ఆసియా కప్ నిర్వహణ’ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టే  ఉంది. ఈ  మెగా టోర్నీని  పాకిస్తాన్ లో  జరిపితే తాము వెళ్లే ప్రసక్తే లేదని  పంతం పట్టిన బీసీసీఐ.. అందుకు అనుకూలంగానే తన మాట నెగ్గించుకుంది. ఇక టీమిండియా పాకిస్తాన్‌కు రావాల్సిందేనని, లేకుంటే  తాము కూడా వన్డే వరల్డ్ కప్ కు అక్కడికి వెళ్లబోమని చిత్ర విచిత్ర  ప్రకటనలతో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ మాత్రం.. భారత్ లేకుండానే తమ దేశంలో ఆసియా కప్ ను నిర్వహించనున్నది.  


ఏం తేల్చారంటే.. 


షెడ్యూల్డ్ ప్రకారమైతే  ఈ ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉంది.  అయితే  ఈ టోర్నీని  పాక్ లో నిర్వహిస్తే తాము ఆడబోమని, తటస్థ వేదిక అయితేనే ఆసియా కప్ ఆడతామని  బీసీసీఐ తేల్చి చెప్పిన నేపథ్యంలో   అందుకు అనుకూలంగానే నిర్ణయం వచ్చింది. గురువారం రాత్రి దుబాయ్ వేదికగా బీసీసీఐ, పీసీబీ లతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక సమావేశం నిర్వహించింది.   ఈ సమావేశం అనంతరం.. ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారమే  పాకిస్తాన్ లోనే జరుగుతుందని,   కానీ 
 భారత్ ఆడబోయే మ్యాచ్ లు మాత్రం తటస్థ వేదికలపై జరుగుతాయని ఏసీసీ వర్గాలు తెలిపినట్టు  సమాచారం. 


అయితే తటస్థ వేదికలుగా వేటిని నిర్ణయించారనేదానిపై ఇంకా స్పష్టత లేదు. దుబాయ్,  ఓమన్, శ్రీలంకలను ఆప్షన్లుగా   ఎంచుకున్నట్టు  తెలుస్తున్నది. ఇందులో   దుబాయ్  లేదా ఓమన్ ను  ఎంపిక చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లీగ్ మ్యాచ్ లతో పాటు  భారత్ గనక ఈ టోర్నీలో ఫైనల్స్ కు అర్హత సాధించినా   ఆ మ్యాచ్ లు తటస్థ వేదికలుగానే జరుగుతాయి. ఒకే  గ్రూప్ లో ఉన్న భారత్, పాక్ లు   15 రోజుల వ్యవధిలోనే   మూడు సార్లు (రెండు జట్లూ ఫైనల్స్ కు వెళ్తే)   తలపడతాయి. 


కాగా ఏసీసీ ప్రతిపాదించిన ఈ ప్రతిపాదనకు  పీసీబీ కూడా అంగీకారం తెలిపినట్టు  సమాచారం.   టోర్నీ మొత్తం  మరో దేశానికి   తరలిపోవడం కంటే నాలుగైదు మ్యాచ్ లు  మరో దేశంలో జరిగితే  నష్టమేమీలేదని పీసీబీ భావిస్తోంది.  అందుకే  ఏసీసీ  ప్రతిపాదనకు  పీసీబీ ఓకే చెప్పింది.   ఇక ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఆసియా కప్ ను ఈసారి వన్డే ఫార్మాట్ లోనే నిర్వహించనున్నారు.  ఈసారి టోర్నీలో ఆరు దేశాలు పాల్గొననున్నాయి. భారత్, పాకిస్తాన్, క్వాలిఫయర్ లు ఒక గ్రూప్ లో ఉండగా.. శ్రీలంక,  అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లు మరో గ్రూప్ లో ఉన్నాయి.  


ఏంటీ వివాదం..?  


ఈ వివాదానికి  2022 ప్రపంచకప్ సమయంలో బీజం పడింది. బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న  జై షా..  2023లో పాకిస్తాన్ లో జరగాల్సి ఉన్న  ఆసియా కప్ కోసం టీమిండియా ఆ దేశం వెళ్లదని, తటస్థ వేదిక అయితే తాము ఆడతామని  కామెంట్స్ చేశాడు. ఇది పాకిస్తాన్ క్రికెట్  ను ఇప్పటికీ కుదిపేస్తున్నది.   జై షా కామెంట్స్ కు బదులుగా  నాటి పీసీబీ చీఫ్ రమీజ్ రాజాతో పాటు  ప్రస్తుత అధ్యక్షుడు నజమ్ సేథీ కూడా  ఈ విషయంలో  కాస్త ఘాటుగానే  స్పందిస్తున్నారు. భారత్ ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్‌కు రాకుంటే.. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ (భారత్ లో జరుగనుంది)  కోసం తాము కూడా ఇండియాకు రాబోమని  హెచ్చరిస్తున్నారు. దీనిపై ఇదివరకే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) లో కూడా పలుమార్లు చర్చలు జరిగాయి.  మరి తాజా ప్రకటనపై పాకిస్తాన్ మాజీలు ఎలా స్పందిస్తారో చూడాలి.