IPL Auction 2025 Day 1 Players List: ఐపీఎల్(IPL) వేలంలో గత రికార్డులన్నీ బద్దలైపోయాయి. భారత ఆటగాళ్లకు పట్టం కడుతూ... ప్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి. భారత స్టార్ ఆటగాళ్లపై కోట్లకు కోట్లు గుమ్మరించాయి. ఊహించినట్లుగానే రిషబ్ పంత్(Rishabh Pant) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. గత రికార్డులన్నీ కాలగర్భంలో కలిపేశాడు. అంచనాలను తలకిందులు చేస్తూ కేఎల్ రాహుల్(KL RAhul) అనుకున్న ధర కంటే తక్కువ ధరకు అమ్ముడు పోయాడు. కానీ వెంకటేష్ అయ్యర్ మాత్రం భారీ ధర పలికి అందరినీ ఆశ్చర్య పరిచాడు. పంత్, అయ్యర్, యుజ్వేంద్ర చాహల్ కోసం ప్రాంచైజీలు పోటీ పడ్డాయి. 


 

టాప్ 5 మనోళ్లే

రిషభ్‌ పంత్‌కు రూ.27 కోట్లు( లక్నో)... శ్రేయస్‌ అయ్యర్‌ రూ.26.75 కోట్లు( పంజాబ్)..  వెంకటేశ్‌ అయ్యర్‌ రూ.23.75 కోట్లు(కోల్‌కతా )..  అర్ష్‌దీప్‌ సింగ్‌ రూ.18 కోట్లు(పంజాబ్‌ )..  యజ్వేంద్ర చాహల్‌ రూ.18 కోట్లు(పంజాబ్‌ ).. కేఎల్ రాహుల్ రూ. 14 కోట్లు(ఢిల్లీ).. ఇవీ ఐపీఎల్ వేలంలో భారత ఆటగాళ్లకు ఐపీఎల్ వేలంలో పలికిన ధర. భారత ఆటగాళ్లపై ప్రాంచైజీలు భారీగా కాసులు కుమ్మరించాయి. డ్యాషింగ్ బ్యాటర్‌, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్‌ పంత్‌ ధాటికి ఐపీఎల్‌ బాక్సులు బద్దలయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌ మెగా వేలానికి వదిలేసినప్పుడే.. పంత్ కు భారీ ధర ఖాయమని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. ప్రాంచైజీలు పట్టు వీడకపోవడంతో పంత్ రేటు ఆకాశానికి ఎగబాకింది. రైట్‌ టు మ్యాచ్‌ ద్వారా పంత్ పై ఢిల్లీ కన్నేసినా.. లక్నో ఏ మాత్రం  వెనక్కి తగ్గలేదు. పంత్ ను దక్కించుకునేందుకు ఎంత పెట్టేందుకైనా లక్నో సిద్ధమైంది. దీంతో రూ.27 కోట్లకు పంత్ అమ్ముడుపోయాడు. శ్రేయస్స్ అయ్యర్  కోసం కూడా ప్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరికి శ్రేయస్‌ను రూ.26.75 కోట్లకు  పంజాబ్‌  దక్కించుకుంది. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ  కేఎల్‌ రాహుల్‌ కేవలం రూ.14 కోట్లకే ఢిల్లీ సొంతమవడం.. అభిమానులను షాక్ కు గురిచేసింది. భారీ ధర పలుకుతాడన్న రాహుల్  కేవలం రూ. 14 కోట్లే పలకడం అందర్నీ నిరాశపర్చింది.

 


 

విదేశీ ఆటగాళ్లపై తగ్గిన మోజు

ఐపీఎల్‌ వేలం ఎప్పుడు జరిగినా ఫ్రాంచైజీలు అన్నీ  ఎక్కువగా విదేశీ ఆటగాళ్లపై దృష్టి పెడుతుంటాయి. కానీ ఈసారి అది జరగలేదు. ప్రాంచైజీలు అన్నీ భారత  ఆటగాళ్లపైనే మక్కువ చూపాయి. రిషభ్‌ పంత్‌ ను  రూ.27 కోట్లు.. శ్రేయాస్‌ అయ్యర్‌ను ఢిల్లీ రూ.26.75 కోట్లతో కొనుగోలు చేశాయి. దీంతో గతేడాది ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ (రూ.24.75 కోట్లు) అత్యధిక ధర రికార్డు బద్దలై పోయింది. ఈసారి స్టార్క్‌ను ఢిల్లీ రూ.11.75 కోట్లకే దక్కించుకుంది. తొలిరోజు మొత్తంగా 72 మంది ఆటగాళ్లు అమ్ముడవగా.. వీరికోసం ఫ్రాంచైజీలు రూ. 467.95 కోట్లు వెచ్చించాయి. నేటితో వేలం ముగుస్తుంది.

 

ఎవరూ ఊహించని విధంగా..

ఈ సారి ఐపీఎల్ వేలంలో ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌కు ఎవరూ ఊహించని ధర పలికింది. రిటైన్‌ చేసుకోకుండా వేలానికి వదిలిన కోల్‌కతానే తిరిగి అతడిని సొంతం చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడినా ఎక్కడా వెనక్కి తగ్గని కోల్ కత్తా వెంకటేష్ అయ్యర్ ను రూ. 23.75 కోట్లకు దక్కించుకుంది. 

 

భారత బౌలర్లపైనా కాసుల వర్షం..

 ఐపీఎల్ వేలంలో భారత పేసర్లపై కాసుల వర్షమే ముగిసింది. రూ. 2 కోట్ల కనీస ధర ఉన్న అర్ష్ దీప్ సింగ్ కోసం ప్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివర్లో సన్‌రైజర్స్‌ ఎంట్రీతో రేటు రూ.15.75 దగ్గర ఆగింది. ఈ దశలో పంజాబ్‌ కింగ్స్‌ రైట్ టు మ్యాచ్ ను ఉపయోగించగా.. రైజర్స్‌ ధరను రూ.18 కోట్లకు పెంచింది. దీనికి కూడా పంజాబ్‌ అంగీకరించడంతో అర్ష్‌దీప్‌ తన పాత జట్టులోనే చేరాడు. ఇక స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌కు అధిక ధరే పలికింది. గుజరాత్‌, చెన్నెన, లఖ్‌నవూ, సన్‌రైజర్స్‌ అతడికోసం ప్రయత్నించాయి. చివరకు రూ.18 కోట్ల దగ్గర రైజర్స్‌ వైదొలగగా.. యజ్వేంద్ర చాహల్  పంజాబ్‌ వశమయ్యాడు. బెంగళూరుతో చాలాకాలం కొనసాగిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను గుజరాత్‌  రూ.12.25 కోట్లకు దక్కించుకుంది. మహ్మద్‌ షమిని (రూ.10 కోట్లు, ఇషాన్‌ కిషన్‌ను రూ.11.25 కోట్లకు హైదరాబాద్ చేజిక్కించుకుంది. బ్యాటర్‌ జితేశ్‌ శర్మ రూ.11 కోట్లకు ఆర్సీబీలో చేరాడు. పేసర్లు నటరాజన్‌ రూ.10.75 కోట్లను ఢిల్లీ, అవేశ్‌ రూ.9.75 కోట్లకు లఖ్‌నవూ, ప్రసిద్ధ్‌ రూ.9.50 కోట్లకు గుజరాత్ టైటాన్స్‌ దక్కించుకుంది. సీనియర్ స్పిన్నర్‌ అశ్విన్‌ ను రూ.9.75 కోట్లకు చైన్నై దక్కించుకుంది.

 

విదేశీ ఆటగాళ్ల ధరలు ఇలా..

జోస్‌ బట్లర్‌  రూ.15.75 కోట్లు (గుజరాత్‌ టైటాన్స్‌)

ట్రెంట్‌ బౌల్ట్‌  రూ.12.50 కోట్లు (ముంబై)

జోఫ్రా ఆర్చర్‌,  రూ.12.50 కోట్లు (రాజస్థాన్‌)

హాజెల్‌వుడ్‌ రూ.12.50 కోట్లు( బెంగళూరు)

ఫిల్‌ సాల్ట్‌ రూ.11.50 కోట్లు (బెంగళూరు)

స్టొయినిస్‌ రూ.11 కోట్లు (పంజాబ్‌)

రబాడ రూ.10.75 కోట్లు ( గుజరాత్ టైటాన్స్‌) 

నూర్‌ అహ్మద్‌ రూ.10 కోట్లు (సీఎస్‌కే)