Mitchell Starc Becomes Most Expensive Player IPL History: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ నిలిచాడు. కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ను రికార్డు ధరకు కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ స్టార్క్ కోసం పోటాపోటీగా వేలంలో పాల్గొన్నాయి. చివరికి మిచెల్ స్టార్క్ కోసం  రూ.24.75 కోట్లు వెచ్చించి వేలంలో స్టార్ పేసర్ ను కళ్లు చెదిరే ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది.


గతంలో రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ కొట్టిన కేకేఆర్ మరోసారి టైటిల్ నెగ్గాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో కేకేఆర్ ఫ్రాంచైజీ భారీ ధరకు ఆటగాళ్లకు సొంతం చేసుకుంది. మొదట ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి పటిష్ట జట్లు ఆసీస్ పేర్ స్టార్క్ కోసం బిడ్డింగ్ మొదలుపెట్టాయి. ఓ మోస్తరు ధర వచ్చాక గుజరాత్ టైటాన్స్ రంగంలోకి దిగింది. క్రమంలో కేకేఆర్ వేలాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీతో పోటి పడి కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధరకు ఆసీస్ పేసర్ స్టార్క్ ను తీసుకుంది.






గంటల్లోనే కమిన్స్ రికార్డు బద్దలు..
ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆసీస్ ఆటగాళ్లకు భారీ ధర పలుకుతోంది. మినీ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడుగా పాట్ కమిన్స్‌ (Pat Cummins) నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మొత్తాన్ని పెట్టి కమిన్స్ ను కొనుగోలు చేసింది. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఇతని కోసం పోటీ పడ్డాయి. మధ్యలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంట్రీతో పూర్తిగా మారిపోయింది. 20.50 కోట్లకు సన్ రైజర్స్ కొనుగోలు చేసిన వెంటనే మిచెల్ స్టార్క్ రేసులోకి వచ్చాడు. రికార్డు స్థాయిలో రూ.24.75 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ పేసర్ ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇరవై కోట్ల ధర దాటడం ఇదే తొలిసారి. కాగా, ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇరవై కోట్లకు పైగా ధర పలికారు.