కొత్త సంవత్సరం రాబోతుంది. మరో క్రీడా సంవత్సరం కాల గర్భంలో కలిసిపోతోంది. ఈ ఏడాది క్రీడల్లో ఎన్నో అద్భుతాలు.. మరెన్నో మధుర విజయాలు. కొన్ని విజయాలు అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయి. కొన్ని పరాజయాలు అభిమానులను కంటతడి పెట్టించాయి. పొట్టి క్రికెట్‌లో చాలామంది క్రికెటర్లు ఈ ఏడాది తమ మార్కు ఆటతీరుతో అబ్బురపరిచారు. అలా వన్డే క్రికెట్‌లో టీమిండియా బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. కానీ టెస్టుల్లో భారత బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. టాప్‌ టెన్‌లో ఒక్క భారత బ్యాటర్‌ కూడా స్థానం సంపాదించలేదు. 2023లో టాప్‌ టెన్‌ టెస్టు బ్యాటర్లు ఎవరంటే....

 

ఉస్మాన్ ఖవాజా : 

2023 ఏడాదిలో జరిగిన టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజా అగ్రస్థానంలో ఉన్నాడు. ఖవాజా 11 మ్యాచ్‌ల్లో  20 ఇన్నింగ్స్‌ల్లో 54.57 సగటుతో 1037 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది ఖవాజా అత్యుత్తమ స్కోరు 195 పరుగులు నాటౌట్‌. 

 

ట్రావిస్ హెడ్: 

ఆస్ట్రేలియాకు చెందిన ఓపెనర్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు . హెడ్‌ ఈ సంవత్సరం మొత్తం 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 19 ఇన్నింగ్స్‌లలో 47.11 సగటుతో మొత్తం 848 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, అయిదు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 

 

జో రూట్:

2023 ఏడాదిలో జరిగిన టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది రూట్ 8 టెస్టు మ్యాచ్‌ల్లో 14 ఇన్నింగ్స్‌ల్లో 65.58 సగటుతో మొత్తం 787 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు... 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

 

స్టీవ్ స్మిత్ :

ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో కూడా ఆస్ట్రేలియా బ్యాటరే ఉన్నాడు. స్టీవ్ స్మిత్ ఈ ఏడాది 11 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 20 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసి స్మిత్‌... 43.16 సగటుతో 777 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

 

మార్నస్‌ లబుషేన్‌: 

ఈ జాబితాలో అయిదో స్థానంలో కూడా ఆస్టేలియా బ్యాటరే ఉన్నాడు. లబుషేన్‌ మొత్తం 11 మ్యాచ్‌లలో 21 ఇన్నింగ్స్‌లలో 37.78 సగటుతో 718 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ ఆరో స్థానంలో... న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్ ఏడో స్థానంలో... ఇంగ్లండ్‌కు చెందిన బెన్ డకెట్ ఎనిమిదో స్థానంలో... శ్రీలంకకు చెందిన దిముత్ కరుణరత్నే తొమ్మిదో స్థానంలో.. ఇంగ్లాండ్‌కు చెందిన జాక్ క్రౌలీ పదో స్థానంలో నిలిచారు.

 

విరాట్ కోహ్లీ 2023లో భారత్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు సాధించాడు, 2023 ఏడాదిలో జరిగిన టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ 12వ స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఈ ఏడాది 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో 55.70 సగటుతో 557 పరుగులు చేశాడు, ఇందులో 2 సెంచరీలు  1 హాఫ్ సెంచరీ ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 186 పరుగులు.

 

రోహిత్ శర్మ ఈ ఏడాది భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. జాబితాలో రోహిత్‌ 13వ స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 11 ఇన్నింగ్స్‌ల్లో 49.09 సగటుతో  540 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు.. 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 120 పరుగులు.