ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్  ఐపీఎల్ 2024 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.  మంచి ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాడిని  రూ.6.8 కోట్లకు తన టీంలోకి రప్పించుకుంది. రూ. 2 కోట్ల బేస్‌ ప్రైస్‌తో వేలానికి వచ్చిన హెడ్‌ను దక్కించుకోవడం కోసం హైదరాబాద్‌, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడినప్పటికీ.. కావ్య మారన్ చివరి వరకూ పట్టు విడువలేదు. తన దూకుడుతో చెన్నై బిడ్డర్లను ఉక్కిరిబిక్కిరి చేసిన కావ్య రూ.6 కోట్ల వరకూ ఏ మాత్రం సంకోచించకుండా బిడ్ వేస్తూనే వెళ్ళి రూ.6 కోట్లు దాటాక కాస్త ఆలోచించినప్పటికీ  చివరకు హెడ్‌ను సొంతం చేసుకునేందుకే మొగ్గు చూపారు.


వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో కూడా తన మార్కు చూపి ఈ రెండు మ్యాచ్‌ల్లో  ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులను దక్కించుకున్నాడు. ఒకే ఏడాది ఆస్ట్రేలియా రెండు ఐసీసీ ట్రోఫీలను,  గెలవడంలో కీలక పాత్ర పోషించాడు హెడ్. టీ20లలో ట్రావిస్ హెడ్ స్ట్రైక్ రేటు 146.17 శాతం కాగా , ప్రపంచ కప్ తరువాత  భారత్‌ వేదికగా జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడాడు. అప్పుడు కూడా 18 బంతుల్లో 35 పరుగులు, 16 బంతుల్లో 31, 18 బంతుల్లో 28 చొప్పున పరుగులు కొట్టాడు. ఇక 2016, 2017 సీజన్లలో ట్రావిస్ హెడ్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. ఐపీఎల్‌లో అతడు పెద్దగా రాణించలేదు. కానీ ట్రావిస్ హెడ్ అటాకింగ్ ఓపెనర్. అతను నెం.3 లేదా 4లో బ్యాటింగ్ దిగ‌డంతోనే బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డే  కీల‌క ప్లేయ‌ర్. 


ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్ బేస్ ప్రైస్ రూ.2 కోట్లు. కమిన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ తొలి బిడ్ వేసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ రూ.4.80 కోట్ల వరకు పాడింది. ఆ తర్వాత ఆర్సీబీ బరిలోకి దిగింది. 7.60 కోట్ల వరకు చెన్నై వేలంలో ఉంది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగింది. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది.


 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎందరో యువకుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ విజయవంతంగా.. 16 సీజన్‌లు పూర్తి చేసుకుంది. అనతి కాలంలోనే రిచ్చెస్ట్ క్రికెట్‌ లీగ్‌గా నిలిచింది. ఈ లీగ్‌లో ఒక్కసారైనా ఆడితే చాలు అని అనుకునే ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు.