రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ ముంబై మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయంతో అభిమానుల హృదయం ముక్కలైంది. ముంబై యాజమాన్యంపై హిట్‌ మ్యాన్‌ అభిమానులు భగ్గుమంటున్నారు. ఎక్స్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ముంబై ఇండియన్స్ ఖాతాను ఆన్‌ఫాలో చేసేస్తున్నారు. Shame On MI అంటూ ట్రెండ్‌ చేస్తున్నారు. గంటల వ్యవధిలోనే ముంబై ఇండియన్స్ భారీగా ఫాలోవర్లను కోల్పోయింది. ఇప్పటివరకు ఎక్స్‌లో 4 లక్షల మంది రోహిత్ అభిమానులు ముంబై ఇండియన్స్‌ను ఆన్‌ఫాలో చేశారు. గతంలో 86 లక్షలుగా ఉన్న ముంబై ఇండియన్స్ ఫాలోవర్లు సంఖ్య ప్రస్తుతం 82 లక్షలకు పడిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే 2 లక్షల మంది ముంబై ఇండియన్స్‌ను ఆన్‌ఫాలో చేశారు. 13.1 మిలియన్లుగా ఉన్న ముంబై ఇండియన్స్ ఫాలోవర్ల సంఖ్య 12.9 మిలియన్లకు పడిపోయింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. 


ఈ దెబ్బతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముంబై ఇండియన్స్ నంబర్ వన్ స్థానాన్ని కూడా కోల్పోయింది. ఇంతకుముందు వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న IPL ఫ్రాంచైజీగా ముంబై ఇండియన్స్ ఉండేది. తాజాగా ముంబైకి 2 లక్షల మంది ఫాలోవర్లు తగ్గడంతో చైన్నైసూపర్ కింగ్స్ మొదటి స్థానంలోకి వెళ్లింది. ప్రస్తుతం చెన్నైకి 13 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.


అయిదు సార్లు ముంబైని విజేతగా నిలిపిన దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ ముంబై ఇండియన్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది.  గుజరాత్‌ టైటాన్స్‌ సారథిగా ఉన్న హార్దిక్‌ను భారీ మొత్తం వెచ్చించి మరీ దక్కించుకున్న ముంబై... అతడికే సారధ్య బాధ్యతలు కట్టబెట్టింది. 


ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్సీపై ముంబయి చేసిన ప్రత్యేక ట్వీట్‌ వైరల్‌గా మారింది. 2013లో రోహిత్‌ ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు తమను ఒక్కటే అడిగాడని...తమ మీద నమ్మకం ఉంచాలని చెప్పాడని ట్వీట్‌లో ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ గుర్తు చేసుకుంది. గెలుపైనా.. ఓటమైనా నవ్వుతూ ఉండాలని చెప్పావని... పదేళ్ల కెప్టెన్సీ కెరీర్‌లో ఆరు ట్రోఫీలు సాధించావని... దిగ్గజాల నాయకత్వ వారసత్వాన్ని కొనసాగిస్తూ జట్టును ముందుండి నడిపించావని... ముంబై ఇండియన్స్‌ ఆ ట్వీట్‌ రోహిత్‌కు ధన్యవాదాలు తెలిపింది. ధన్యవాదాలు.. కెప్టెన్ రోహిత్ శర్మ అంటూ ముంబయి ఇండియన్స్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.  


గత రెండేళ్లుగా గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించి ఈ మధ్యే తిరిగి జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు ముంబై యాజమాన్యం నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్‌మీడియా సైట్ల ద్వారా అభిమానులతో ముంబై ఇండియన్స్‌ పంచుకుంది. వచ్చే ఏడాది ఐపీఎల్‌ లీగ్‌లో ముంబయి ఇండియన్స్‌ను హార్దిక్‌ నడిపిస్తాడని ఫ్రాంఛైజీ ప్రకటించింది. రోహిత్‌ సారథ్యంలో ముంబై 2013, 2015, 2017, 2019, 2020లో టైటిల్‌ గెలిచింది. 2013లో ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20లోనూ విజేతగా నిలిచింది. అత్యధిక సార్లు ట్రోఫీ నెగ్గిన జట్టుగా చెన్నైతో కలిసి ముంబై అగ్రస్థానంలో ఉంది. ఇది కేవలం రోహిత్‌ శర్మ వల్లనే సాధ్యమైంది. 2013 మధ్యలో నుంచి 2023 వరకు అంటే 11 సీజన్ల పాటు ముంబయికి రోహిత్‌ సారథ్యం వహించాడు. కెప్టెన్‌గా మొత్తం 163 మ్యాచ్‌ల్లో 91 విజయాలు అందుకున్నాడు. 68 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. నాలుగు టై అయ్యాయి.