ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్‌ విజయం దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత మహిళలు... ఇంగ్లాండ్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేసి మ్యాచ్‌పై పట్టు సాధించారు. తొలుత బ్యాట్‌తో.. తర్వాత బాల్‌తో సాధికారికంగా రాణించిన టీమిండియా... గెలుపునకు బాటలు వేసుకుంది. ఇప్పటికే స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై భారత స్పిన్నర్లను ఎదుర్కొంటూ ఇంగ్లాండ్‌ రోజంతా నిలబడడం కష్టమే. అంటే భారత మహిళల విజయం లాంఛనమే.


ఓవర్‌నైట్‌ స్కోరు 7 వికెట్లకు 410 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత మహిళలు  428 పరుగులకు ఆలౌటైంది. దీప్తి 113 బంతుల్లో 67 పరుగులు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 7 పరుగులు మాత్రమే జోడించి దీప్తి వెనుదిరిగింది. ఎకిల్‌స్టోన్‌ ధాటికి టీమిండియా ఓవర్‌ నైట్‌ స్కోరుకు మరో పద్దెనిమిది పరుగులు మాత్రమే జోడించి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. అనంతరం ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. తొలుత పేసర్లు తర్వాత స్పిన్నర్లు విజృంభించడంతో  ఇంగ్లాండ్‌ కేవలం  136 పరుగులకే కుప్పకూలింది. ఆరంభంలోనే  బ్రిటీష్‌ మహిళలకు షాక్‌ తగిలింది. 13 పరుగుల వద్ద డంక్లీని అవుట్‌ చేసిన రేణుకా సింగ్‌ ఇంగ్లాండ్‌ పతనాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కాసేపటికే బీమాంట్‌ రనౌట్‌ అయింది. దీంతో 28 పరుగులకే ఇంగ్లాండ్‌ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నైట్‌ కూడా 11 పరుగులకే అవుట్‌ అవ్వడంతో బ్రిటీష్‌ జట్టు 79 పరుగులకు మూడో వికెట్‌ కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా బ్రంట్‌ ఓపిగ్గా బ్యాటింగ్‌ చేసింది. 70 బంతుల్లో 10 ఫోర్లతో 59 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది. కానీ 59 పరుగుల వద్ద బ్రంట్‌ను రానా బౌల్డ్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ పతనం వేగంగా సాగింది.


దీప్తి శర్మ బౌలింగ్‌కు వచ్చాక ఇంగ్లాండ్‌ కష్టాలు రెట్టింపయ్యాయి. వ్యాట్‌ (19) వికెట్‌తో మొదలెట్టిన దీప్తి.. పిచ్‌ నుంచి లభిస్తున్న సహకారాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ చెలరేగింది. మరో స్పిన్నర్‌ స్నేహ్‌తో కలిసి ప్రత్యర్థి పనిపట్టింది. ఒకే ఓవర్లో జోన్స్‌, ఎకిల్‌స్టోన్‌ను దీప్తి ఔట్‌ చేసింది. దీంతో 126 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.ఆ వెంటనే సీవర్‌ను స్నేహ్‌ బౌల్డ్‌ చేసింది. ఆఫ్‌స్టంప్‌కు చాలా దూరంగా పడ్డ బంతి అనూహ్యంగా లోపలికి తిరిగి స్టంప్స్‌ను ఎగరగొట్టడంతో నమ్మశక్యం కానట్లు సీవర్‌ పెవిలియన్‌ బాట పట్టింది. ఆ కాసేపటికే ఇంగ్లాండ్‌ ఆలౌటైంది. దీప్తి, స్నేహ్‌ దెబ్బకు ఇంగ్లాండ్‌ 28 పరుగులకే చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. దీప్తి శర్మ (5/7) స్పిన్‌ మాయలో చిక్కుకున్న ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూలింది. స్నేహ్‌ రాణా (2/25) కూడా ఆకట్టుకుంది. 


ఇంగ్లాండ్‌ను ఫాలో ఆన్‌ ఆడించే అవకాశం ఉన్నా ఆ ఛాన్స్‌ ఇవ్వకుండా భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ప్రత్యర్థిని ఫాలోఆన్‌కు దించకుండా రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమ్‌ఇండియా తడబడింది. వేలి గాయంతో శుభ బ్యాటింగ్‌కు రాలేదు. జట్టుకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు షెఫాలి, స్మృతి  తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. కానీ స్మృతి వికెట్‌తో భారత్‌ను ఎకిల్‌స్టోన్‌ తొలి దెబ్బ కొట్టింది. అక్కడి నుంచి స్పిన్నర్లు డీన్‌, ఎకిల్‌స్టోన్‌ ఆధిపత్యం చలాయించారు. జెమీమా (27), హర్మన్‌ప్రీత్‌ కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. 133/6తో నిలిచిన జట్టును పూజ (17 బ్యాటింగ్‌)తో కలిసి హర్మన్‌ ఆదుకుంది. ఈ జంట అభేద్యమైన ఏడో వికెట్‌కు 53 పరుగులు జోడించింది.  ప్రస్తుతం 478 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమ్‌ఇండియాకు స్వదేశంలో ఇంగ్లాండ్‌పై తొలి టెస్టు విజయం ఖాయమే.