Rohit Sharma Wife Ritika Sajdeh Reacts To Mumbai Indians Coach Comments On Captaincy Change: ఐపీఎల్ 2024 వేలానికి కొద్ది రోజుల ముందే స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను కాదని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ బాధ్యతలను హార్దిక్ పాండ్యకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం రోహిత్ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో వేలాది మంది ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను అన్‌ఫాలో చేశారు. సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ యాజమాన్య నిర్ణయాన్ని తప్పుపడుతూ పరోక్షంగా సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రోహిత్‌ను వాళ్ళు బహిరంగంగా సపోర్ట్ చేయటం గానీ, సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం గానీ జరగలేదు . మరోవైపు ఇంత జరిగినా ఈ విషయంలో హిట్ మ్యాన్ నుంచి మాత్రం ఎలాంటి స్పందనా రాలేదు. అయితే ముంబయి ఇండియన్స్ జట్టులో ఇది తీవ్ర ప్రకంపనలు సృష్టించిందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రోహిత్ శర్మ భార్య రితికా సజ్‌దేహ్( Ritika Sajdeh) చేసిన వ్యాఖ్యలు ముంబయి ఇండియన్స్ జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
అసలేం జరిగిదంటే..
ముంబయి ఇండియన్స్ ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. కెప్టెన్‌ను మార్చడం వెనుక లాజిక్ ఇదంటూ వివరణ ఇచ్చారు. ఇది పూర్తిగా క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయేమని, వ్యక్తిగత నిర్ణయం కాదని అన్నాడు. రోహిత్ అసాధారణమైన ప్లేయర్ అని, ఈ నిర్ణయం వల్ల రోహిత్‌లోని అత్యుత్తమ ఆటగాడు బయటకొస్తాడు అని తెలిపాడు. కెప్టెన్ కానప్పుడే రోహిత్ ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ మంచి పరుగులు చేయడంతోపాటు ఆటను ఆస్వాదిస్తాడన్నారు. కానీ రోహిత్ అభిమానులు మాత్రం ఈ నిర్ణయాన్ని భావోద్వేగంతో ఆలోచిస్తున్నారని పేర్కొన్నాడు.
ఈ ఇంటర్వ్యూ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దానిపై రితిక స్పందించారు. ఈ నిర్ణయంలో చాలా తప్పులున్నాయి అంటూ రితక కామెంట్ చేశారు. ఈ ఒక్క మాటతో హార్దిక్ పాండ్యను కెప్టెన్ చేసే విషయంలో రోహిత్‌కు ముందస్తు సమాచారం లేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. దీంతో మరోసారి ముంబయి ఇండియన్స్ యాజమాన్యంపై విమర్శలు మొదలయ్యాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఫ్రాంచైజీ ఉద్దేశపూర్వకంగానే వేటు వేసిందని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ట్రేడింగ్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్య ముంబయి ఇండియన్స్‌కు వచ్చిన విషయం తెలిసిందే గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్‌ను ఫైనల్స్ చేర్చడమే కాక, 2022లో విజేతగా కూడా నిలిపిన పాండ్యా.. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పాండ్యా ముంబయి జట్టు సొంతమయ్యాడు. ముంబైలో చేరేందుకు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యా వైదొలిగాడు. హార్దిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకునేందుకు వేగంగా పావులు కలిపిన ముంబై అనుకున్నది సాధించింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే సమయం ఇక ముగిసిందనుకున్న సమయంలో ఈ సంచలనం జరిగింది. కాగా, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్ అయిదు సార్లు టైటిల్‌ను సాధించింది.