Kane Williamson smashes back-to-back hundreds: గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన న్యూజిలాండ్‌(New Zealand) సీనియర్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌(Kane Williamson) వరుస శతకాలతో చెలరేగిపోతున్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న కేన్‌ మామ.. వరుసగా రెండు సెంచరీలు చేసి పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. స్వదేశంలో ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లోనూ విలియమ్సన్‌ శతక మోత మోగించాడు. బే ఓవ‌ల్‌లో జ‌రుగుతున్న మొద‌టి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో.. కేన్‌ విలియమ్సన్‌ శ‌త‌కంతో గ‌ర్జించాడు. క్లాస్ ఇన్నింగ్స్‌తో అల‌రించిన కేన్ మామ 30వ సెంచ‌రీతో కొత్త రికార్డు సృష్టించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేసి సుదీర్ఘ ఫార్మాట్‌లో 31 శతకాన్ని తన పేరిట లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ 132 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్లతో 109 ర‌న్స్ బాదాడు. త‌ద్వారా ఈ స్టార్ ఆట‌గాడు సుదీర్ఘ ఫార్మాట్‌లో 31వ సెంచ‌రీ న‌మోదు చేశాడు.



రికార్డుల మోత
ఇప్పటికే భారత స్టార్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli), క్రికెట్‌ లెజెండ్‌, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డాన్‌ బ్రాడ్‌మన్‌ పేరిట ఉన్న 29 సెంచరీల రికార్డును అధిగమించిన కేన్‌ మామ.. ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) రికార్డును బ్రేక్ చేశాడు. 30 సెంచరీల జో రూట్‌ రికార్డును విలియమ్సన్‌ బద్దలు కొట్టాడు. మ‌రొక‌ సెంచ‌రీ కొడితే ఈ కివీస్ మాజీ సార‌థి ..ఆస్ట్రేలియా ర‌న్ మెషిన్ స్టీవ్ స్మిత్‌ స‌ర‌స‌న నిలుస్తాడు. ప్రస్తుతం స్మిత్ 32 శ‌త‌కాల‌తో టాప్‌లో కొన‌సాగుతున్నాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు మూడంకెల స్కోర్ సాధించిన రెండో ఆట‌గాడిగా కేన్‌ నిలిచాడు.


మ్యాచ్‌ సాగుతుందిలా...
ఈ మ్యాచ్‌లో ర‌చిన్ ర‌వీంద్ర(240) డ‌బుల్ సెంచ‌రీతో విజృంభించ‌గా.. విలియ‌మ్సన్‌(118) సెంచ‌రీతో జ‌ట్టుకు కొండంత స్కోర్ అందించాడు. అనంతరం స‌ఫారీల‌ను 162 ప‌రుగుల‌కే చుట్టేసిన కివీస్.. రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడుతోంది. విలియ‌మ్సన్ సెంచ‌రీతో న్యూజిలాండ్ ఆధిక్యం 500 పరుగులు దాటింది. మూడో రోజు ఆట ముగిసే స‌రికి న్యూజిలాండ్ 4 వికెట్ల న‌ష్టానికి 179 ర‌న్స్ కొట్టింది. టామ్ బండెల్ , డారిల్ మిచెల్‌ క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి కివీస్ 528 ప‌రుగుల భారీ ఆధిక్యంలో ఉంది. దీని ఛేదించడం దక్షిణాఫ్రికాకు శక్తికి మించిన పనే. 


మసాకా శకం రానుందా..?
అండర్‌-19 వరల్డ్‌కప్‌(U19 World Cup)లో యువ తారలు దూసుకొస్తున్నారు. ఇప్పటికే భారత్‌ తరపున ముషీర్‌ ఖాన్‌(Musheer Khan) వరుస సెంచరీలతో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికా బౌలర్‌ సరికొత్త చరిత్ర లిఖించాడు. అండర్‌ 19 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకూ ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డును సౌతాఫ్రికా పేస్‌ బౌలర్ క్వేనా మపాకా(Kwena Maphaka) నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన జరిగిన మ్యాచ్‌లో మసాకా ఆరు వికెట్లు నేలకూల్చి ఈ ఘనత సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో మసాకాకు ఇది మూడోసారి అయిదు వికెట్ల ప్రదర్శన. అండర్‌-19 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్‌ సింగిల్‌ ఎడిషన్‌లో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు చేయలేదు.


Also Read: అర్జున అవార్డుగ్రహీతపై రేప్‌ కేసు, హాకీ టీం సభ్యుడిపై అత్యాచార ఆరోపణలు 


Also Read: భరత్‌ వైఫల్యంపై ద్రవిడ్‌ ఏమన్నాడంటే?