Dravid on Bharats batting: ఇంగ్లండ్‌(England)తో సిరీస్‌లో తొలి రెండు టెస్టు మ్యాచులకు జట్టులో చోటు దక్కించుకున్న కె.ఎస్‌. భరత్‌(KS Bharat) ఈ రెండు మ్యాచుల్లోనూ పెద్దగా రాణించలేదు. తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసి పర్వాలేదనిపించిన భరత్‌... రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 28 పరుగులకే వెనుదిరిగాడు. రెండో టెస్ట్‌లో మాత్రం శ్రీకర్‌ భరత్ ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 17, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులే చేసి వెనుదిరిగాడు. ఈ క్రమంలో భరత్‌కు మూడో టెస్ట్‌లో జట్టులో స్థానం దొరుకుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మొదటి రెండు టెస్టులకు స్పెషలిస్టు వికెట్‌ కీపర్‌ కోటాలో భరత్‌ చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు యువ వికెట్‌ కీపర్‌ దృవ్‌ జురల్‌కు కూడా జట్టులో ఛాన్స్‌ లభించింది. అయితే మూడో టెస్ట్‌లో శ్రీకర్‌ భరత్‌నే కొనసాగిస్తారా లేక దృవ్‌ జురెల్‌ను జట్టులోకి తీసుకుంటారా అన్నదానిపై రాహుల్‌ ద్రవిడ్‌ స్పందించాడు.

 

ద్రవిడ్ ఏమన్నాడంటే..?

రెండు టెస్టుల్లో కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ పెద్దగా ఆకట్టుకోని విషయంపై కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) స్పందిస్తూ.. భరత్‌ నిరాశపరిచాడని  తాను అనుకోవట్లేదని అన్నాడు. యువ ఆటగాళ్లు రాణించడానికి సమయం తీసుకుంటారని.. ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోచ్‌ కోరుకుంటాడని అన్నాడు. భరత్‌ కీపింగ్‌ బాగానే ఉందని... బ్యాట్‌తో కూడా మెరుగ్గా రాణించగలడని ద్రవిడ్‌ అన్నాడు.

 

మూడో టెస్ట్‌కు బుమ్రా డౌటే

టీమిండియాలో టెస్ట్‌ మ్యాచ్‌ అంటే అందరి చూపు స్పిన్నర్లపైనే. పేసర్లు నామమాత్రంగా మారిపోతారు. కానీ అందరూ ఒకెత్తు. పేసు గుర్రం జస్ప్రిత్‌ బుమ్రా మరో ఎత్తు. వైజాగ్‌ టెస్ట్‌లో స్పిన్నర్లకు, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై బుమ్రా ప్రదర్శన అబ్బురపరిచింది. నిప్పులు చెరిగే బంతులతో బుమ్రా ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పతనాన్ని శాశించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. అయితే కీలకమైన మూడో టెస్ట్‌కు బుమ్రా జట్టుకు దూరం కానున్నాడన్న వార్తలు అభిమానులను షాక్‌కు గురిచేశాయి.

 

రాజ్‌ కోట్‌ వేదికగా జరిగే మూడో టెస్ట్‌కు బుమ్రాను దూరం పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజులుగా వరుసగా మ్యాచ్‌ లు ఆడుతున్న పేసు గుర్రం బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే టీమిండియా మేనేజ్ మెంట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌ ఆడినా బుమ్రా ఫిట్‌నెస్‌పై ప్రభావం పడుతుందని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భయపడుతుందన్న వార్తలు వస్తున్నాయి. చివరి 2 టెస్టులకు బుమ్రాను మరింత ఫిట్‌ గా ఉంచేందుకు తదుపరి టెస్టు నుంచి విశ్రాంతి కల్పించిందని తెలుస్తోంది. రెండో టెస్టులో బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి దాదాపు 33 ఓవర్లు బౌలింగ్ చేశాడు. జట్టులోని మిగతా బౌలర్లతో పోలిస్తే బుమ్రా వేసిన ఓవర్ల సంఖ్య పెరిగింది. స్పిన్నర్‌కు అనుకూలమైన పిచ్‌పై జట్టులోని ముగ్గురు స్పిన్నర్లు బుమ్రా కంటే తక్కువ బౌలింగ్ చేశారు. తొలి టెస్టులోనూ బుమ్రా దాదాపు 25 ఓవర్లు బౌలింగ్ చేశాడు. బుమ్రా గైర్హాజరీలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి రానున్నాడు. ఈ సిరీస్ నుంచి మహ్మద్ షమీ పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది.