Jasprit Bumrah Magic against England in Visakhapatnam: విశాఖ వేదికగా ఇంగ్లండ్‌(England)తో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. మూడున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో టీమిండియా(Team India) గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్‌(yashasvi jaiswal) ద్విశతకంతో కదంతొక్కడంతో396 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బుమ్రా ఆరు వికెట్లతో సత్తాచాటడంతో తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు 253 పరుగులకు కుప్పకూలింది.


రెండో ఇన్నింగ్స్‌లో శుభమన్‌ గిల్(Subhaman gill) సెంచరీతో రాణించడంతో టీమిండియా 255 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 399 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 292 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ ఒక వికెట్‌ నష్టానికి 67 పరుగుల స్కోరుతో నాలుగోరోజు లక్ష్య ఛేదనను కొనసాగించిన ఇంగ్లాండ్‌కు తొలి సెషన్‌లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ ఆరంభంలో భారత బౌలర్లను కాస్త ఇబ్బంది పెట్టిన ఇంగ్లాండ్ బ్యాటర్లు కీలక సమయంలో వికెట్లను సమర్పించుకున్నారు. జాక్‌ క్రాలే 73 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌, టామ్‌ హార్ట్‌లీ చెరో 36 పరుగులతో ఫర్వాలేదనించారు. అశ్విన్‌, బుమ్రా చెరో 3 వికెట్ల పడగొట్టారు. ముకేశ్‌, కుల్‌దీప్‌, అక్షర్‌ ఒక్కో వికెట్‌ తీసుకున్నారు. ఈ నెల 15న రాజ్‌కోట్‌లో మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.


బూమ్‌ బూమ్‌ బుమ్రా..
ఈ మ్యాచ్‌లో పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పతనాన్ని శాశించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. చేతన్‌ శర్మ తర్వాత ఇంగ్లండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత సీమర్‌గా బుమ్రా రికార్డుల్లోకెక్కాడు. 1986లో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో చేతన్ శర్మ 188 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టగా.. ఈ మ్యాచ్‌లో బుమ్రా 91 పరుగులు సమర్పించుకుని 9 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలు బుమ్రా కెరీర్‌లో రెండో బెస్ట్‌ కావడం గమనార్హం. బుమ్రా ఇప్పటివరకూ తొమ్మిది సార్లు ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేశాడు. బుమ్రా 33 టెస్ట్‌ల్లో 20.82 సగటున 146 వికెట్లు పడొట్టాడు. 


ఆ యార్కర్‌ అయితే...
టీమిండియాలో టెస్ట్‌ మ్యాచ్‌ అంటే అందరి చూపు స్పిన్నర్లపైనే. పేసర్లు నామమాత్రంగా మారిపోతారు. కానీ అందరూ ఒకెత్తు. పేసు గుర్రం జస్ప్రిత్‌ బుమ్రా మరో ఎత్తు. వైజాగ్‌ టెస్ట్‌లో స్పిన్నర్లకు, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై బుమ్రా ప్రదర్శన అబ్బురపరిచింది. నిప్పులు చెరిగే బంతులతో బుమ్రా ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించాడు. ఓలి పోప్‌ గత మ్యాచ్‌లో కొంచెంలో డబుల్‌ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లోనూ మంచి టచ్‌లో కనిపించి మరోసారి మంచి ఇన్నింగ్స్‌ ఆడేలా కనిపించాడు. 23 పరుగులు చేసి ఇంగ్లాండ్‌ను కాపాడేలా కనిపించిన పోప్‌ను.. బుమ్రా సూపర్‌ యార్కర్‌తో బౌల్డ్‌ చేశాడు. బుమ్రా సంధించిన యార్కర్‌కు పోప్‌ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ యార్కర్లలో ఒకటిగా ఇది నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అనంతరం 47 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ సారధి స్టోక్స్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్‌ చేశాడు. అద్భుతమైన బంతితో స్టోక్స్‌ను బౌల్డ్‌ చేశాడు. ఈ బంతిని అసలు ఎలా ఆడాలి అన్నట్లు బ్యాట్‌ కిందపడేసి స్టోక్స్‌ నిరాశ వ్యక్తం చేశాడు. చివరిగా అండర్సన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌కు బుమ్రా ముగింపు పలికాడు.