Yashasvi Jaiswal Hundred:  ముంబైలోని వాంఖెడే వేదికగా ముంబై ఇండియన్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌లో  మరో సెంచరీ నమోదైంది. ముంబైలో పుట్టి పెరిగి దేశవాళీలో  అదే టీమ్‌కు ఆడుతూ  ఐపీఎల్ లో రాజస్తాన్  రాయల్స్‌కు ఆడుతున్న  యశస్వి జైస్వాల్..  53 బంతుల్లోనే  మూడంకెల స్కోరు చేశాడు. ఈ సీజన్‌లో ఇది మూడో సెంచరీ.  ఈ శతకం ద్వారా  జైస్వాల్ పలు ఘనతలు సాధించాడు. 


ఫస్ట్ మ్యాచ్‌లో మెక్ కల్లమ్..  


ఐపీఎల్ లో  నేడు ముంబై ఇండియన్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ 1000వది.  2008 ఏప్రిల్   18న  కోల్‌కతా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరిగింది.  ఈ మ్యాచ్ లో కేకేఆర్ ఓపెనర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్) సెంచరీతో కదం తొక్కాడు. 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 158 పరుగులు చేశాడు. 


 






వెయ్యో మ్యాచ్‌లో జైస్వాల్.. 


ఇక ముంబై - రాజస్తాన్ ల మధ్య జరుగుతున్న వెయ్యో మ్యాచ్‌లో జైస్వాల్ రెచ్చిపోయాడు. ముంబైతో  పోరులో 32 బంతుల్లో అర్థ సెంచరీ  పూర్తి చేసిన జైస్వాల్.. 53 బంతుల్లో సెంచరీ చేశాడు.  ఈ క్రమంలో ప్రత్యేకమైన మ్యాచ్ లో శతకం సాధించి ప్రత్యేకమైన రికార్డు సొంతం చేసుకున్నాడు. తన కెరీర్‌లో జైస్వాల్‌కు ఇది మొదటి శతకం. 


పిన్న వయస్కుడిగా.. 


ముంబైపై సెంచరీ చేయడం ద్వారా జైస్వాల్..  ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుల వారి జాబితాలో చేరాడు. ఐపీఎల్ లో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్లలో  మనీష్ పాండే (19 ఏండ్ల 253 రోజులు)  ముందున్నాడు.  పాండే.. 2009లో డెక్కన్ ఛార్జర్స్ పై సెంచరీ చేశాడు.  ఆ తర్వాత రిషభ్ పంత్ (20  ఏండ్ల 218 రోజులు -  2018లో సన్ రైజర్స్ పై), దేవదత్ పడిక్కల్ (20 ఏండ్ల 289 రోజులు - 2021లో రాజస్తాన్ పై)లు జైస్వాల్ కంటే ముందున్నారు. జైస్వాల్  21 ఏండ్ల  123 రోజుల వయసులో  ముంబైపై సెంచరీ సాధించి  సంజూ శాంసన్ (22 ఏండ్ల 151  రోజులు- రైజింగ్ పూణె జెయింట్స్-2017లో) రికార్డును అధిగమించాడు. 


 






ఆరెంజ్ క్యాప్ సొంతం..


తన కెరీర్  లో తొలిసారి మూడంకెల స్కోరు చేయడం ద్వారా యశస్వి జైస్వాల్  ఈ సీజన్ లో 9 మ్యాచ్ లు ముగిసేసరికి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.  ముంబై - రాజస్తాన్ మ్యాచ్  ముందువరకూ  ఫాఫ్ డుప్లెసిస్ (ఆర్సీబీ) ఈ జాబితాలో  (8 మ్యాచ్ లు 422 రన్స్) ముందుండగా ముంబైపై సెంచరీతో జైస్వాల్  428 పరుగులతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే  సీజన్ ముగిసేవరకు ఆరంజ్ క్యాప్ దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.