DRS Review Rule IPL: 


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ జట్లకు గుడ్‌న్యూస్! తాజా సీజన్‌ నుంచి డీఆర్‌ఎస్‌ను మరింత విస్తరించనున్నారు. ఔట్‌, నాటౌట్‌కే కాకుండా ఇకపై నోబాల్‌, వైడ్‌ బాల్‌కు ఆటగాళ్లు సమీక్ష కోరుకోవచ్చని తెలిసింది. ప్రస్తుతం విమెన్‌ ప్రీమియర్‌ లీగులో దీనిని విజయవంతంగా ఉపయోగిస్తున్నారు.


ఐపీఎల్‌ (IPL) అంటేనే ఆఖరి వరకు ఏం జరుగుతుందో చెప్పలేం! అంపైర్‌ తీసుకొనే ఒక తప్పుడు నిర్ణయంతో మ్యాచ్‌ గమనమే మారిపోతుంది. విజయాలు చేజారుతుంటాయి. గతంలో ఇన్నింగ్స్‌ ఆఖరి బంతులు నోబాల్‌ అయినా అంపైర్లు ఇవ్వకపోవడంతో భారీ విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఆటగాళ్లు ఔటై పెవిలియన్‌కు చేరారు.






ఇకపై ఇలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు, ఆటగాళ్లకు మరో అవకాశం ఇవ్వాలని బీసీసీఐ (BCCI) నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న విమెన్‌ ప్రీమియర్‌ లీగులో నోబాల్‌ (No Ball), వైడ్‌ బాల్‌ (Wide Ball) కోసం సమీక్ష కోరేలా నిబంధనలు సవరించింది.


'మైదానంలోని అంపైర్లు తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని క్రికెటర్లు కోరొచ్చు. బ్యాటర్‌ ఔటయ్యారో లేదో తెలుసుకోవచ్చు. వైడ్‌ బాల్‌, నోబాల్‌ విషయంలోనూ ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై సమీక్ష అడగొచ్చు' అని విమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (Women Premier Leauge) నిబంధనల్లో రాశారు.


ముంబయి ఇండియన్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన తొలి మ్యాచులోనే ఈ నిబంధనను జట్లు ఉపయోగించుకోవడం గమనార్హం. సైకా ఇషాకి వేసిన డెలివరీని అంపైర్‌ వైడ్‌గా ప్రకటించారు. దానిని సవాల్‌ చేస్తూ ఫీల్డింగ్‌ జట్టు సమీక్ష కోరింది. దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పోరులోనూ వాడేశారు. మేఘాన్‌ షూట్‌ ఫుల్‌టాస్‌గా వేసిన డెలివరీని అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించలేదు. దాంతో బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ సమీక్ష కోరింది. అయితే సఫలం కాలేదు. యూపీ వారియర్జ్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచులోనూ ఇలాంటి సమీక్షే కోరారు.


UP Warriorz Vs Gujarat Giants, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ మహిళల జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం యూపీ వారియర్జ్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి విజయం సాధించింది. యూపీ వారియర్జ్ బ్యాటర్లలో గ్రేస్ హారిస్ (59 నాటౌట్: 26 బంతుల్లో, ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు) చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించింది.


మహిళల ప్రీమియర్ లీగ్‌లో మొదటి రెండు మ్యాచ్‌లూ ఏకపక్షంగానే ముగిశాయి. కానీ మూడో మ్యాచ్ మాత్రం థ్రిల్లర్‌లా సాగింది. మొదటి మ్యాచ్‌లో 143 పరుగులతో ముంబై ఇండియన్స్, రెండో మ్యాచ్‌లో 60 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించాయి. కానీ ఈ మ్యాచ్ మాత్రం చివరి బంతి వరకు సాగింది. ఆఖరి 30 బంతుల్లో 75 పరుగులను యూపీ వారియర్జ్ సాధించడం విశేషం.