MIW vs RCBW, WPL 2023: 


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో బెస్ట్‌ రైవల్రీ ఎవరిదంటే ముంబయి ఇండియన్స్‌ వర్సెస్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుదే అంటారు! ఇప్పుడు విమెన్‌ ప్రీమియర్‌ లీగులోనూ అదే జరగబోతోంది. సోమవారం బ్రబౌర్న్‌ వేదికగా స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ జట్లు గొప్ప ఫైట్‌ చేయబోతున్నాయి. సంప్రదాయబద్దంగా ఈ రెండు జట్లు, ఇద్దరు కెప్టెన్లకు ఎక్కువ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి నేటి మ్యాచులో విజయం ఎవరిది? తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి?


సాటి లేని ముంబయి


విమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభ మ్యాచులో ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) జోరు చూస్తే వారెవ్వా అనాల్సిందే. స్వదేశీ, విదేశీ క్రికెటర్లతో సమతూకంగా కనిపించింది. ఒకరితో మరొకరు పోటీపడి మరీ బ్యాటింగ్‌ చేశారు. సిక్సర్లు కొట్టడంలో తమకు సాటిలేదన్నట్టుగా ఆడేశారు. కెప్టెన్‌ హర్మన్‌ హాఫ్‌ సెంచరీతో జోష్‌లో ఉంది. పైగా కెప్టెన్సీలో తనది అందవేసిన చేయి. కోరుకున్న క్రికెటర్లంతా ఉన్నారు. దాంతో టైటిల్‌ రేసులో ఉన్నట్టే కనిపిస్తోంది. హేలీ మాథ్యూస్‌, నాట్‌ సివర్‌ బ్రంట్‌, అమెలియా కౌర్‌ నుంచి మెరుపులు ఆశించొచ్చు. పూజా వస్త్రాకర్‌, ఇస్సీవాంగ్‌, హమైరా కజీ భారీ షాట్లు ఆడేయగలరు. దాదాపుగా 10 నంబర్‌ వరకు బ్యాటింగ్‌ చేయగలరు. అటు పేస్‌, ఇటు స్పిన్‌ డిపార్ట్‌మెంట్‌ అత్యంత పటిష్ఠంగా ఉంది.


పట్టుదలగా ముంబయి


తొలి మ్యాచులో ఘోర ఓటమి నుంచి బలంగా పుంజుకోవాలని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పట్టుదలగా ఉంది. నిజానికి దిల్లీ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోవాల్సిన జట్టేమీ కాదు. విదేశీ క్రికెటర్లు ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు కాస్త సమయం పట్టొచ్చు. స్మృతి మంధాన, సోఫీ డివైన్‌లో ఎవరో ఒకరు భారీ స్కోరు చేయడం ఖాయం. మిడిలార్డర్లో హేథర్‌ నైట్‌, దిశా, ఎలిస్‌ పెర్రీ మంచి భాగస్వామ్యాలు అందించాల్సి ఉంది. రిచా ఘోష్‌ తన స్థాయికి తగినట్టు సిక్సర్లు బాదితే తిరుగుండదు. కనిక, ఆశా, ప్రీతి, మేఘన్, రేణుక షాట్లు ఆడగలరు. పేస్‌ ఫర్వాలేదు కానీ స్పిన్‌ డిపార్ట్‌మెంట్‌లో అనుభవ లేమి కనిపిస్తోంది. ఇందుకోసం ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా భావిస్తున్న డేన్‌వాన్‌ నీకెర్క్‌ను తీసుకోవచ్చు. కెప్టెన్సీ పరంగా మంధానకు మరింత అవగాహన, నేర్పరితనం అవసరం.


పరుగుల సునామీ


బ్రబౌర్న్‌ పిచ్‌ ఫ్లాట్‌గా ఉంది. పేసర్లు, స్పిన్నర్లు సరైన లెంగ్తుల్లో బంతులు వేస్తే వికెట్లు పడగొట్టగలరు. బౌండరీలు చిన్నవిగా ఉన్నాయి. బ్యాటర్లు సులభంగా 60 మీటర్ల దూరం బంతుల్ని పంపించగలరు. భారీ స్కోర్లు చేస్తుండటం, ముంబయి, ఆర్సీబీ మ్యాచ్‌ కావడంతో స్టేడియం నిండే అవకాశం ఉంది.


తుది జట్లు (అంచనా)


బెంగళూరు: స్మృతి మంధాన, సోఫీ డివైన్‌, హేథర్‌ నైట్‌, దిశా కసత్‌, ఎలిస్‌ పెర్రీ, రిచా ఘోష్‌, కనిక అహుజా, ఆశా శోభన, ప్రీతి బోస్‌, మేఘన్ షూట్‌, రేణుకా సింగ్‌


ముంబయి: యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్‌, హర్మన్‌ప్రీతి కౌర్‌, నాట్‌ సివర్‌ బ్రంట్‌, అమెలియా కౌర్‌, అమన్‌జోత్‌ కౌర్‌, పూజా వస్త్రాకర్‌, హమైరా కాజి, ఇస్సీ వాంగ్‌, జింతిమణి కలిత, సైకా ఇషాకి