IND vs AUS 4th Test: 


టీమ్‌ఇండియాతో నాలుగో టెస్టుకు ప్యాట్‌ కమిన్స్‌ అందుబాటులో ఉండటం లేదు. ఎప్పట్లాగే అతడి స్థానంలో స్టీవ్‌స్మిత్‌ ఆస్ట్రేలియాను నడిపించనున్నాడు. అహ్మదాబాద్‌లో హిట్‌మ్యాన్‌ సేన విజయాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించనున్నాడు.


దిల్లీ టెస్టు ముగిసిన వెంటనే ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. అతడి తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది. కొన్నాళ్లు సన్నిహితంగా ఉండి ఆమెను చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని భావించాడు. దాంతో మూడో టెస్టుకు రాలేదు. ఇప్పుడు అహ్మదాబాద్‌ టెస్టుకూ అందుబాటులో ఉండడని క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది.


కమిన్స్‌ స్థానంలో కెప్టెన్సీ అందుకున్న స్టీవ్‌ స్మిత్‌ (Steve Smith) తన అనుభవాన్ని ఉపయోగించాడు. టీమ్‌ఇండియాపై మూడో టెస్టులో విజయం సాధించాడు. తనదైన రీతిలో నిర్ణయాలు తీసుకొని శెభాష్‌ అనిపించుకున్నాడు. స్పిన్‌ పిచ్‌లపై బౌలర్లను తెలివిగా ఉపయోగించాడు. హిట్‌మ్యాన్‌ సేనను ఉచ్చులో బిగించాడు. ఈ గెలుపుతో ఆసీస్‌ నేరుగా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రెండో స్థానం కోసం భారత్‌, శ్రీలంక పోటీ పడుతున్నాయి.


'వన్డే సిరీసుకు కమిన్స్‌ అందుబాటులో ఉండటంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతేడాది వన్డేలకూ అతడినే సారథి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే' అని క్రికెట్‌ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది. కాగా సారథ్యంపై తనకు ఆసక్తేమీ లేదని స్టీవ్‌ చెప్పడం గమనార్హం.


'కెప్టెన్‌గా నా హయాం ముగిసింది. ఇప్పుడిది ప్యాటీ జట్టు. ఈ వారాన్ని నేను ఆస్వాదించాను. భారత్‌లో నాయకత్వం వహించడాన్ని నేను ఇష్టపడతాను. ఇక్కడి పరిస్థితులు, పిచ్‌లు బాగా తెలుసన్న నమ్మకంతో ఉంటాను. ఇక్కడ ప్రతి బంతికీ ఏదో ఈవెంట్‌ జరుగుతున్నట్టే ఉంటుంది. మిగతా చోట్ల అలా ఉండదు. నా కర్తవ్యాన్ని బాగానే నిర్వర్తించానని అనుకుంటున్నా' అని ఇండోర్‌ టెస్టు తర్వాత స్టీవ్‌ చెప్పిన సంగతి తెలిసిందే.


`మూడో టెస్టు సారాంశం


నెర్రెలు వాసిన పిచ్‌! బంతిని గింగిరాలు తిప్పించే స్పిన్నర్లు! మైండ్‌ గేమ్‌ ఆడితే గెలవచ్చేమో అనే ఆశలు! ఇండోర్‌ టెస్టు మూడో రోజు ఆట మొదలయ్యేముందు టీమ్‌ఇండియా సిచ్యువేషన్‌ ఇదీ! కానీ అద్భుతమేమీ జరగలేదు. అసాధ్యం సుసాధ్యం అవ్వలేదు. 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ సునాయాసంగా ఛేదించేసింది. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కి తగ్గించేసింది. ఆఖరి టెస్టుకు కొండంత ఆత్మవిశ్వాసం సాధించేసింది. ట్రావిస్‌ హెడ్‌ (49; 53 బంతుల్లో 6x4, 1x6), మార్నస్‌ లబుషేన్‌ (28; 58 బంతుల్లో 6x4) ఎలాంటి 'కంగారూ' లేకుండా ఆసీస్‌ను గెలిపించేశారు.


వికెట్లు పడలేదు!


మూడో రోజు, శుక్రవారం ఆసీస్‌ తాజాగా ఛేదనకు దిగింది. పరుగుల ఖాతా తెరవక ముందే ఉస్మాన్‌ ఖవాజా (0)ను అశ్విన్‌ ఔట్‌ చేసి ప్రత్యర్థికి షాకిచ్చాడు. ఎడమచేతి వాటం బ్యాటర్లను పదేపదే ఇబ్బంది పెట్టాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన మార్నస్‌ లబుషేన్‌తో కలిసి ట్రావిస్ హెడ్‌ కుదురుగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. టీమ్‌ఇండియా స్పిన్నర్లను ఆచితూచి ఎదుర్కొన్నాడు. పది ఓవర్ల తర్వాత వీరిద్దరూ దూకుడు పెంచారు. దొరికిన బంతుల్ని నేరుగా బౌండరీకి తరలించి ఆత్మవిశ్వాసం సాధించారు. ఆపై నిర్భయంగా షాట్లు ఆడేసి 18.5 ఓవర్లకు ఆసీస్‌కు 9 వికెట్ల తేడాతో విజయం అందించారు. మరో 3 వికెట్లు పడుంటే ఆట రసవత్తరంగా ఉండేది.