Delhi Capitals:ఐపీఎల్ -2023 సీజన్ లో  ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ ఓడి ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు అడుగంటే స్థితికి  చేరుకుంటున్నది ఢిల్లీ క్యాపిటల్స్. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని ఆ జట్టు ఈ సీజన్‌లో ఇంకా బోణీ కొట్టలేదు.  ఇంటర్నేషనల్  ప్లేయర్లు,  మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆల్ రౌండర్లు, హిట్టర్లు, వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నా ఆ జట్టు గెలవడానికి  నానా తంటాలు పడుతోంది.  దీంతో ఢిల్లీ టీమ్‌తో పాటు ఆ జట్టు హెడ్‌కోచ్ రికీ పాంటింగ్  పైనా  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


శనివారం ఢిల్లీ.. ఆర్సీబీ చేతిలో ఓడిన తర్వాత టీమిండియా మాజీ  ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ పాంటింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచినప్పుడు, 2020లో  ప్లేఆఫ్స్ కు వెళ్లినప్పుడు  హెడ్‌కోచ్ గా క్రెడిట్ తీసుకున్న ఆయన ఆ జట్టు ఓటములలో కూడా బాధ్యత వహించాలని అన్నాడు. 


ఆర్సీబీతో  మ్యాచ్ తర్వాత వీరూ  క్రిక్‌బజ్‌లో జరిగిన చర్చలో మాట్లాడుతూ.. ‘ఈ విషయం నేను ఇంతకుముందే చెప్పాను. ఒక జట్టు  ఓటములకు  కోచ్‌లు క్రెడిట్ తీసుకోవాల్సిందే.  పరజయాలకు బాధ్యత తీసుకోవాల్సిందే. గతంలో మనం  పాంటింగ్‌ను ఆహా ఓహో అని పొగిడాం. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లాడని,   మూడు సీజన్ల పాటు ప్లే ఆఫ్స్‌కు  చేర్చాడని  చెప్పుకున్నాం. అప్పుడు క్రెడిట్ అంతా  పాంటింగ్ తీసుకున్నాడు. ఇప్పుడు కూడా  పాంటింగ్  ఓటములకు బాధ్యత వహించాలి... 






విజయాలకు క్రెడిట్ తీసుకుని  ఓటములను వేరేవాళ్ల మీద తోసేసుందుకు ఇది  భారత జట్టు కాదు.  వాస్తవంగా చెప్పాలంటే ఐపీఎల్ లో కోచ్ పాత్ర శూణ్యం.  టీమ్ లో ఒక పెద్ద మనిషి తరహాలో ఆటగాళ్లలో  ఆత్మవిశ్వాసాన్ని నింపడం వారి పని. మ్యాచ్‌లో వ్యూహాలు రచించడం, వాటిని అమలుపరచడం వరకే వాళ్లు చేయగలిగేది.  అయితే  ఎండ్ ఆఫ్ ది డే  ఎవరైనా  చెప్పొచ్చేదేంటంటే.. ఆటగాళ్లు బాగా ఆడితేనే కోచ్ లు మంచిగా కనిపిస్తారు. దురదృష్టవశాత్తూ ఐపీఎల్ లో ఢిల్లీ తరఫున ఇప్పటివరకూ ఇలా జరుగలేదు..’అని చెప్పాడు.  ప్రస్తుతం ఢిల్లీ  ఈ సీజన్ లో తమ అదృష్టాన్ని మార్చుకోవడానికి ఏమి చేయాలో కూడా తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని   తాను భావిస్తున్నట్టు  అతడు  తెలిపాడు. 






కాగా ఆర్సీబీ - ఢిల్లీ మధ్య శనివారం బెంగళూరు వేదికగా ముగిసిన మ్యాచ్ లో వార్నర్ సేన  23 పరుగుల తేడాతో ఓడింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కోహ్లీ అర్థ సెంచరీ (50) తో రాణించాడు.  అనంతరం  ఢిల్లీ.. 20 ఓవర్లలో   9 వికెట్లు కోల్పోయి 151 పరుగులే చేసింది. మనీష్ పాండే  (50)  రాణించినా మిగిలిన వారు విఫలమయ్యారు.   ఈ సీజన్ లో ఢిల్లీ  ఏప్రిల్ 20న కో‌ల్‌కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది.