Aiden Markram Catch: సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి  అయిడెన్ మార్క్‌రమ్  బ్యాటింగ్ లోనే కాదు  ఫీల్డ్‌లో చురుగ్గా  కదిలే ఫీల్డర్‌గా కూడా అందరికీ సుపరిచితమే.  ఉప్పల్ వేదికగా మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్క్‌రమ్   మూడు స్టన్నింగ్ క్యాచ్ లతో ముంబైకి షాకిచ్చాడు. మూడు క్యాచ్‌లు కూడా ఏదో  తన దగ్గర ఉంటే వచ్చినవి కాదు.  ముందుకు పరుగెత్తుతూ  అద్భుతమైన డైవ్ చేస్తూ అందుకున్నవే.  ముంబై ఇండియన్స్‌లో మొదటి ముగ్గురు బ్యాటర్లూ మార్క్‌రమ్‌కే క్యాచ్ ఇవ్వడం గమనార్హం. ఆ మూడు క్యాచ్ లను చూస్తే  బంతిని తన దగ్గరికి తీసుకొచ్చే అయస్కాంతం ఏమైనా తన చేతులకు  తగిలించుకున్నాడా..? అనే విధంగా వాటిని అందుకున్నాడు. 


గాల్లో తేలుతూ.. 


నిన్నటి మ్యాచ్ లో ముంబై సారథి రోహిత్ శర్మ 18 బంతుల్లోనే 6 ఫోర్లతో జోరుమీదున్నాడు.  నటరాజన్ వేసిన ఐదో ఓవర్లో అప్పటికే  రెండు ఫోర్లు కొట్టిన హిట్‌మ్యాన్‌కు  నాలుగో బాల్ స్లోగా వేశాడు. షాట్ కొట్టే క్రమంలో  అంచనా తప్పిన  రోహిత్.. మిడాఫ్ దిశగా  ఆడగా మార్క్‌రమ్ ఈజీ క్యాచ్ అందుకున్నాడు. 


మార్కో జాన్‌సెన్ వేసిన  12వ ఓవర్లో  మొదటి బంతిని ఇషాన్ కిషన్  కూడా మిడాఫ్ దిశగానే ఆడగా మార్క్‌రమ్  అందుకోవడానికి వీల్లేకున్నా  ముందుకు పరుగెడుతూ  డైవ్ చేస్తూ బంతిని ఒడిసిపట్టాడు. 


 






ఇక  ఇదే ఓవర్లో ఐపీఎల్ - 16 సీజన్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్ అనదగ్గ క్యాచ్ పట్టాడు మార్క్‌రమ్. జాన్‌సెన్ వేసిన ఐదో బంతిని మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ మిడాఫ్ కు కాస్త  దూరంగానే  బౌండరీకి తరలించేయత్నం చేశాడు.  కానీ మార్క్‌రమ్ మాత్రం గాల్లోకి ఎగురుతూ సూపర్బ్ డైవ్ తో  క్యాచ్ పట్టాడు. మార్క్‌రమ్ అందుకున్న క్యాచ్ లకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  మార్క్‌రమ్ ఫీల్డింగ్ స్కిల్స్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 


ఐపీఎల్‌లో ఇలా మ్యాచ్‌లో ఫస్ట్ మూడు క్యాచ్‌లను పట్టిన ఫీల్డర్ల జాబితాలో  మార్క్‌రమ్ నాలుగోవాడు. గతంలో కేన్ రిచర్డ్‌సన్ (2014), హార్ధిక్ పాండ్యా (2015), ఫాఫ్ డుప్లెసిస్ (2019) లు ఈ ఘనత అందుకున్నారు. 


 






 






 






కాగా..  ఐపీఎల్ - 16లో రెండు ఓటముల తర్వాత రెండు విజయాలతో ట్రాక్‌లోకి వచ్చినట్టే కనిపించిన సన్ రైజర్స్   హైదరాబాద్ మళ్లీ అపజయాల బాట పట్టింది.  సొంత  గ్రౌండ్ ఉప్పల్ లో    ముంబై ఇండియన్స్‌పై మార్క్‌రమ్ సేనకు ఓటమి తప్పలేదు.  ముంబై నిర్దేశించిన  193 పరుగుల లక్ష్య ఛేదనలో  ఎస్ఆర్‌హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలొ 178 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ముంబై 14 పరుగుల తేడాతో గెలిచింది. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోవడం, సరైన భాగస్వామ్యం  లేకపోవడంతో  హైదరాబాద్‌కు ఓటమి  తప్పలేదు.  ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో సన్ రైజర్స్‌కు ఇది మూడో ఓటమి కాగా  ముంబైకి మూడో విజయం.