MI vs SRH: ఐపీఎల్ - 16లో రెండు ఓటముల తర్వాత రెండు విజయాలతో ట్రాక్‌లోకి వచ్చినట్టే కనిపించిన సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ అపజయాల బాట పట్టింది. సొంత గ్రౌండ్ ఉప్పల్ లో ముంబై ఇండియన్స్‌పై మార్క్‌రమ్ సేనకు ఓటమి తప్పలేదు. ముంబై నిర్దేశించిన 193 పరుగుల లక్ష్య ఛేదనలో ఎస్ఆర్‌హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలొ 178 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ముంబై 14 పరుగుల తేడాతో గెలిచింది. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోవడం, సరైన భాగస్వామ్యం లేకపోవడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో సన్ రైజర్స్‌కు ఇది మూడో ఓటమి కాగా ముంబైకి మూడో విజయం.
ముంబై నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ ఇన్నింగ్స్ ఆదిలోనే కుదుపునకు లోనైంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన హ్యారీ బ్రూక్ (9) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. రెండో ఓవర్లోనే బెహ్రాండర్ఫ్ అతడిని ఔట్ చేశాడు. అతడే వేసిన నాలుగో ఓవర్లో రాహుల్ త్రిపాఠి (7) కూడా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పవర్ ప్లే లో హైదరాబాద్ 2 వికెట్ల నష్టానికి 42 పరుగులే.
ఆ తర్వాత కూడా సన్ రైజర్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మార్క్‌రమ్ ఆదుకుంటాడని హైదరాబాద్ అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగానే ఓ సిక్స్, ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించిన అతడు.. గ్రీన్ వేసిన 9వ ఓవర్లో షోకీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ (1) అలా వచ్చి ఇలా వెళ్లాడు.
క్లాసెన్ బాదెన్..
10 ఓవర్లకే 76 పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో హైదరాబాద్ 120 చేస్తే గొప్ప అనుకున్న దశలో వచ్చిన హెన్రిచ్ క్లాసెన్.. నాటుకొట్టుడు కొట్టాడు. ఆడింది 16 బంతులే అయినా 4 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. చావ్లా వేసిన 14వ ఓవర్లో 4, 6, 6, 4 తో దుమ్మురేపిన అతడు ఐదో వికెట్ కు మయాంక్ తో కలిసి 29 బంతుల్లోనే 55 పరుగులు జోడించాడు. కానీ అదే ఓవర్లో ఆఖరి బంతికి భారీ షాట్ ఆడి టిమ్ డేవిడ్ చేతికి చిక్కాడు.
వికెట్లు టపటప..
ఓపెనర్ గా వచ్చి బాల్‌కు ఒక రన్ చొప్పున ఆడిన మయాంక్ అగర్వాల్ (41 బంతుల్లో 48, 4 ఫోర్లు, 1 సిక్స్) ను మెరిడిత్ 15వ ఓవర్లో పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన మార్కో జాన్‌సెన్ (6 బంతుల్లో 13, 3 ఫోర్లు) మూడు బౌండరీలు కొట్టినా మెరిడిత్ వేసిన 17వ ఓవర్లో అతడు కూడా డేవిడ్ కే క్యాచ్ ఇచ్చాడు. ఆరు బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ కూడా రనౌట్ అయ్యాడు.
ఆఖర్లో..
చివరి రెండు ఓవర్లలో 24 పరుగులు కావాల్సి ఉండగా గ్రీన్ వేసిన 19వ ఓవర్లో 4 పరుగులే వచ్చాయి. అర్జున్ టెండూల్కర్ వేసిన చివరి ఓవర్లో రెండో బంతికి అబ్దుల్ సమద్ (9) రనౌట్ కాగా ఐదో బాల్‌కు భువనేశ్వర్ (2) రోహిత్‌కు క్యాచ్ ఇవ్వడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది.