MI vs SRH, 1 Innings Highlights: చిన్నస్వామి స్టేడియంలో సోమవారం  ఆర్సీబీ - సీఎస్కేల మధ్య  జరిగిన మ్యాచ్‌లో సిక్సర్లు, బౌండరీల వర్షాన్ని మరిచిపోకముందే ఐపీఎల్‌లో మరో పరుగుల తుఫాను వీచింది.  సన్ రైజర్స్ హైదరాబాద్  - ముంబై ఇండియన్స్ మధ్య  ఉప్పల్ వేదికగా జరుగుతున్న 25వ లీగ్ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు  హైదరాబాద్ బౌలర్లపై పోటెత్తారు.   కామెరూన్ గ్రీన్  (40 బంతుల్లో 64 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు ), తిలక్ వర్మ  (17 బంతుల్లో  37,  2 ఫోర్లు, 4 సిక్సర్లు) , ఇషాన్ కిషన్  (31 బంతుల్లో 38, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఫలితంగా  నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్.. 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.  ముంబై మెరుపులు మెరిపించిన  పిచ్ పై ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు ఏం చేసేనో మరి..!


టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభమే దక్కింది.  కెప్టెన్ రోహిత్ శర్మ .. 18 బంతుల్లోనే  6 బౌండరీల సాయంతో 28 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన మూడో ఓవర్లో హిట్‌మ్యాన్  హ్యాట్రిక్ ఫోర్ కొట్టాడు. ఈ క్రమంలో అతడు ఐపీఎల్‌లో  ఆరు వేల పరుగులు పూర్తి చేసుకున్న  నాలుగో బ్యాటర్ (కోహ్లీ, ధావన్, వార్నర్ లు ముందున్నారు) అయ్యాడు. ఇషాన్ కూడా ధాటిగా ఆడటంతో 4 ఓవర్లలోనే ముంబై స్కోరు 33 పరుగులుకు చేరింది.  ఈ జోడీని నటరాజన్ విడదీశాడు.  నటరాజన్ వేసిన  నాలుగో ఓవర్లో   మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడిన రోహిత్..  మార్‌క్రమ్  ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. 


కిషన్  - గ్రీన్  నిలకడ.. 


రోహిత్ నిష్క్రమించాక వన్ డౌన్‌గా వచ్చిన కామెరూన్ గ్రీన్‌తో కలిసి  ఇషాన్ ముంబై ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఇద్దరూ కలిసి 39 బంతుల్లోనే  46 రన్స్ జోడించారు.  పవర్ ప్లే తర్వాత  ముంబై స్కోరు వేగం కాస్త తగ్గింది.   అయితే  ఇషాన్ - గ్రీన్ మాత్రం రన్ రేట్ 8కి తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. కానీ  మార్కో జాన్‌సేన్ ముంబైకి డబుల్ షాకిచ్చాడు.  అతడు వేసిన 12వ ఓవర్లో   ఫస్ట్ బాల్‌కు ఇషాన్.. మార్క్‌రమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆడిన  రెండో బాల్‌కు సిక్సర్ కొట్టిన సూర్యకుమార్ యాదవ్ (7)  ఆ మరుసటి బంతికే పెవిలియన్ బాటపట్డాడు. ఈ క్యాచ్ కూడా సన్ రైజర్స్ సారథి ఖాతాలోనే పడింది. 


తిలక్ మెరుపులు.. 


సూర్య ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ.. సన్ రైజర్స్ బౌలర్లపై కసిగా బాదాడు. జాన్‌సెన్  వేసిన 15వ ఓవర్లో   6, 6  కొట్టిన అతడు మార్కండే వేసిన మరుసటి ఓవర్లో  4, 6 తో ముంబై స్కోరు వేగాన్ని   పెంచాడు. గ్రీన్‌తో కలిసి 26 బంతుల్లోనే  50 పరుగులు జోడించిన  తిలక్. భువనేశ్వర్ వేసిన 17వ ఓవర్లో మూడో బాల్‌కు  మయాంక్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చాడు.  


 






గ్రీన్ ధమాకా.. 


చివర్లో ముంబై స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. దీనికి కారణం కామెరూన్ గ్రీన్. నటరాజన్ వేసిన  18వ ఓవర్లో అతడు  4, 4, 4, 6 తో  20 పరుగులు రాబట్టాడు. తద్వారా ఐపీఎల్ లో   మొదటి  అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎస్‌ఆర్‌‌హెచ్ బౌలర్లలో  మార్కో జాన్‌సెన్  రెండు వికెట్లు తీయగా  భువీ,  నటరాజన్ తలా ఓ వికెట్ తీశారు.