IPL 2023 SRH vs MI: పది రోజుల గ్యాప్ తర్వాత  హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు మరోసారి  ఐపీఎల్ కనువిందు చేయనుంది.   ఈనెల 9న పంజాబ్  కింగ్స్‌ను ఓడించి ఈ సీజన్‌లో బోణీ కొట్టిన మార్క్‌రమ్ సేన.. నేడు  అదే వేదికపై  రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌తో తలపడుతున్నది.  ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు  తొలుత బ్యాటింగ్ చేయనుంది.  ముంబైతో గత మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన డువాన్ జాన్‌సెన్ ఈ మ్యాచ్ లో ఆడటం లేదని హిట్‌మ్యాన్ టాస్ సందర్భంగా చెప్పగా  హైదరాబాద్ టీమ్‌లో కూడా ఉమ్రాన్ మాలిక్ ఆడటం లేదు. 


ఐపీఎల్-16ను  ఈ రెండు జట్లూ ఓటమితోనే ఆరంభించాయి.  వరుసగా రెండు ఓటముల తర్వాత విజయాల బాట పట్టాయి.  రాజస్తాన్, లక్నో చేతిలో ఓడిన  హైదరాబాద్.. పంజాబ్‌ను ఉప్పల్ లో మట్టికరిపించి  బోణీ కొట్టి తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌ను  ఓడించి జోరుమీదుంది.  


గెలిస్తే సిక్స్త్ ప్లేస్..!


ముంబై ఇండియన్స్  సైతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో  చావుదెబ్బ తిని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓడింది.  కానీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరును జయించి, కేకేఆర్‌నూ ఓడించి  రోహిత్ సేన కూడా ఊపుమీదుంది. పాయింట్ల పట్టికలో ముంబై 8వ, హైదరాబాద్ 9వ స్థానంలో ఉన్నాయి.  నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు  ఆరు పాయింట్లు (రెండు జట్లకు చెరో నాలుగు పాయింట్లే ఉన్నాయి) సాధించి ఆరో స్థానానికి దూసుకెళ్లొచ్చు.   మరి ఆ అవకాశం ఎవరికి దక్కేనో తెలియాలంటే  మరికొంతసేపు వేచి చూడాలి. 


వాళ్లదే పైచేయి.. 


ఐపీఎల్‌లో  హైదరాబాద్ - ముంబైలు ఇప్పటివరకు  19 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై 10 సార్లు గెలవగా హైదరాబాద్ 9 మ్యాచ్‌లలో నెగ్గింది. ఉప్పల్  స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఏడు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో సన్ రైజర్స్ 3, ముంబై 4  సార్లు జయకేతనం ఎగురేసింది. ఐపీఎల్‌లో ఈ జట్లు ముఖాముఖి తలపడ్డ గత ఐదు మ్యాచ్‌లలో ఎస్ఆర్‌హెచ్ రెండుసార్లే నెగ్గగా  ఎంఐ మూడింట్లో విజయాలు సాధించింది. 2022లో జరిగిన ఏకైక మ్యాచ్‌ను హైదరాబాదే గెలుచుకుంది. ఈ మ్యాచ్ గెలిస్తే, ఉప్పల్ లో ముంబైతో లెక్క సరిచేసినట్లు అవుతుంది.


 






తుది జట్లు :  


సన్ రైజర్స్ హైదరాబాద్ :  మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, అయిడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్,   వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్‌సెన్, భువనేశ్వర్ కుమార్,  టి నటరాజన్,  మయాంక్ మార్కండే 


ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, నెహల్ వధేర, హృతీక్ షోకీన్