ఐపీఎల్‌ అంటేనే బెట్టింగ్! ఎంత నిఘా వేసినా, చాపకింద నీరులా దందా సాగుతుంది! అవి కొన్నిచోట్ల ఎంత ఆర్గనైజ్డ్‌గా జరుగుతాయో తెలుసుకుంటే కళ్లు బైర్లు కమ్ముతాయి! కరెన్సీ కట్టలు తెంచుకుంటుంది! పెద్దనోట్లన్నీ గుట్టలు గుట్టలుగా పోగుపడుతుంటాయి! ఫోన్లు నిరాటంకంగా పనిచేస్తాయి! బూకీలకు ఊపిరి తీసుకోడానికి టైముండదు. పంటర్లంతా హైరానా పడుతుంటారు. బాటిళ్లకు బాటిళ్లు మందు ఖాళీ అవుతుంటుంది. లాప్‌టాప్స్‌ బిజీబిజీగా నడుస్తుంటాయి! బంతిబంతికీ అమౌంట్ మారుతుంటుంది! ఓవర్ ఓవర్‌కీ కరెన్సీ కలెక్ట్ అవుతుంటుంది. ఆన్ లైన్‌ ట్రాన్సాక్షన్స్ విరామం లేకుండా నడుస్తుంటాయి. అడ్వాన్సులు అందుతుంటాయి. మరోపక్క కలెక్షన్ వసూలవుతుంటుంది. ఫైనల్‌గా ఈ ఆటలో బుకీ మాత్రమే డబ్బు సంపాదిస్తాడు! పంటర్లు పైసలు పోగొట్టుకుని అప్పుల పాలవుతుంటారు! ఇదీ బెట్టింగ్ జరిగే తీరు! సరిగ్గా అలాంటి బెట్టింగ్ రాకెట్‌ గుట్టుని రట్టుచేశారు SOT పోలీసులు.


బుకీలు దొరికారు.. పంటర్లు షార్పుగా తప్పించుకున్నారు!


సోమవారం నాడు RCB Vs CSK! ఇలాంటి స్టార్‌వార్‌ వచ్చినప్పుడు సగటు ప్రేక్షకుడికే ఆసక్తి, ఉత్కంఠ ఎక్కువ! అలాంటిది బెట్టింగ్‌ బాబులకు ఇంకెంత ఇంట్రస్ట్ ఉండాలి!  ఇలాంటి మ్యాచులు జరిగినప్పుడే కదా.. నాలుగు కట్టలు వెనకేసుకునేది! పోలీసులు ఊహించిందే నిజమైంది! ఒక విశ్వసనీయ సమాచారం- లక్షల రూపాయల అక్రమ దందాను బ్రేక్ చేసింది. సైబరాబాద్ కమిషనరేట్‌లోని SOT పోలీసులు, రాజేంద్రనగర్ జోన్, మొయినాబాద్ పోలీసు బృందం కలసి.. ఓ ఫామ్ హౌస్‌పై దాడి చేశారు. సరిగ్గా రాత్రి 10.45కి  జాయింట్ ఆపరేషన్ స్టార్టయింది. ఒక్కసారిగా ఫామ్‌హౌజ్ చుట్టూ రౌండప్ చేస్తే, బుకీలు దొరికారు. పంటర్లు షార్పుగా తప్పించుకున్నారు. ఫోన్లు, లాప్‌టాప్స్‌, కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఈ రెయిడ్‌లో ముగ్గురు బుకీలు దొరికారు. 2 స్కోర్ పేపర్లు కనిపించాయి. ట్యాబ్స్‌, స్మార్ట్ ఫోన్లు, రూ. 40 లక్షల లిక్విడ్‌ క్యాష్‌ స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్లో రూ. 12,10,054 క్యాష్‌ ఉన్నట్టుగా గుర్తించారు. ఈ ఒక్క మ్యాచ్‌ కోసమే సుమారు రూ. 53 లక్షల ట్రాన్సాక్షన్ (ఆన్ లైన్/ఆఫ్‌ లైన్) సాగినట్టు పోలీసులు వెల్లడించారు.  


నమోదు చేసిన FIR ప్రకారం A1, A5, A6, A7, A8, A9 నిందితులు పరారీలో ఉన్నారు. వీళ్లంతా పంటర్లని పోలీసులు పేర్కొన్నారు. A-1 నిందితుడు శంకర్. ఇతనిది కూకట్‌పల్లి. మెయిన్ నిర్వాహకుడు.  A-5 భాస్కర్. ఇతను పంటర్. A6- సిద్ధు. ఇతను కూడా పంటరే. A-7 మల్లి, A-8 సాయిరెడ్డి, A-9 బాషా.. -వీళ్లంతా పంటర్లే! ఇకపోతే, A-2 తిరుపతయ్య. పట్టుబడిన ఇతను బుకీ. బియ్యం వ్యాపారం చేస్తుంటాడు. A-3 నిందితుడు- పెద్దిగారి నాగరాజు. ఇతనూ బిజినెస్‌మేన్. సొంతూరు మాల్తుమ్మెద గ్రామం, కామారెడ్డి జిల్లా. A-4 పాగల మల్లా రెడ్డి. ఈయన బిల్డర్. సొంతూరు సిద్దిపేట జిల్లా, తొగుట. ఇతను నాగరాజు అనే వ్యక్తికి సహాయకుడిగా ఉన్నాడు.  


పోలీసులు ఇచ్చే సలహా ఏంటంటే..


త్వరగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో క్రికెట్ బెట్టింగ్‌ ఒక వ్యసనంగా మారింది. ఈ ఆటలో బుకీలు మాత్రమే డబ్బు సంపాదిస్తారు. పంటర్లు డబ్బును పోగొట్టుకుంటారు. ఇది నిత్యం జరిగేదే. ఇలాంటి దందా మూలంగా బ్యాంక్ అకౌంట్, వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశం ఉంది. బుకీలు సంపాదించుకుంటారు. బాధితులు అప్పుల పాలవుతుంటారు. అవసరమైతే ఆస్తులు అమ్ముకుంటారు. వీలైతే తాకట్టు పెడతారు. ఎంతకైనా దిగజారుతారు. అందుకే ఇలాంటి బెట్టింగుల జోలికి పోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరి దృష్టికైనా ఇలాంటి దందా సమాచారం తెలిస్తే సైబరాబాద్ పోలీసులు వాట్సాప్ నెంబర్‌ ఇచ్చారు. 94906 17444 ఈ నంబర్‌కు బెట్టింగ్ డిటెయిల్స్ తెలియజేయవచ్చు.