మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వివాదం మొదలైంది. మొన్నిటికి మొన్న శివసేనలో రేగిన సంక్షోభం ఇంకా చల్లారనేలేదు ఇప్పుడు ఎన్సీపీలో చిచ్చు రేగేలా కనిపిస్తోంది. 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్ బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. కాసేపట్లో ముంబయిలో కీలక సమావేశం కూడా పెట్టుకోబోతున్నారని సమాచారం.  


శివసేనలో తిరుగుబాటు తీసుకొచ్చిన ఏక్‌నాథ్‌ షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా కాలేదు. అప్పుడే ఎన్సీపీలో కూడా చీలిక వచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి అజిత్ పవార్ వెంట 11 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అజిత్ పవార్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా కీలక ప్రకటన చేశారు. రాబోయే రెండు వారాల్లో రెండు పెద్ద రాజకీయ ప్రకంపనలు ఉండబోతున్నాయని చెప్పారు. 


అధినేత శరద్ పవార్ మాత్రం ఇదంతా మీడియా మదిలో ఉన్న చర్చేనంటూ కొట్టిపారేస్తున్నారు. తమ మనసులో అలాంటి ఆలోచన లేదంటున్నారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నారన్నారు. అజిత్ పవార్ ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయలేదని తెలిపారు. 


ఇంతకీ సుప్రియా సూలే ఏం చెప్పారంటే?.






సుప్రియా సూలే చేసిన ప్రకటనతో మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అజిత్ పవార్ ఎక్కడ అని సుప్రియా సూలేను ప్రశ్నించగా.. ఆమె మాట్లాడుతూ.. వారి వెంట వెళితే వారు ఎక్కడున్నారో తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, పనులు జరగడం లేదని, అందుకే అజిత్ పవార్ కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారని చెప్పారు. ఒక ఈవెంట్ క్యాన్సిల్ చేయడం వల్ల ఏమీ జరగదని సుప్రియా సూలే అన్నారు.


పదిహేను రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు వస్తాయని కొద్ది రోజుల క్రితం ప్రకాశ్ అంబేడ్కర్ చెప్పారు. దీనిపై సుప్రియా సూలేను ప్రశ్నించగా ఒకటి కాదు రెండు రాజకీయ ఉద్యమాలు వస్తాయని, ఒకటి ఢిల్లీలో, మరొకటి మహారాష్ట్రలో వస్తుందన్నారు. 






ఎన్సీపీ అధ్యక్షుడుశరద్ పవార్ ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీ కేసులో జేపీసీ ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్‌ను వ్యతిరేకించారు. అజిత్ పవార్ కూడా మోడీ పనితీరును కొనియాడారు. ఈవీఎంలపై కూడా తనకు నమ్మకం ఉందని అజిత్ పవార్ చెప్పారు. ఓడిపోయిన పార్టీ ఈవీఎంలను నిందిస్తుంది. అయితే ఇది ప్రజాభిప్రాయమని అంగీకరించాలని అజిత్ పవార్ అన్నారు. గత కొన్ని నెలలుగా ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ పై విమర్శలు చేయడం మానేశారు. వీటన్నింటి కారణంగా అజిత్ పవార్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.