15 years of IPL: 2007లో ఇంగ్లాండ్‌లో వింబూల్డన్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన ఓ వ్యక్తి మదిలో మెదిలిన ఆలోచన.. వింబూల్డన్ లాంజ్ లో కూర్చుని టెన్నిస్ మ్యాచ్ చూస్తూ కాఫీ తాగుతున్న ఆ వ్యక్తి ‘నేను భారత క్రికెట్ రూపు రేఖలను మారుస్తా. విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనుకుంటున్నా..’అని చెప్పినప్పుడు ఆ పెద్ద మనిషి కూడా ఊహించి ఉండడు, తన ఆలోచన పదిహేనేండ్లలో లక్ష కోట్ల రూపాయల విలువ కలిగే ఒక లీగ్‌ను తాను తయారుచేయబోతున్నానని..! ఆయన ఆలోచన కొద్దికాలంలోనే రూపుదిద్దుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైంది. గడిచిన పదిహేనేండ్లుగా ‘ఇంతింతై వటుడింతై’ అన్నంతగా ఎదిగింది. ఆ వ్యక్తి మరెవరో కాదు.. లలిత్ మోడీ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఐపీఎల్‌కు కర్త, కర్మ, క్రియ ఆయనే. లలిత్ మోడీ ఆలోచనకు వాస్తవ రూపం కలిగి ఈ లీగ్ మొదలై నేటికి 15 ఏండ్లు. 2008 ఏప్రిల్ 18న బెంగళూరు వేదికగా ఐపీఎల్ ఘనంగా ఆరంభమైంది.
తొలి మ్యాచ్ లోనే విధ్వంసం..
ఐపీఎల్ ప్రకటన, వేలం, ఫ్రాంచైజీలు ఈ తతంగం అంతా ముగిశాక బెంగళూరులోకి చిన్నస్వామి వేదికగా ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. ఇదే చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్ ఓపెనింగ్ బ్యాటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్.. 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 158 పరుగులు చేసి ఐపీఎల్‌కు ఎలాంటి ఆరంభం కావాలో అంతకు రెట్టింపు ఇచ్చాడు. ఆ మ్యాచ్ లో కేకేఆర్ (సౌరవ్ గంగూలీ కెప్టెన్) 20 ఓవర్లలోనే 222 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆర్సీబీ.. 15.1 ఓవర్లలోనే 82 పరుగులకే చేతులెత్తేసింది. ఆ జట్టుకు ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ కాగా.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో 5 బంతులాడి ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.
వెలుగులోకి వందలాది మంది..
లలిత్ మోడీ ఆలోచన, ఆయన కల ఊరికే పోలేదు. అప్పటివరకూ టెస్టులలో రోజంతా ఆడితే 230 - 250, వన్డేలలో అయితే 260-270 స్కోర్లు చేస్తే మహా గొప్ప అనే స్థాయి నుంచి నేడు టీమిండియా ఈ రెండు ఫార్మాట్లలో దూకుడుగా ఆడటానికి ఐపీఎల్ కూడా కారణమైంది. ఈ లీగ్ ద్వారా మట్టిలో మాణిక్యాలెన్నో వెలుగులోకి వచ్చాయి. ఒకప్పుడు భారత క్రికెట్‌లో చోటు దక్కించుకోవాలంటే అదొక ప్రహసనం. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, రంజీలు, ఇరానీ ట్రోఫీ, విజయ్ హజారేలలో చచ్చీ చెడి టన్నుల కొద్దీ పరుగులు చేసినా టీమిండియాకు ఆడేది అనుమానంలో లేదు.
కానీ ఐపీఎల్ దీనిని మార్చింది. నీ దగ్గర టాలెంట్ ఉంటే అదే పెట్టుబడి. ఒక్క సీజన్ లో ప్రతిభ చూపెడితే బీసీసీఐ కూడా ‘వెల్‌కమ్’ బోర్డు పెట్టేస్తోంది. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినోళ్లే. భారత జట్టులోనే కాదు డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), ఏబి డివిలియర్స్, డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా), క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో (వెస్టిండీస్) ఈ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చినోళ్లే..
సెంచరీల మోత..
వన్డే క్రికెట్‌లో ఒకప్పుడు సెంచరీ చేయాలంటే ఓపెనర్ గా వచ్చిన ఆటగాడు 30 ఓవర్లు దాటిన తర్వాత గానీ సెంచరీ చేయకపోయేది. కానీ టీ20 ఆ విధానాన్ని సమూలంగా మార్చింది. ఐపీఎల్ దానిని పీక్స్‌కు తీసుకెళ్లింది. 2008 ఎడిషన్ లోనే ఐపీఎల్ లో ఆరు సెంచరీలు నమోదుయ్యాయి. మొన్న ముంబై - కోల్కతా మ్యాచ్ లో వెంకటేశ్ అయ్యర్ సెంచరీ ఐపీఎల్ చరిత్రలో 74వది.
15 ఏండ్ల ఐపీఎల్‌లో మరికొన్ని..
- అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్లు : ముంబై ఇండియన్స్ (5), చెన్నై సూపర్ కింగ్స్ (4)
- అత్యధిక పరుగులు : విరాట్ కోహ్లీ (6,844)
- అత్యధిక వికెట్లు : డ్వేన్ బ్రావో (183)
- అత్యధిక సెంచరీలు : క్రిస్ గేల్ (6)
- ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు : 175 నాటౌట్ (ప్రపంచంలోని ఏ లీగ్ క్రికెట్ లో అయినా ఇదే హయ్యస్ట్)
- బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ : అల్జారీ జోసెఫ్ (6-12, సన్ రైజర్స్ హైదరాబాద్ పై )
- లీగ్ లో అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టు : సీఎస్కే (9సార్లు) ముంబై (ఆరు సార్లు)
- ఫస్ట్ సీజన్ విజేత : రాజస్తాన్ రాయల్స్
- ఒక సీజన్ లో అత్యధిక పరుగులు : విరాట్ కోహ్లీ (973)