Harry Brook Century:  ‘టెస్టులు ఆడుకునేవాడిని తీసుకొచ్చి మా నెత్తిన బెట్టారు..’, ‘రూ. 13 కోట్లు తీసుకున్నావని  13 పరుగులే చేస్తావా..?’, ‘బంజారాహిల్స్ బ్రూక్ అన్నారు.  బ్యాటింగ్ చేయిరా అంటే  గ్రౌండ్‌లో పట్టుమని పది నిమిషాలు కూడా ఉండట్లేదు..’.. ఇవీ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌కు ముందు  ఇంగ్లాండ్  యువ సంచలనం, ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న హ్యారీ బ్రూక్ గురించి  సోషల్ మీడియాలో వినిపించిన కామెంట్స్.  ఐపీఎల్-16కు ముందు  కొచ్చిలో జరిగిన వేలం ప్రక్రియలో  హైదరాబాద్  రూ. 13.25 కోట్లు పెట్టి  దక్కించుకున్న  బ్రూక్ కూడా  మరో విఫలప్రయత్నమే అనేందుకు  నెటిజన్లతో పాటు పలువురు ఆరెంజ్ ఆర్మీ అభిమానులు కూడా అతడిపై దుమ్మెత్తిపోశారు.  కానీ గంటన్నరలో అంతా మారింది. 


ఇది సార్ బ్రాండ్ అంటే.. 


కేకేఆర్‌తో  ఈడెన్ గార్డెన్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భాగంగా  టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన బ్రూక్‌ను చూడగానే.. ‘మళ్లీ వీడినే తీసుకొచ్చార్రా బాబూ..’ అనుకున్నారు ఎస్ఆర్‌హెచ్ అభిమానులు.  కానీ  బ్రూక్ మైండ్‌లో ఇవేమీ లేవు. అతడి స్క్రిప్ట్ మరో రకంగా ఉంది. పిల్లకాలువలా మొదలైన  ఆ ప్రవాహం ఒక దశలో  తనకు తోడుగా వచ్చిన సెలయేర్లను కలుపుకుంటూ  చివర్లో  పోటెత్తింది. 


ఈశాన్య భారతం నుంచి వీచే ఈదురుగాలులు ఈడెన్ గార్డెన్‌ను తాకకముందే  మరో  తుఫాను  కేకేఆర్ బౌలర్లను కమ్మేసింది.  ఎవరికి బంతినివ్వాలే తెలియదు.   ఎక్కడ బాల్ వేయాలో తెలియదు. విధ్వంసం..  అంతా విధ్వంసం.. ఏం జరిగిందో తేరుకునే లోపే  ‘ఇది సార్  ఈ బ్రూక్ గాడి బ్రాండ్’ అంటూ ‘ఐపీఎల్ - 16లో  మొదటిసారిగా మూడంకెల స్కోరు బాదిన తొలి  బ్యాటర్’ అని  టీవీలు, మొబైల్ తెరలు  మార్మోగుతున్నాయి.   ట్విటర్‌లో  ట్వీట్ల టపాసులు పేలుతున్నాయి.  ఇన్‌స్టాగ్రామ్‌లో నిన్నామొన్నటిదాకా  అతడిని తిట్టిపోసిన ట్రోల్ పేజీలే వారిమీదే వాళ్లే ‘నోర్మూసుకో’ అన్నట్టు ట్రోల్ చేసుకున్నాయి. 


 






స్పిన్నర్లపై కాస్తో కూస్తో కనికరం చూపిన బ్రూక్.. పేసర్లను  చాకిరేవు దగ్గర  బట్టలను బండకేసి బాదిన దానికంటే ఎక్కువ బాదాడు.  ముఖ్యంగా ఐపీఎల్ - 16లో ఫాస్టెస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్  వేసిన 15వ ఓవర్లో 6, 4,  4, 4, 4 తో నాటు కొట్టుడు కొట్టాడు. ఉమేశ్ యాదవ్, శార్దూల్  ఠాకూర్ కూడా బ్రూక్ బాదితులే. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఈ ఇంగ్లాండ్ కుర్రాడు.. తర్వాత 50 పరుగులు చేయడానికి  25 బంతులే తీసుకున్నాడు. మొత్తంగా  55 బంతుల్లో  12 బౌండరీలు, 3 సిక్సర్లతో  సెంచరీ చేశాడు. 


హోరెత్తిన ట్విటర్.. 


బ్రూక్ సెంచరీ తర్వాత  సోషల్ మీడియాలో అతడిని కీర్తిస్తూ  ఆరెంజ్ ఆర్మీ అభిమానులు పండుగ చేసుకున్నారు.  ఇన్నాళ్లు  అతడి మీద నమ్మకముంచి  ట్రోలింగ్ జరిగినా  పంటి కింద  విషంలా భావించిన చాలా మంది.. ‘ఎత్తిన ప్రతీ వేలూ ముడుచుకోవాలి. జారిన ప్రతీ మాట వెనక్కి తీసుకోవాలి..’ అని    అల్లు అర్జున్ డైలాగ్ ను  షేర్ చేస్తున్నారు.  మరికొంతమంది కేజీఎఫ్, మిర్చిలలో హీరో ఎలివేషన్  సీన్స్ షేర్ చేస్తూ ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తున్నారు. ఈ  మీమ్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.