Indian Premier League 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో తొలి సెంచరీ ఇన్నింగ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ బ్యాట్ నుంచి వచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై హ్యారీ బ్రూక్ 55 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. దీంతో ఇప్పుడు ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు సమర్పించుకున్న విషయంలో కోల్‌కతా జట్టు మొదటి స్థానంలో నిలిచింది.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు చాలా సెంచరీలు కనిపించాయి. అందులో హ్యారీ బ్రూక్ సెంచరీతో సహా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఇప్పటి వరకు 11 సార్లు సెంచరీ ఆడాడు. దీని తర్వాత ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ జాబితాలో రెండో, మూడో స్థానంలో నిలిచాయి. వీరిపై ఇప్పటివరకు చెరో తొమ్మిది సెంచరీ ఇన్నింగ్స్‌లు వచ్చాయి.
గత సంవత్సరంలో 24 ఏళ్ల యువ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్ గురించి ఎక్కువగా చర్చ జరిగింది. ఐపీఎల్‌లోనూ అతడిని తమ జట్టులో చేర్చుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 13 కోట్లకు పైగా ఖర్చు చేసింది. తొలి మూడు మ్యాచ్‌ల్లో హ్యారీ బ్రూక్ పెద్దగా రాణించలేదు, ఆ తర్వాత కోల్‌కతాతో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను అద్భుతమైన సెంచరీని చేశాడు.
ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)తో పాటు ఐపీఎల్‌లో సెంచరీ ఇన్నింగ్స్‌లు ఆడిన ఏకైక ఆటగాడు హ్యారీ బ్రూక్ మాత్రమే. హ్యారీ బ్రూక్ తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 102 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను ఇప్పటివరకు 32.81 సగటుతో 2461 పరుగులు చేశాడు. హ్యారీ బ్రూక్ పేరిట టీ20 ఫార్మాట్‌లో రెండు సెంచరీ ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. ఇది కాకుండా, అతని స్ట్రైక్ రేట్ 146.66గా ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ 1999 ఫిబ్రవరి 22వ తేదీన యార్క్‌షైర్‌లో జన్మించాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు కూడా బ్రూక్ కెప్టెన్‌గా ఉన్నాడు. బ్రూక్ 2020 సంవత్సరంలో ఇంగ్లాండ్‌లో ఆడిన T20 బ్లాస్ట్ టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత వెలుగులోకి వచ్చాడు.
మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను 55 యావరేజ్‌తో పరుగులు చేశాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన తర్వాత బ్రూక్ ఆగలేదు. ఇంకా మంచి ఫాంను కొనసాగించాడు. అతని అద్భుతమైన ఫామ్, ప్రతిభ కారణంగా 2022 జనవరి 26వ తేదీన వెస్టిండీస్‌తో జరిగిన టీ20 ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు.
టీ20ల్లో అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా హ్యారీ బ్రూక్ 2022 సెప్టెంబర్ 8వ తేదీన దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. హ్యారీ బ్రూక్ ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో అత్యంత నమ్మకమైన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు.
హ్యారీ బ్రూక్ 2022 పాకిస్థాన్ పర్యటనలో టెస్ట్ సిరీస్ సందర్భంగా చాలా చర్చకు వచ్చాడు. నిజానికి ఈ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బ్రూక్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ 468 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను మూడు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీని సాధించాడు. ఈ పర్యటనలో బ్రూక్ 93.60 సగటుతో స్కోర్ చేశాడు. అతని అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా అతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా ఎంపికయ్యాడు.