CSK vs KKR: కోల్‌కతా నైట్ రైడర్స్ సారథి నితీశ్ రాణాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరోసారి షాకిచ్చింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ లో రాణా మరోసారి స్లో ఓవర్ రేట్ నిబంధనలను ఉల్లంఘించడమే గాక అంపైర్ తో వాగ్వాదానికి దిగినందుకు గాను బీసీసీఐ అతడి మ్యాచ్ ఫీజులో భారీగా కోత విధించింది.
చెన్నైతో మ్యాచ్ లో నిర్ణీత సమయంలో 20 ఓవర్ల కోటాను పూర్తి చేయనందుకు గాను అంపైర్లు మ్యాచ్ లోనే చివరి ఓవర్ వేసే ముందు కేకేఆర్ కెప్టెన్‌కు షాకిచ్చారు. సమయం మించిపోవడంతో ఆఖరి ఓవర్ లో ఫీల్డింగ్ నిబంధనలను మార్చారు. ఇది రాణాకు ఆగ్రహం తెప్పించడంతో అతడు ఆన్ ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు.
ఈ చర్యతో బీసీసీఐ రాణాకు షాకిచ్చింది. ఈ సీజన్ లో రెండోసారి స్లోఓవర్ రేట్ మెయింటెన్ చేసినందుకు గాను రాణా మ్యాచ్ ఫీజులో రూ. 24 లక్షల కోత విధించింది. ఇదివరకే రాణా.. కొద్దిరోజుల క్రితమే పంజాబ్ కింగ్స్ తో ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో నిర్ణీత సమయంలో 20 ఓవర్ల కోటాను పూర్తి చేయనందుకు రూ. 12 లక్షల జరిమానాను ఎదుర్కున్నాడు.
ఈ సీజన్ లో రాణా.. బీసీసీఐ ఆగ్రహానికి గురికావడం ఇది మూడోసారి. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో రాణా.. ముంబై స్పిన్నర్ హృతీక్ షోకీన్ తో గొడవకు దిగిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా రాణా జరిమానాను ఎదుర్కున్నాడు. ఐపీఎల్-16 లో హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఫాఫ్ డుప్లెసిస్, సంజూ శాంసన్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ లు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కున్నవారే. రెండుసార్లు ఈ నిబంధనను అతిక్రమించిన జట్లు మాత్రం ఆర్సీబీ, కేకేఆర్. ఇక నిన్న చెన్నై - కోల్‌కతా మధ్య ముగిసిన లో స్కోరింగ్ గేమ్ లో కేకేఆర్.. బౌలింగ్, బ్యాటింగ్ లలో రాణించి ప్లేఆఫ్ ఆశలను ఇంకా సజీవంగా ఉంచుకోవడం గమనార్హం.
జనమేమన్నా పట్టించుకోను..
ఇటీవలే కోల్‌కతా - రాజస్తాన్ మ్యాచ్ లో భాగంగా రాణా తొలి ఓవర్ వేసి 26 పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో పాటు ఓ డబుల్ తీసి 26 పరుగులు రాబట్టాడు. దీంతో రాణాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే దీనిపై తాజాగా రాణా స్పందిస్తూ.. ‘నా గురించి బయట జనం ఏమన్నా నేను పట్టించుకోను. నేను గతంలో కూడా బౌలింగ్ చేశాను. నా గురించి ఎవరేమనుకున్న నాకు అనవసరం. జైస్వాల్ ను ఔట్ చేద్దామనుకున్నా. కానీ అది అతడి రోజు.. జైస్వాల్ బాగా ఆడాడు..’అని చెప్పాడు.