MI in IPL: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆదివారం బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్ లో ఓడిన ముంబై.. ఈ సీజన్ ను కూడా ఓటమితోనే ఆరంభించింది. సీజన్‌లో తొలి మ్యాచ్‌ను ఓడటం ముంబైకి కొత్తేం కాదు. గడిచిన పదేండ్లుగా వాళ్లది అదే కథ.. 2013 నుంచి ప్రస్తుత సీజన్ వరకూ ముంబై ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో గెలిచిందే లేదు. ఇందుకు సంబంధించిన వివరాలివిగో..
చెత్త రికార్డు ఇదే..
క్యాష్ రిచ్ లీగ్ లో ఇతర టీమ్ లకు సాధ్యం కాని రీతిలో ఏకంగా ఐదు ట్రోఫీలు నెగ్గిన ముంబై ఇండియన్స్.. 2013 సీజన్ నుంచి తమ తొలి మ్యాచ్‌లను ఓడుతూనే ఉంది. 2013లో ముంబై.. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రెండు పరుగుల తేడాతో ఓడింది. 2014, 2015లలో కోల్కతా నైట్ రైడర్స్.. ముంబైని ఓడించింది. 2016, 2017 సీజన్‌లలో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్.. అంబానీ టీమ్‌ను మట్టికరిపించింది. 2018లో చెన్నై, 2019 లో ఢిల్లీ, 2020లో మళ్లీ సీఎస్కే చేతిలో ఓడింది రోహిత్ సేన. ఇక 2021 సీజన్ లో ఆర్సీబీ, 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ లు ముంబైని ఓడించాయి. తాజా సీజన్ లో కూడా ఆర్సీబీ చేతిలో ఎంఐకి ఓటమి తప్పలేదు.
ఆరంభం అధ్వాన్నంగా ఉన్నా అదిరిపోయే ఆట..
వరుసగా 11 సీజన్లలో తాము ఆడిన తొలి మ్యాచ్ ను ఓడిన ముంబై ఇండియన్స్.. ఇందులో 5 సార్లు ఏకంగా సీజన్ విజేతగా నిలవడం గమనార్హం. ఐపీఎల్ లో ముంబై సారథ్య పగ్గాలు అందుకున్న తర్వాత రోహిత్ శర్మ.. 2013లో తొలి ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. ఆ తర్వాత 2015, 2017, 2019, 2020లలో కూడా ముంబైనే ట్రోఫీ వరించింది. ఈ సీజన్ లో కూడా అటువంటి మ్యాజిక్ ఏదైనా రిపీట్ కాకపోతుందా..? అని ముంబై అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఆరంభం సరిగా లేకపోయినా తిరిగి పుంజుకునే అలవాటున్న ముంబై.. ఈ సీజన్ లో ఏం మ్యాజిక్ చేస్తుందో చూడాలి మరి..
గత సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడి ఏకంగా 10 మ్యాచ్ లలోనూ ఓడి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచిన ముంబై.. ఈసారి మాత్రం పుంజుకోవాలని భావిస్తున్నది. తొలి మ్యాచ్ లో ఆ మేరకు ప్రదర్శన చేయకపోయినా తదుపరి మ్యాచ్ లలో మాత్రం రాణించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. ఆర్సీబీతో తొలి మ్యాచ్ లో రోహిత్, ఇషాన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ లు దారుణంగా విఫలమయ్యారు. కానీ ఆంధ్రా కుర్రాడు తిలక్ వర్మ మాత్రం.. 46 బంతుల్లోనే 9 బౌండరీలు, 4 భారీ సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తిలక్ క్ తోడుగా పై నలుగురిలో ఎవరైనా ఒక్కరు నిలిచినా ముంబై మరో 30-40 పరుగులైనా ఎక్కువ చేసేది.