Rohit Sharma in IPL: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ ఈ లీగ్‌లో మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో28 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఆరు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా ఈ క్లబ్‌లో చేరిన నాలుగో బ్యాటర్‌గా గుర్తింపుపొందాడు.
క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ మైలురాయిని అందుకున్న నాలుగో బ్యాటర్ రోహిత్ శర్మ. ఐపీఎల్ లో రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ లు 6 వేల పరుగుల క్లబ్ లో చేరారు. ఆ జాబితాను ఇక్కడ చూద్దాం.
ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల వీరులు :
- విరాట్ కోహ్లీ - 228 మ్యాచ్‌లు 220 ఇన్నింగ్స్ - 6,844 పరుగులు
- శిఖర్ ధావన్ - 210 మ్యాచ్‌లు 209 ఇన్నింగ్స్ - 6,477 పరుగులు
- డేవిడ్ వార్నర్ - 167 మ్యాచ్‌లు 167 ఇన్నింగ్స్ - 6,109 పరుగులు
- రోహిత్ శర్మ - 232 మ్యాచ్‌లు 227 ఇన్నింగ్స్ - 6,014 పరుగులు
- ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్న ఆటగాడు సురేశ్ రైనా. అతడు 205 మ్యాచ్‌లు ఆడి 200 ఇన్నింగ్స్‌లలో 5,528 రన్స్ చేశాడు.
ఐపీఎల్‌లో రోహిత్ ప్రస్థానం..
ఐపీఎల్ ఓపెనింగ్ సీజన్ (2008) నుంచి ఈ లీగ్ ఆడుతున్న రోహిత్.. 2008 నుంచి 2010 వరకు డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడాడు. 2011 నుంచి ముంబై ఇండియన్స్‌లో కొనసాగుతున్నాడు. ముంబై జట్టులోకి వచ్చిన తర్వాత రెండు సీజన్లకే అతడు సారథిగా నియమితుడయ్యాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్.. 2013, 2015, 2017, 2019, 2020లలో ముంబైకి ట్రోఫీలు అందించిన సారథిగా నిలిచాడు. 2012 సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై సెంచరీ చేసిన రోహిత్.. మొత్తంగా 41 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. బ్యాటింగ్ తో అలరించే రోహిత్ కు ఐపీఎల్‌లో బౌలర్ గా హ్యాట్రిక్ వికెట్ తీసిన రికార్డు ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. 2009 ఐపీఎల్ సీజన్ లో రోహిత్.. ఇదే ముంబై ఇండియన్స్‌కు వ్యతిరేకంగా ఆడుతూ హ్యాట్రిక్ వికెట్ తీశాడు. అప్పటి ముంబై బ్యాటర్లు అభిషేక్ నాయర్, హర్భజన్ సింగ్, జేపీ డుమినిలను వరుస బంతుల్లో ఔట్ చేశాడు.
డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడుతున్నప్పుడు 2008 సీజన్ లో 12 ఇన్నింగ్స్ లలో 404 పరుగులు చేసిన రోహిత్.. ఆ తర్వాత 2017 వరకూ 300 + స్కోర్లు చేస్తూ నిలకడగా రాణించాడు. అత్యధికంగా ఐపీఎల్ -2013లో 538 రన్స్ చేశాడు. ఆ ఏడాదే ముంబై ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది. కానీ గడిచిన రెండు సీజన్లలో రోహిత్ ఆటలో క్రమక్రమంగా మెరుపులు తగ్గుతున్నాయి. 2021 సీజన్ లో 13 మ్యాచ్‌లలో 381 పరుగులు చేసిన రోహిత్.. 2022 సీజన్ లో 268 పరుగులే చేశాడు. గత సీజన్ లో రోహిత్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. అలా ఒక్క హాఫ్ పెంచరీ కూడా లేక సీజన్ ను ముగించడం రోహత్ కు అదే ఫస్ట్.