MI vs CSK: ఐపీఎల్-16 మొదలై వారం రోజులైంది. దాదాపు అన్ని జట్లూ తమ తొలి మ్యాచ్‌లను ఆడగా కొన్ని రెండింటినీ పూర్తిచేశాయి. ఎన్ని మ్యాచ్‌లు జరిగినా ఐపీఎల్‌లో అభిమానులతో పాటు   ఆటగాళ్లు కూడా అత్యంత   ఆసక్తిగా  ఎదురుచూసేది  ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్  మ్యాచ్ గురించేనని చెప్పడంలో అతిశయోక్తే లేదు.   ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్న ఈ రెండింటి మధ్య మ్యాచ్‌ను అభిమానులు  ‘ఎల్ క్లాసికో’గా అభివర్ణిస్తారు. సోషల్ మీడియాలో అయితే ముంబై - చెన్నై మ్యాచ్ గురించి  గురువారం నుంచే చర్చ మొదలైంది.  


అసలేంటి ‘ఎల్ క్లాసికో’ గోల..? 


గడిచిన రెండ్రోజులుగా సోషల్ మీడియాలో  ఎక్కడ చూసినా  ఎల్ క్లాసికో గోలే. అసలు  ముంబై - చెన్నై  మ్యాచ్‌ను అభిమానులు ఎందుకు అలా పిలుచుకుంటారు. యూరోపియన్ ఫుట్‌బాల్‌లో రియల్ మాడ్రిడ్ - బార్సిలోనా టీమ్స్‌కు వీరాభిమానులు ఉన్నారు. ఈ  రెండు జట్ల  జరిగే మ్యాచ్‌లు అభిమానులను  మునివేళ్లపై  నిల్చోబెడుతాయి.  ప్రతీ మ్యాచ్ ఉత్కంఠే. ఎప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం. ఐపీఎల్‌లో కూడా ముంబై - చెన్నై జట్లు  లీగ్ లోనే  మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్.  ఈ లీగ్ లో ఇదివరకు 15 సీజన్లు (ప్రస్తుతం 16వది) ముగియగా 9 టైటిల్స్‌ (ముంబై -5, చెన్నై-4)  ను  ఈ రెండు జట్లే పంచుకున్నాయి.  ఈ రెండు జట్ల  మధ్య జరిగే మ్యాచ్‌లు కూడా  ఉత్కంఠగా జరుగుతాయి.  


స్టార్ట్ చేసింది ముంబై సారథే..? 


ఐపీఎల్‌లో  ఈ రెండు జట్ల మధ్య సమరాన్ని  ‘ఎల్ క్లాసికో’ అని అభివర్ణించింది  ముంబై ఇండియన్స్ సారథి  రోహిత్ శర్మనే. 2018లో  సీఎస్కేతో మ్యాచ్ గురించి ఏం చెబుతారు..? అని విలేకరులు అడగ్గా  రోహిత్‌తో పాటు  అప్పుడు టీమ్ లో వైస్ కెప్టెన్ గా ఉన్న  కీరన్ పొలార్డ్‌లు  ఎల్ క్లాసికో అని అన్నారు. అప్పట్నుంచి  ఇరు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఇదే పేరు స్థిరపడిపోయింది. 






ఎన్నిసార్లు తలపడ్డాయి..? 


ఐపీఎల్‌లో  ముంబై - చెన్నైలు  ఇప్పటివరకు  34 సార్లు తలపడ్డాయి. ఇందులో  చెన్నై కంటే ముంబై వైపే మొగ్గు ఎక్కువగా ఉంది.   సీఎస్కే  14 మ్యాచ్‌లను గెలవగా.. ముంబై  ఏకంగా 20 సార్లు నెగ్గింది.  వీటిలో  గ్రూప్ మ్యాచ్‌లు పోగా 9 సార్లు ఇరుజట్లూ  నాకౌట్ దశలో  పోటీ పడ్డాయి.   వీటిలో నాలుగు ఫైనల్స్ కూడా ఉన్నాయి. 2010 ఐపీఎల్ ఫైనల్స్, 2012 లో ఎలమినేటర్, 2013లో ఎలిమినేటర్, ఫైనల్స్  జరిగాయి. 2014లో ఎలిమినేటర్,  2015 క్వాలిఫయర్, ఫైనల్స్ లోనూ వీటి మధ్యే పోరు జరిగింది. 2019 లో  కూడా క్వాలిఫైయర్స్, ఫైనల్స్ జరిగాయి. 


ప్లేఆఫ్స్ లో  విజయాలు ఇలా..


ముంబై - సీఎస్కేల మధ్య 2010 ఫైనల్స్ లో ధోని సేన విజయం సాధించగా.. 2012లో కూడా సీఎస్కేదే  గెలుపు.   2013లో ఎలిమినేటర్ లో  సీఎస్కే గెలవగా ఫైనల్స్ లో  ముంబై నెగ్గింది. 2014లో సీఎస్కేనే విజయం వరించగా 2015 లో జరిగిన రెండు మ్యాచ్ లలోనూ ముంబైదే గెలుపు. 2019లో  కూడా ముంబైనే విజయం వరించింది. 2019 ఐపీఎల్ ఫైనల్ లో ఒక్క పరుగు తేడాతో ముంబై నెగ్గడాన్ని ఆ జట్టు అభిమానులు మరిచిపోలేరు.  


గతేడాది.. 


- 2022 సీజన్‌లో ఈ రెండు జట్లూ  రెండు సార్లు తలపడ్డాయి.   ఇరు జట్లూ తలా ఒక మ్యాచ్ గెలిచాయి.   


 






జట్ల టాప్ హైలైట్స్..


- మొత్తం మ్యాచ్‌లు : 34 
- ముంబై : 20 
- చెన్నై : 14 
- గ్రూప్ మ్యాచ్‌లను తీసేస్తే ప్లేఆఫ్స్ లో ఇరు జట్లూ  ఐదు సార్లు తలపడ్డాయి. ఇందులో సీఎస్కే 3, ముంబై రెండు గెలిచింది. నాలుగు సార్లు ఫైనల్స్ జరుగగా  ముంబై మూడు సార్లు, చెన్నై ఒకసారి గెలిచింది. 
- అత్యధిక పరుగులు : 736 (సురేశ్ రైనా-సీఎస్కే) 
- అత్యధిక వికెట్లు :  35 ( డ్వేన్ బ్రావో- సీఎస్కే) 
- సీఎస్కే హయ్యస్ట్ స్కోరు :  218  
- సీఎస్కే లోయస్ట్ స్కోరు : 79
- ముంబై హయ్యస్ట్ స్కోరు : 219 
- ముంబై లోయస్ట్ స్కోరు : 136