MI vs RR preview: పదహారేండ్లుగా భారత్‌తో పాటు ప్రపంచ క్రికెట్‌ అభిమానులను అలరిస్తూ మరే క్రికెట్ లీగ్‌కూ అందనంత ఎత్తుకు ఎదిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నేడు మరో  ప్రత్యేకత సాక్షాత్కారం కాబోతుంది. నేటి రాత్రి ముంబై ఇండియన్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య వాంఖెడే (ముంబై) వేదికగా జరుగబోయే మ్యాచ్  ఈ లీగ్‌లో  1000వ మ్యాచ్ కావడం గమనార్హం. 


రోహిత్‌కు బర్త్ డే గిఫ్ట్.. 


వాంఖెడేలో జరుగుబోయే  1000వ మ్యాచ్  ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా స్పెషల్. ఇవాళ (ఏప్రిల్ 30)  హిట్‌మ్యాన్  పుట్టినరోజు. అదీగాక  ముంబై ఇండియన్స్ పగ్గాలు (2013 ఏప్రిల్ 24) చేపట్టి కూడా  పది సంవత్సరాలు పూర్తి కావొచ్చింది. అంతేగాక కెప్టెన్ గా రోహిత్ కు ఇది 150వ మ్యాచ్.  దీంతో ఈ మ్యాచ్‌ను గెలిచి  రోహిత్‌కు బర్త్ డే గిఫ్ట్ గా అందజేయాలని  ముంబై  ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. ఓపెనర్ గా ఇషాన్ కిషన్ విఫలమవుతున్నా  కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ మంచి టచ్ లో ఉన్నారు.  పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో టచ్ లోకి వచ్చిన  సూర్య గుజరాత్ తో  కూడా బాగానే  ఆడాడు.  చివర్లో  టిమ్ డేవిడ్ కూడా ఓ చేయి వేస్తే వాంఖెడేలో  పరుగుల వరద ఖాయం. మరి వీరి రాజస్తాన్ బౌలర్లను ఎలా ఎదుర్కుంటారన్నది ఆసక్తికరం.


బౌలింగ్ లో ఆ జట్టు కీలక పేసర్ జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్ ఆడే అవకాశాలున్నాయి.  అర్జున్ టెండూల్కర్,  జేసన్ బెహ్రాన్‌డార్ఫ్ లు పేస్ బాధ్యతలు మోయనున్నారు.  ఆర్చర్ వస్తే  వీరిలో ఎవరో ఒకరు  బెంచ్ కే పరిమితం కావొచ్చు. స్పిన్నర్లలో పీయూష్ చావ్లా ఫామ్ కొనసాగిస్తుండటం ముంబైకి కలిసొచ్చేదే. 


 






టాప్ ప్లేస్ పై రాజస్తాన్ కన్ను.. 


ఈ సీజన్ లో 8 మ్యాచ్ లు ఆడి 5 విజయాలతో  పాయింట్ట పట్టికలో నెంబర్ 2 లో ఉన్న రాజస్తాన్ రాయల్స్.. ముంబైని ఓడించి  అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్నది. బ్యాటింగ్ లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, శాంసన్, హెట్‌మెయర్, ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్ లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఒకరు విఫలమైనా మరొకరు ఆడుతున్నారు.  వీరిలో ఏ ఇద్దరు నిలబడినా రాజస్తాన్ భారీ స్కోరు చేయడం పక్కా. బట్లర్ కు ముంబై మీద మంచి రికార్డు ఉంది. 


చెన్నైతో మ్యాచ్‌లో ఆడని   రాజస్తాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఈ మ్యాచ్ లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.  అతడొస్తే ముంబైకి తిప్పలు తప్పవు.  రోహిత్, ఇషాన్ లను తొలి ఓవర్లలోనే అతడు ఇబ్బందిపెట్టొచ్చ.  అతడికి తోడుగా సందీప్ శర్మ కూడా టచ్ లోనే ఉన్నాడు.  బౌల్ట్ వస్తే కుల్దీప్ యాదవ్ బెంచ్ లో ఉండొచ్చు. స్పిన్ విభాగంగలో అశ్విన్, జంపా, చాహల్ లు మెరుగైన ప్రదర్శనలు చేస్తున్నారు.  


 






పిచ్ రిపోర్టు : వాంఖెడే పిచ్  బౌలర్లతో పాటు బ్యాటర్లకు కూడా అనుకూలిస్తుంది. ఇక్కడ జరిగిన గత మూడు మ్యాచ్ లలో చెన్నై తో మ్యాచ్ లో తప్ప కోల్కతా, పంజాబ్ లు భారీ స్కోర్లు బాదాయి. ఈ మూడింటిలో రోహిత్ సేన ఒక మ్యాచ్ లో గెలిచింది. 


 






తుది జట్లు  (అంచనా) : 


ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పియూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, కుమార్ కార్తికేయ 


ఇంపాక్ట్ ప్లేయర్ :  జేసన్ బెహ్రాన్‌డార్ఫ్ 


రాజస్తాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రన్ హెట్‌మెయర్, ధ్రువ్ జురెల్, అశ్విన్, జేసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్


ఇంపాక్ట్ ప్లేయర్ : కుల్దీప్ యాదవ్