CSK vs PBKS Preview: ఐపీఎల్-2023 ఎడిషన్ లో భాగంగా నేడు మరో సూపర్ సండేకు  రంగం సిద్ధమైంది. ప్లేఆఫ్స్ దిశగా ముందుకు సాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. అదే దిశలో వస్తున్న పంజాబ్ కింగ్స్‌లు నేడు మధ్యాహ్నం  3.30 గంటలకు  చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియంలో ముఖాముఖి తలపడబోతున్నాయి. ఈ ఇరు జట్లూ తాము ఆడిన గత మ్యాచ్‌లలో ఓడినవే. 


పుంజుకోవాలని చెన్నై.. 


వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచిన చెన్నైకి రాజస్తాన్ రాయల్స్  షాకిచ్చింది.  ఈనెల 27న జైపూర్ లో వాళ్ల సొంతగడ్డపై  రాజస్తాన్.. చెన్నైని నిలువరించింది.  దీంతో ఈ మ్యాచ్ తర్వాత సీఎస్కే పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది.  కానీ  నేడు స్వంత గ్రౌండ్ (చెపాక్)లో జరుగబోయే మ్యాచ్ లో పుంజుకుని  టాప్ -2 కు చేరుకోవాలని చూస్తున్నది. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న ఈ సీజన్ లో ఇక నుంచి ఆడే ప్రతి మ్యాచ్ ముఖ్యమే కాబట్టి  చెపాక్ లో పంజాబ్ కు చెక్ పెట్టేందుకు ధోని సేన రంగం సిద్ధం చేసుకుంటున్నది.  


ఆ జట్టులో రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రహానే, శివమ్ దూబే లతో టాపార్డర్ పటిష్టంగానే ఉంది. మిడిలార్డర్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తున్న అంబటిరాయుడు విఫలమవుతుండటం చెన్నైని కలవరపరిచేదే.  చివర్లో రవీంద్ర జడేజా, ధోని లు హిట్టింగ్ చేస్తే  చెపాక్ లో భారీ స్కోరు  పక్కా.  బౌలింగ్ లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేనప్పటికీ ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, పతిరానలతో ధోని అద్భుతాలు చేయిస్తున్నాడు. 


 






పంజాబ్‌దీ సేమ్ స్టోరీ.. 


ఈ సీజన్ లో 8 మ్యాచ్ లు ఆడి నాలుగు గెలిచి నాలుగింటిలో ఓడింది (పాయింట్ల పట్టికలో ఆరో స్థానం) పంజాబ్ కింగ్స్. ముంబై ఇండియన్స్ తో ఉత్కంఠ పోరులో గెలిచిన తర్వాత రెండ్రోజుల క్రితం లక్నో సూపర్ జెయింట్స్ తో స్వంత గ్రౌండ్ (మొహాలీ)లో ఓడింది.  అయితే ఈ సీజన్ లో ఓ గెలుపు, ఓ ఓటమితో ముందుకు సాగుతున్న పంజాబ్.. నేటి మ్యాచ్ లో అదే సెంటిమెంట్ పునరావృతం చేస్తే చెన్నైకి తిప్పలు తప్పవు.  


భుజం గాయం కారణంగా నాలుగు మ్యాచ్ లకు దూరంగా ఉన్న శిఖర్ ధావన్ లక్నోతో మ్యాచ్ లో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ మ్యాచ్ లో  అంతగా రాణించలేదు. అయితే  చెన్నైపై  ధావన్ కు మంచి రికార్డు ఉంది. ఈ టీమ్ పై 1000 ప్లస్ పరుగులు చేశాడు గబ్బర్.  గబ్బర్ నిలిస్తే చెన్నై బౌలర్లకు చుక్కలే.  ఓపెనర్ అథర్వ తైడే  కూడా లక్నోతో మ్యాచ్ లో ఆకట్టుకున్నాడు. అదే రిపీట్ కావాలని పంజాబ్ కోరుకుంటున్నది. సికందర్ రజా నిలకడగా ఆడుతున్నాడు. లియామ్ లివింగ్‌స్టోన్ ఇంకా తన మార్క్ చూపలేదు. సామ్ కరన్ , జితేశ్ శర్మలు మెరుపులు మెరిపిస్తుండటం పంజాబ్ కు కలిసొచ్చేదే. 


బౌలింగ్  విషయానికొస్తే పంజాబ్‌లో కగిసొ రబాడా, అర్ష్‌దీప్ సింగ్,  సామ్ కరన్, నాథన్ ఎల్లీస్ వంటి పేసర్లు ఆ జట్టు సొంతం.  ఎల్లీస్ కు  ఛాన్స్ దక్కకపోవచ్చు గానీ మిగిలిన ముగ్గురైతే టీమ్ లో ఉంటారు. అయితే  చెపాక్ పిచ్ పేసర్ల కంటే స్పిన్నర్లకు అనుకూలం. ఈ క్రమంలో రాహుల్ చాహర్ తో పాటు హర్‌ప్రీత్ బ్రర్ (ఆడితే) కీలకం అవుతారు.  


 






పిచ్ : చెపాక్ పిచ్  బ్యాటింగ్ తో పాటు  స్పిన్ కు అనుకూలం.   ఛేదన చేసే జట్లకు రాత్రి వేళ  మంచు ఇబ్బంది పెట్టొచ్చు.  స్పిన్నర్లు కాస్త కష్టపడితే  డ్యూ తో ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టేందుకు చెపాక్ బాగా సహకరిస్తుంది. 


తుది జట్లు (అంచనా) : 


పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్ సింగ్, అథర్వ తైడే, సికందర్ రజా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరన్, జితేశ్ శర్మ, షారుక్ ఖాన్, కగిసొ రబాడా,  రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ 


ఇంపాక్ట్ ప్లేయర్ : హర్‌ప్రీత్ బ్రర్


చెన్నై సూపర్ కింగ్స్ : డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మోయిన్ అలీ,  శివమ్ దూబే,  అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్  ధోని (కెప్టెన్), తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ, పతిరాన 


ఇంపాక్ట్ ప్లేయర్ : ఆకాశ్ సింగ్