Sunrisers Hyderabad vs Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ రివెంజ్ తీర్చుకుంది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించిన సంగతి తెలిసిందే. దానికి ప్రతీకారంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తొమ్మిది పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితం అయింది.


198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మొదటి ఓవర్లోనే దెబ్బ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఆ తర్వాత మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్, మిషెల్ మార్ష్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెళ్లారు. వీరు రెండో వికెట్‌కు 11 ఓవర్లలోనే 112 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరూ స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన వారిలో ఎవరూ రాణించలేదు. చివర్లో అక్షర్ పటేల్ కాస్త ప్రయత్నించినా అప్పటికే ఆలస్యం అయిపోయింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.


ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఓపెనర్ అభిషేక్ శర్మ (67: 36 బంతుల్లో, 12 ఫోర్లు, ఒక సిక్సర్) మినహా టాప్ 5 బ్యాటర్లలో ఎవరూ సరిగ్గా ఆడలేకపోయారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం చేశాడు. మయాంక్ అగర్వాల్ (5: 6 బంతుల్లో, ఒక ఫోర్), రాహుల్ త్రిపాఠి (10: 6 బంతుల్లో, ఒక సిక్సర్), ఎయిడెన్ మార్క్రమ్ (8: 13 బంతుల్లో), హ్యారీ బ్రూక్ (0: 2 బంతుల్లో) ఇలా అందరూ విఫలం అయ్యారు. కుదిరినంత వరకు లాగిన అభిషేక్ శర్మ కూడా ఇన్నింగ్స్ 12వ ఓవర్లో అవుటై పోయాడు. దీంతో సన్‌రైజర్స్ 109 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.


అయితే ఆ తర్వాత వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ (53: 27 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), అబ్దుల్ సమద్ (28: 21 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) సన్‌రైజర్స్‌ను ఆదుకున్నారు. వికెట్లు కోల్పోయినా వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆరో వికెట్‌కు వీరు 33 బంతుల్లోనే 53 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత అకియల్ హుస్సేన్ (16: 10 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) కూడా వేగంగా ఆడారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 197 పరుగులు సాధించింది.


సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, అకేల్ హోసేన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్


సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
మార్కో జాన్సెన్, వివ్రాంత్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ డాగర్, నటరాజన్.


ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్


ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్, ఖలీల్ అహ్మద్, ప్రవీణ్ దూబే