India vs England Test Series 2025 Schedule:  భారత(India) జట్టు.. ఇంగ్లండ్(England) పర్యటన ఖరారైంది. వచ్చే ఏడాది వచ్చే ఏడాది ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది. బ్రిటీష్‌ జట్టుతో టీమ్‌ఇండియా అయిదు టెస్టులు ఆడబోతుంది. . తొలి టెస్టు 2025 జూన్ 20 నుంచి 24 వరకు, రెండో టెస్టు జులై 2 నుంచి 6 వరకు, మూడో టెస్టు జులై 10 నుంచి 14 వరకు, నాలుగో టెస్టు జులై 23 నుంచి 27 వరకు, ఐదో టెస్టు జులై 31 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు జరగనుంది. భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్ట్ సిరీస్ జూన్ 20న ప్రారంభమై ఆగస్టు 4 వరకు జరగనుంది. భారత పురుషుల జట్టు అయిదు టెస్ట్‌ మ్యాచుల సిరీస్‌ కోసం ఇంగ్లండ్ వెళ్లనుండగా భారత మహిళల జట్టు అయిదు మ్యాచుల టీ 20 సిరీస్‌కు ఇంగ్లండ్‌ వెళ్లనుంది.  ఇండియన్స్‌ ఉమెన్స్‌ టీ 20 సిరీస్‌ జూన్ 28న ప్రారంభమై జూలై 12 వరకు జరగనుంది.




భారత్‌కు సవాలే

భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డులు ఎంపిక చేసిన మైదానాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. హెడింగ్లీ, ఎడ్జ్‌బాస్టన్‌, లార్డ్స్, ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌, ఓవల్‌లో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య అయిదు టెస్ట్‌ మ్యాచులు జరగనున్నాయి. ఈ పిచ్‌లన్నీ స్వింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. అయితే భారత్‌ను పేస్‌తో ఇబ్బందులు పెట్టాలన్న తలంపుతోనే ఇంగ్లండ్‌ ఈ మైదానాలను వ్యూహాత్మకంగా ఎంపిక చేసిందనే ప్రచారం జరుగుతోంది. మాజీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వింగ్‌తో భారత్‌ను కట్టడి చేసి అయిదు టెస్టుల సిరీస్‌లో పైచేయి సాధించాలని బ్రిటీష్‌ జట్టు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే భారత జట్టులోనూ నాణ్యమైన పేసర్లు ఉండడంతో అది అంత తేలిక కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా పేసర్లు జస్ప్రీత్‌ బుమ్రా, షమీ, సిరాజ్‌, అర్ష్‌దీప్‌లతో భారత పేస్‌ విభాగం చాలా పటిష్టంగా ఉంది. ఒకవేళ ఇంగ్లండ్‌ నిజంగానే పేస్‌ పిచ్‌లపై టెస్ట్‌ సిరీస్‌కు సిద్ధమైతే ఇరు జట్లు బ్యాటర్లకు పెద్ద సవాల్‌ ఎదురుకానుంది. ఈ సవాల్‌ను భారత సారధి రోహిత్‌ శర్మ నేతృత్వంలోని జట్టు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. 

 

ఆ కల తీరుతుందా..?

ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ గెలవడం ఒక్కటే భారత్‌కు మిగిలి ఉన్న కల. ఇప్పటికే రెండుసార్లు వన్డే ప్రపంచకప్‌... రెండుసార్లు టీ 20 ప్రపంచకప్‌ గెలిచిన టీమిండియా ఇక మిగిలి ఉన్న ఒక్క కలను సాకారం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా తన పదవీ విరమణ చివరి రోజూ ఆ ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ కల కూడా నెరవేర్చాలని కింగ్ కోహ్లీని కోరిన సంగతి తెలిసిందే. రెండుసార్లు టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ చేరిన బారత జట్టు ఆ రెండు సార్లు రిక్త హస్తాలతోనే వెనుదిరిగింది. ఇక మరోసారి టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కు చేరేందుకు భారత్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈసారి కూడా ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌కు చేరి 2023-2025 కప్పును ఒడిసిపట్టాలని భారత జట్టు భావిస్తోంది. ఈ ఏడాదే టీ 20 ప్రపంచ కప్‌ గెలిచి మంచి టచ్‌లో ఉన్న టీమిండియాకు అన్ని కలిసి వస్తే టెస్ట్‌ ఛాంపియన్‌గా నిలవడం అంత కష్టమైన పనేమీ కాదు.