Rohit Sharma Thanks Three Pillars For T20 World Cup Win : అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహించిన టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)ను గెలిచి రోహిత్‌ శర్మ (Rohit sharma) సారథ్యంలోని భారత జట్టు విశ్వ విజేతగా నిలిచింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమ్‌ ఇండియా జగజ్జేతగా నిలవడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే భారత జట్టు ఛాంపియన్‌గా నిలవడంపై తొలిసారి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. ఆ త్రి పిల్లర్స్‌ వల్లే తాము విశ్వ విజేతలుగా నిలిచామని హిట్‌ మ్యాన్‌ తెలిపాడు. అయితే ఆ మూడు పిల్లర్స్‌ ఏవో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. కోహ్లీనో, బుమ్రానో, రిషభ్‌ పంతో, హార్దిక్‌ పాండ్యానో కాదు.. ఆ త్రి పిల్లర్స్‌ ఎవరో... వారి గురించి రోహిత్‌ శర్మ ఏం చెప్పాడో తెలుసుకుందాం...

 

హిట్‌మ్యాన్‌ ఏమన్నాడంటే..? 

టీమ్‌ ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచినందుకు సహకరించిన 'త్రీ పిల్లర్స్'కి కెప్టెన్‌ రోహిత్‌  శర్మ ధన్యవాదాలు తెలిపాడు. పొట్టి ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్.... దక్షిణాఫ్రికాపై విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయం సాధించడంలో అప్పటి హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid), సెలెక్షన్‌ కమిషన్‌ ఛైర్మన్‌ అజిత్ అగార్కర్(Ajit agarkar), బీసీసీఐ(Bcci) సెక్రటరీ జై షా(Jay Shah) కీలక పాత్ర పోషించారని రోహిత్ శర్మ తెలిపాడు. వారు ముగ్గురే జగజ్జేతగా నిలవడంలో త్రి పిల్లర్స్‌గా నిలిచారని హిట్‌మ్యాన్‌ తెలిపాడు. ఎలాంటి ఆందోళన చెందకుండా జట్టులోని ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రతిభను వీరు ముగ్గురు రాబట్టగలిగారని రోహిత్‌ శర్మ తెలిపారు. జట్టుకు ఈ త్రీ పిల్లర్స్‌ అండగా నిలిచారని స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తెలిపారు. "ఈ టీమ్‌ను అద్భుతంగా మార్చడం నా కల. గణాంకాలు, ఫలితాల గురించి పెద్దగా చింతించకుండా, అభిమానుల ఆకాంక్షల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే వాతావరణాన్ని సృష్టించాం. అదే అద్భుత ఫలితాలు వచ్చేలా చేసింది " అని రోహిత్ తెలిపాడు. “ భారత జట్టు త్రి పిల్లర్స్‌ నుంచి నాకు మంచి సహకారం అందింది. జై షా, రాహుల్ ద్రవిడ్, అజిత్ అగార్కర్ నాకు చాలా అండగా నిలిచారు. అయితే ఇందులో ఆటగాళ్ల పాత్రను మర్చిపోవద్దు. ఆటగాళ్లు అద్భుత ఆటతీరు టైటిల్‌ సాధించడంలో ఎంతో కీలకం" అని కూడా హిట్‌ మ్యాన్‌ తెలిపాడు.

 

మాటల్లో వర్ణించలేం

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పొట్టి ప్రపంచకప్‌ గెలిచిన అనుభూతిని మాటల్లో వర్ణించలేమని రోహిత్‌ అన్నాడు. ప్రపంచకప్‌ గెలవడం రోజు పొందలేని అనుభూతి అి రోహిత్‌ అన్నాడు. తాము ప్రపంచ కప్‌ను గెలుచుకున్నప్పుడు.. ఆ క్షణాలను జీవితాంతం గుర్తుండేలా ఆస్వాదించాలని అనుకున్నామని రోహిత్‌ తెలిపాడు. దేశం మొత్తం ఈ సంబరాలు చేసుకోవడం తనకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని అన్నాడు. అది మాటల్లో చెప్పలేని అద్భుతమైన అనుభూతని రోహిత్‌ అన్నాడు.