Barclay not to opt for third term, all eyes on BCCI secretary Jay Shah: 

ఐసీసీ ఛైర్మన్‌ పీఠాన్ని మరోసారి బీసీసీఐ(BCCI) కన్నేసినట్లే కనిపిస్తోంది. ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జై షా(Jay Shah)కు లైన్‌ క్లియర్‌ అయినట్లే కనిపిస్తోంది. ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్‌ క్లే పదవీకాలం నవంబర్‌ 30తో ముగియనుంది. తర్వాత కూడా బార్‌ క్లే(Greg Barclay ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంది. అయితే బార్‌ క్లే మళ్లీ ఎన్నికల బరిలో నిలవకూడదని నిర్ణయించుకున్నారు. బార్‌ క్లే నిర్ణయంతో ఐసీసీ నూతన ఛైర్మన్‌గా జై షా నిలుస్తారనే ప్రచారం ఊపందుకుంది. జై షా ఐసీసీ ఛైర్మన్‌ ఎన్నికల బరిలో నిలిస్తే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐసీసీ ఛైర్మన్‌గా బార్‌ క్లే ఎన్నికలోనూ జై షా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్‌క్లే తాను మళ్లీ పోటీ చేయనని ప్రకటించడంతో తదుపరి ఐసీసీ చైర్మన్ గా జై షా బాధ్యతలు చేపట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఐసీసీ రూల్స్‌ ప్రకారం ఐసీసీ చైర్మన్ గా మూడుసార్లు పోటీ పడొచ్చు. అయితే న్యూజిలాండ్ మాజీ ఆటగాడు గ్రెగ్ బార్‌క్లే ... రెండు సార్లు  తన పదవి కాలాన్ని పూర్తి చేశాడు. మూడోసారి కూడా పోటీ చేసేందుకు గ్రెగ్‌కు అవకాశం ఉంది. అయితే ఐసీసీ చైర్మన్ పదవికి పోటీ చేసేందుకు గ్రెగ్‌ సముఖత వ్యక్తం చేయలేదు.


 

బార్‌ క్లే కీలక వ్యాఖ్యలు

తాను మరోసారి ఐసీసీ ఛైర్మన్‌ పదవికి పోటీ చేయాలని అనుకోవడం లేదని బార్‌ క్లే స్పష్టం చేశారు. ఈ దఫా పదవీకాలం పూర్తయిన తరువాత మరోసారి బరిలోకి దిగబోనని తేల్చి చెప్పారు. బార్‌ క్లే ప్రకటనతో ఇక ఐసీసీ పీఠం మరోసారి భారత్‌కు దక్కబోతుందన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఐసీసీ చైర్మన్ జై షాగా బరిలో నిలవడం.. బాధ్యతలు చేపట్టడం ఇక ఖాయమేనని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఐసీసీ నూతన చైర్మన్ ఎంపికకు ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలు ప్రక్రియకు ఈనెల 27వ తేదీ వరకు గడువు ఉంది. ఆగస్టు 27లోపు బీసీసీఐ కార్యదర్శి జైషా ఐసీసీ ఛైర్మన్‌ పదవికి నామినేషన్‌ దాఖలు చేస్తే... ఐసీసీ చైర్మన్ జైషా ఎంపిక ఖాయమైనట్లే. 

 

మొత్తం 16 ఓట్లు....

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా ఎంపికపై చాలా దేశాలు సానుకూలంగా ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌ పాలన వ్యవహారాల్లో జై షా తనదైన ముద్ర వేశాడు. ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవితోపాటు, బీసీసీఐ కార్యదర్శి పదవులను జై షా నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఐసీసీ ఛైర్మన్‌గా పోటీ చేసి గెలిస్తే మాత్రం ఈ పదవుల నుంచి జైషా వైదొలగాల్సి ఉంటుంది. బీసీసీఐ కార్యదర్శిగా జైషాకు మరో ఏడాది పదవీకాలం ఉంది. ఈ నేపథ్యంలో జై షా బీసీసీఐని వదిలి ఐసీసీకి వెళతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఐసీసీ చైర్మన్ ఎన్నికల్లో మొత్తం 16 ఓట్లు ఉండగా... తొమ్మిది ఓట్లు వచ్చిన వ్యక్తి గెలుస్తాడు. ఓటు హక్కు ఉన్న చాలా దేశాలు జైషా పట్ల సానుకూలంగా ఉండడంతో జైషా బరిలోనిలిస్తే ఏకగ్రీవంగా ఐసీసీ ఛైర్మన్‌ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.