నా మనవళ్లకు చెప్పుకుంటా...
" ఇలాంటి మనిషి ఒకడు ఇలా తరంపై నడయాడిన సంగతి.. నమ్మరాదని నమ్మకముందే ముందు తరాలకు చెప్పండి" అని మహాత్మ గాంధీ గురించి అల్బర్ట్ ఐన్ స్టీన్ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు కాస్త అటుఇటుగా.. ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్(Travis Head) కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. " తన క్రికెట్ ప్రయాణం ముగిశాక బుమ్రా లాంటి గొప్ప బౌలర్ ను తాను చూశానని.. అతనితో కలిసి క్రికెట్ ఆడానని నా మనవళ్లకు చెప్పుకుంటా" ట్రావిస్ హెడ్ వ్యాఖ్యానించాడు. "క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప బౌలర్లలో ఒకడిగా బుమ్రా తన కెరీర్‌ను ముగిస్తాడు. అతడ్ని ఎదుర్కోవడం ఓ బిగ్ ఛాలెంజ్. అయినా సరే బుమ్రాతో క్రికెట్ ఆడడం నాకు చాలా బాగుంది. బుమ్రాను ఇంకా ఎక్కువసార్లు ఎదుర్కోవాలి. " అని హెడ్ అన్నాడు. మరో క్రికెటర్ స్టీవ్ స్మిత్ కూడా ఇదే అన్నాడు. ‘‘బుమ్రాతో కలిసి ఇప్పటికే చాలా మ్యాచులు ఆడా. చాలాసార్లు బుమ్రా బౌలింగ్ నూ కూడా ఎదుర్కొన్నా. కానీ నేను ఎదుర్కొన్న ప్రతీసారి బుమ్రా నాకు కొత్తగానే కనిపిస్తాడు. అతడి బౌలింగ్ ఎదుర్కోవడం ప్రతిసారీ సవాలుగా అనిపిస్తుంది. అతడి బౌలింగ్ శైలి నాకు అస్సలు అంతుచిక్కదు’’ అని స్టీవ్ స్మిత్ ఇటీవల కామెంట్లు చేశాడు.
Also Read: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
రెండో టెస్టులు తిప్పలు తప్పవు
పెర్త్ టెస్టులో అద్భుత బౌలింగ్‌తో టీమిండియాకు బుమ్రా విజయాన్ని అందించాడు. బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోలేక తమ బ్యాటర్లు కకావికలమవుతుంటే కొందరు ఆస్ట్రేలియా అభిమానులు.. బుమ్రా చెకింగ్ చేస్తున్నాడని చిల్లర ఆరోపణలు కూడా చేశారు. కానీ ఇవేమీ బుమ్రా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టలేదు. కంగారు గడ్డపై కంగారులను కంగారు పెట్టి భారత్ కు బుమ్రా ఘన విజయం అందించాడు. తొలి టెస్టులో ఆస్ట్రేలియాను 295 పరుగులతో టీమిండియా చిత్తు చేసిందంటే అది బుమ్రా ఘనతే. ఇక డిసెంబర్ ఆరు నుంచి రెండో టెస్టు జరగనుంది. అడిలైడ్ వేదికగా జరిగి ఈ టెస్టు మ్యాచు డే అండ్ నైట్ జరగనుంది. ఈ పింక్ బాల్ టెస్టులో కంగారు బ్యాటర్లకు బుమ్రా నుంచి ముప్పు పొంచి ఉంటుందని మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. బుమ్రా బంతులను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆసిస్ బ్యాటర్లు తలలు పట్టుకుంటున్నారట. బుమ్రా బంతులను ఎలా ఎదుర్కోవాలనే దానిపైనే కంగారుల ప్రణాళికలన్నీ తిరుగుతున్నాయన్న టాక్ క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.