Star Shuttler PV Sindhu Set To Marry Venkata Datta Sai on 22nd of December: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు(PV Sindhu) పెళ్లి పీటలు ఎక్కబోతోంది. సింధు హైదరాబాద్ కు చెందిన వెంకట సాయి దత్తా(Venkata Datta Sai) అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనుంది. ఆయన పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. సింధు, సాయి పెళ్లి డిసెంబర్ 22న ఉదయ్‌పూర్ లో జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్ 24న హైదరాబాద్ లో పెళ్లి విందు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె కుటుంబ వర్గాలు వెల్లడించాయి.

 

పీవీ సింధుకు కాబోయే భర్త వెంకట దత్త సాయి గురించి ఈ విషయాలు మీకు తెలుసా? (Venkata Datta Sai)
బ్యాడ్మింటన్ స్టార్‌ పీవీ సింధు పెళ్లికూతురు కాబోతోంది. పొసిడెక్స్‌ టెక్నాలజీ ఈడీగా ఉన్న వెంకట దత్త సాయిని ఆమె వివాహం చేసుకోనున్నారు. డిసెంబర్‌ 22న వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనుంది. దీంతో అసలు ఎవరీ వెంకట దత్త సాయి అన్న చర్చ మొదలైంది. ఆయన వివరాల కోసం ఆన్‌లైన్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.

 

ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ నుంచి లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్/లిబరల్ స్టడీస్‌లో వెంకట దత్తా సాయి  డిప్లొమా పూర్తి చేశారు. 2018లో ఫ్లేమ్ యూనివర్శిటీ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తన BBA అకౌంటింగ్, ఫైనాన్స్ పూర్తి చేశారు. బెంగుళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.

 

JSWలో సమ్మర్ ఇంటర్న్‌గా ఇన్-హౌస్ కన్సల్టెంట్‌గా వెంకట దత్త సాయి పని చేశారు. "ఐపీఎల్ టీమ్ నిర్వహణతో పోల్చితే ఫైనాన్స్, ఎకనామిక్స్‌లో నా BBA చాలా దారుమంగా ఉంది. కానీ ఈ రెండింటి నుంచి నేను చాలా నేర్చుకున్నాను" అని ఆయన తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో పోస్ట్ చేశారు.

 

2019 నుంచి పోసిడెక్స్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ సోర్ ఆపిల్ అసెట్ మేనేజ్‌మెంట్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. "12 సెకన్లలో మీరు పొందే రుణం లేదా క్రెడిట్ కార్డ్ రావడంపై మీరు ఇన్‌స్టెంట్‌ క్రెడిట్ స్కోర్ మాచింగ్‌కు ధన్యవాదాలు చెప్పాలా? ప్రొప్రైటరీ ఎంటిటీ రిజల్యూషన్ సెర్చ్ ఇంజిన్‌ని ఉపయోగించి నేను పరిష్కరిస్తున్న అత్యంత క్లిష్టమైన కొన్ని సమస్యలు. హెచ్‌డిఎఫ్‌సి నుంచి ఐసిఐసిఐ వరకు కొన్ని అతిపెద్ద బ్యాంకుల్లో నా పరిష్కారాలు, ఉత్పత్తులు క్లిష్టమైన కార్యకలాపాల కోసం ఉపయోగపడుతున్నాయి." అని తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో రాశారు. 

 

వివాహం ఎక్కడ జరగనుందంటే..?

రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు వివాహం డిసెంబర్ 22న ఉదయపూర్‌లో జరగనుంది. "రెండు కుటుంబాలకు ఒకరికొకరు తెలుసు, ఒక నెల క్రితమే అంతా ఖరారైంది. జనవరి నుంచి ఆమె షెడ్యూల్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిసెంబర్ లోనే వివాహం జరిపించాలని నిర్ణయించాం" అని సింధు తండ్రి పీవీ రమణ(PV Ramana) వెల్లడించారు. "అందుకే డిసెంబర్ 22న పెళ్లి వేడుకలు జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. డిసెంబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది. వచ్చే సీజన్‌కు ప్రాధాన్యత ఉండటంతో ఆమె తన శిక్షణను త్వరలో ప్రారంభించనుంది." డిసెంబర్ 20న పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. " అని సింధు కుటుంబ సభ్యులు వెల్లడించారు. . ఏడాది కాలంగా సింధుకు, వెంకటసాయికి మధ్య పరిచయం ఉందని, గత నెలలోనే వీరి పెళ్లికి సంబంధించి ఓ నిర్ణయానికి వచ్చామని సింధు తండ్రి పీవీ రమణ తెలిపాడు.  వీరిద్దరూ కలిసి గతంలో కొన్ని మ్యాచులకు, సినిమాలకు కూడా హాజరయ్యారు. 

 


 

డబుల్ ఒలింపియన్..

పీవీ సింధు ఒలింపిక్ క్రీడలలో రజతం, కాంస్య పతకాలు సాధించింది. 2016 రియో , 2020 టోక్యో ఒలింపిక్స్ లో సింధు రెండు పతకాలు గెలిచింది. 2019లో ఒక స్వర్ణంతో సహా ఐదు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలతో భారత గొప్ప అథ్లెట్లలో ఒకరిగా సింధు పరిగణించబడుతుంది.  2017లో కెరీర్ లో అత్యున్నత ప్రపంచ ర్యాంకింగ్ 2ని సాధించింది.  ఇటీవలే సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 2024 (Syed Modi International 2024) బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పీవీ సింధు ఛాంపియన్ గా నిలిచి రెండేళ్ల టైటిల్ కరువును తీర్చేసింది. ప్రస్తుతం బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో 18వ ర్యాంక్‌లో ఉన్న పీవీ సింధు మళ్లీ ఫామ్ లోకి రావడం అభిమానుల్లో జోష్ నింపింది.