Rishabh Pant: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎవరనే దానిపై ఊహగానాలు చెలరేగుతున్నాయి. అయితే వేలంతో అత్యధిక ధర పెట్టి రిషభ్ పంత్ (రూ.27 కోట్లు)ను కోనుగోలు చేసిన ఫ్రాంచైజీ.. అతడినే కెప్టెన్ గా చేసే అవకాశముందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా లక్నో యజమాని సంజీవ్ గోయెంకా మనసు విప్పారు.
కెప్టెన్సీ విషయంలో అందరూ ఊహిస్తున్న విధంగానే ఉంటుందని, ఎలాంటి సర్ప్రైజ్ లు ఉండబోవని గోయెంకా పేర్కొనారు. ఈనెల మొదటి, రెండు వారం ముగిసేలోపల సారథి నియామకం ఉంటుందని తెలిపారు. మరోవైపు మెగావేలంలో దాదాపుగా తాము అనుకున్నట్లే కొనుగోలు చేశామని తెలిపారు. పంత్ ను దక్కించుకోవడం కోసం ప్రత్యేక వ్యూహాన్ని రూపొందిచుకున్నామని తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ్ జిందాల్ కి పంత్ తో స్నేహ సంబంధాలున్నాయని, అతడిని దక్కించుకోవడం కోసం జిందాల్ వేలంలో ఎంతవరకైనా వెళతారని ఊహించానని పేర్కొన్నారు.
అప్పటికే శ్రేయస్ అయ్యర్ ను 26.75 కోట్లకు జిందాల్ కొనుగోలు చేయడంతో.. రైట్ టూ మ్యాచ్ సందర్భంగా రూ.27 కోట్ల ధరను పంత్ కు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మరోవైపు పంత్ తమ ఫ్రాంచైజీతో మరో 10-12 ఏళ్లుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సీజన్ లో ఐడెన్ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా), మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా)లలో ఒకరితో కలిసి పంత్ ఓపెనింగ్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
వేలంలో ముఖ్యంగా లక్నో మిడిలార్డర్ భారత ఆటగాళ్లతో నింపాలని వ్యూహాన్ని రచించుకున్నట్లు తెలిపారు. మరోవైపు వేలంలో తమ ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జట్టు సమతూకంగా ఉందని, మరే జట్టు ఇంత బలంగా లేదని తెలిపారు. ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు ఉన్నారు. అలాగే పేస్ బౌలింగ్ కూడా సమర్థులైన భారత ప్లేయర్లతో నిండి ఉందని వ్యాఖ్యానించారు. తమ టీంలో నలుగురు లీడర్లు ఉన్నారని, రిషభ్ పంత్, మార్క్రమ్; మార్ష్, పూరన్.. వీరంతా గెలవాలనే తపన కలిగి ఉన్నారని తెలిపారు.
ఇక వేలం ముగిసిందని, జట్టు కూర్పు గురించి టీమ్ డైరెక్టర్లు జహీర్ ఖాన్, కోచ్ జస్టిన్ లాంగర్ చూసుకుంటారని వివరించారు. గత సీజన్ లో లక్నోకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వహించగా.. టీం లీగ్ దశకే పరిమితమైంది.