KCR And Jagan News Today: 'సంక్రాంతి వస్తున్నాం ' అనేది మన తెలుగు సినిమాల పోస్టర్ల పై కనిపించే మాట. అయితే ఇప్పుడు అది మన తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ కు కూడా యాప్ట్ గా మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విపక్ష నేతలు కేసీఆర్, జగన్ లు సంక్రాంతి నుండి జనం బాట పట్టనున్నారు. అధికార పార్టీల తప్పులను ఎండ గడుతూ సమస్యలపై పోరాడుతాం అంటున్నారు. దీనితో పొలిటికల్ గా రెండు తెలుగు రాష్ట్రాల నేతలు సంక్రాంతి వైపు చూస్తున్నారు.
కెసిఆర్ : ఫామ్ హౌస్ నుంచి ప్రజల్లోకి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఉన్న ప్రధాన విమర్శ ఆయన ప్రజల్లోకి రారని. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ప్రజలతో కలిసే ప్రయత్నం చేయలేదని అందుకే ఓటమిపాలయ్యారు అనేది ఒక విశ్లేషణ. ఈ మాట బయటి వాళ్ళ నుండే కాదు పార్టీలోనూ అంతర్గతంగా వినిపిస్తుండడంతో ఆయన సంక్రాంతి నుంచి ప్రజల్లోకి రాబోతున్నారు. ఇప్పటికే తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం వచ్చి ఏడాది అయ్యింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజామోదం పొందితే కొన్ని మాత్రం వివాదాస్పదమయ్యాయి. దానితో వాటిని బేస్ చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలనేది కేసీఆర్ ఆలోచన. పైపెచ్చు తెలంగాణలో విపక్షంగా BRS బలంగానే ఉంది.
గతంలో జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ చేసిన ప్రయోగం విఫలం కావడంతో కొంతకాలం పాటు రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడుగా కెసిఆర్ పై అక్కడి ప్రజల్లో ఇమేజ్ ఇప్పటికీ బలంగానే ఉంది. ఒక్కసారి కేసీఆర్ బయటకు వస్తే క్యాడర్, నాయకులు పూర్తిస్థాయిలో యాక్టివ్ అయిపోతారు. తెలంగాణ రాజకీయాల్లో కెసిఆర్ వర్సెస్ రేవంత్ ఎప్పుడూ సంచలనమే. ఏడాదికాలంగా కొంత ఇనాక్టివ్ గా ఉన్న కేసీఆర్ సంక్రాంతి నుండి ప్రజలతో మమేకమై మరోసారి తన ఫైర్ చూపించే ప్రయత్నంలో ఉన్నారు.
జగన్ : తాడేపల్లి ప్యాలెస్ టూ జనం చెంతకు
కెసిఆర్ తో పోల్చుకుంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరింత కష్టాల్లో ఉన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడం మాట అంటుంచి ఏకంగా 151 నుండి 11సీట్లకు పరిమితం అయిపోయింది వైసిపి. ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ అటు అసెంబ్లీకి జగనూ వెళ్లడం లేదు.. పార్టీ ఎమ్మెల్యేలనూ పంపడం లేదు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బిజెపి నుండి పురంధ్రీశ్వరి గత జగన్ పాలనలో తప్పులను ఎండగడుతూ వస్తున్నారు. మరోవైపు చెల్లెలు షర్మిల ఉండనే ఉంది. మాత్రం ఛాన్స్ దొరికినా జగన్ పై ప్రశ్నలతో విరుచుకుపడుతోంది ఆమె. వీటికి తాడేపల్లి నుండి వీడియోల ద్వారా సమాధానాలు ఇవ్వడమే గాని డైరెక్ట్ గా ప్రజలతో మమేకమయ్యే పని ఇంతవరకు చేయలేదు జగన్.
అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా పరదాల మాటునే పర్యటనలు చేసేవారన్న విమర్శ ఉండదే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటుతున్న తరుబం లో వారిచ్చిన సూపర్ ఫిక్స్ హామీల అమలు ఎప్పుడంటూ జగన్ జనం లోకి వెళ్లబోతున్నారు. ప్రస్తుతం పార్టీ లో ప్రజల్లో ఫేస్ వాల్యూ ఉన్న సరైన ట్రబుల్ షూటర్ లేరు. దానితో ఆ బాధ్యతను జగన్ మోహన్ రెడ్డే తీసుకోబోతున్నారు. గతంలో ప్రజల్లోకి వెళ్లాకే జగన్ కు అధికారం దక్కింది. తాను చేసిన మంచి పనులే తనను మళ్ళీ అందలం ఎక్కిస్తాయని పదే పదే చెబుతున్న జగన్ వాటిని గుర్తు చేయడానికి జనం లోకి వెళ్ళబోతున్నారు.
ఎవరు హిట్టు.. ఎవరు ఫట్టు..
తెలుగు ప్రజలకు ఉండే సంక్రాంతి సెంటిమెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఆ సెంటిమెంటును పట్టుకునే కెసిఆర్ జగన్ లు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు. ఇద్దరూ బలమైన నేతలే.. ఇద్దరికీ ఉన్న జనాకర్షణ కూడా పెద్దదే.అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎవరి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే..!