Maharashtra New Govt: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దక్కించుకున్న బీజేపీ నేతృత్వంలోని మహాయుతి(Mahayuthi) కూటమి కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సన్నాహాలు ప్రారంభించింది. ఈ నెల 4న లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి సిద్ధమైంది. ఈ సమావేశానికి బీజేపీ(BJP) శాసన సభా పక్ష సభ్యులు అందరూ హాజరు కావాలని ఆదేశించింది. ఈ సమావేశంలోనే బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిని ఎంపిక చేయనున్నారు. 4వ తేదీ శాసన సభా పభ సమావేశంలో పాల్గొనేందుకు గాను.. మంగళవారమే ఇటీవల ఎన్నికైన సభ్యులందరూ.. ముంబై(Mumbai)కి రావాలని పార్టీ ఆదేశించింది. శాసన సభా పక్ష నాయకుడిని(సీఎం అభ్యర్థి) ఎంపిక చేసిన తర్వాత మహాయుతి నాయకులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్(Governor)ను కలవనున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలనివారు విన్నవించనున్నారు.
కీలక భేటీ
బీజేపీ శాసన సభా పక్ష సమావేశం కీలకంగా మారింది. ప్రస్తుతం ఏర్పడిన ముఖ్యమంత్రి(Chief minister) అభ్యర్థి ఎంపిక సమస్యపై కేంద్ర పెద్దలు దృష్టి పెట్టిన తర్వాత.. దాదాపు ఇది సమసిపోయిందని భావిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ నాయకులు.. మాజీ సీఎం, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis)ను దాదాపు ఎంపిక చేశారు. దీనిపై తుది నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ.. ఈ నెల 2, 3 తేదీల్లోనే శాసన సభా పక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు.
ఏక్‌నాథ్ షిండే అనారోగ్యంతో భేటీ వాయిదా
మరోవైపు మహాయుతి కూటమిలోని శివసేన(Shivasena), ఎన్సీపీ(NCP)లు కూడా సోమవారం ముంబైలో భేటీ అయి.. ముఖ్యమంత్రి అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తొలుత వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde), ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Azith pawar)లు ప్రత్యేకంగా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఏక్‌నాథ్ షిండే అనారోగ్యం పాలవడంతో ఈ భేటీ వాయిదా పడింది. ఇంతలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న షిండే.. ప్రభుత్వ ఏర్పాటులో తనదైన శైలిని అవలంభించే అవకాశం ఉందంటూ వార్తలు హల్చల్ చేశాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం షిండే మాట్లాడుతూ.. తాను ఓ సాధారణ వ్యక్తిగానే పనిచేస్తానని.. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నిర్ణయాలకు కట్టుబడతానని చెప్పుకొచ్చారు. దీంతో సీఎం సీటుపై నెలకొన్న సందిగ్థతకు దాదాపు తెరపడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఈ నెల 4న శాసన సభా పక్ష సమావేశానికి పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గత నెల 23న ఫలితాలు
ఇదిలావుంటే.. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ గత నెల 23నే పూర్తయింది. అదే రోజు ఓట్ల లెక్కింపు(Votes counting) కూడా పూర్తయింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి(Mahayuthi) కనీ వినీ ఎరుగని రీతిలో విజయం దక్కించుకుని బీజేపీ 132 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే.. సీఎం సీటుపై ఏర్పడిన సందిగ్థత కారణంగా ప్రభుత్వ ఏర్పాటు విషయం ఆలస్యమవుతూ వచ్చింది. ఇదిలావుంటే.. డిసెంబరు 5వ తేదీ సాయంత్రం మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముహూర్తం సిద్ధమైంది.
సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న ప్రధాని
అదే రోజు ముంబైలోని అజాద్ మైదాన్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendrea modi) కూడా హాజరు కానున్నారు. మరోవైపు.. మహాయుతి ప్రభుత్వంలో ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు.. శ్రీకాంత్ షిండే.. మంత్రిగా ప్రమాణం చేస్తారని వార్తలు వచ్చాయి. ఒకానొక దశలో ఆయనకు డిప్యూటీ సీఎం పోస్టు కూడా ఇస్తున్నారని వార్తలు హల్చల్ చేశాయి. శ్రీకాంత్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. అయితే.. ఈ వార్తలను ఆయన కొట్టి పారేశారు. తాను ఎంపీగానే కొనసాగుతానని చెప్పుకొచ్చారు.
Also Read: Farmers Protest: ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు