Five Years Old Boy Died In Accident In Sathupally: అప్పటివరకూ తమతో ఉన్న చిన్నారి ఆ తల్లిదండ్రులు చూస్తుండగానే విగతజీవిగా మారాడు. తల్లికి అడుగు దూరంలో నిలిచిన చిన్నారిని మృత్యువు లారీ రూపంలో బలి తీసుకుంది. ఈ దృశ్యాన్ని చూసిన ఆ తల్లి గుండెలు పగిలేలా రోదించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి (Sathupally) మండలం జగన్నాథపురానికి చెందిన ఊకే రాజు, ఏపీలోని నర్సీపట్నానికి చెందిన గుడివాడ ప్రసాద్‌లు కిష్టారంలోని సింగరేణి ఓసీ ఓబీ క్యాంపులో మిషన్ ఆపరేటర్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలోనే ప్రసాద్ నర్సీపట్నంలో నివసించే తన భార్య రాజ్యలక్ష్మి, కుమార్తెలు నిహిత, విఘ్నేశ్వరిలను 2 రోజుల క్రితం సత్తుపల్లి రప్పించారు.


దూసుకొచ్చిన మృత్యువు


విజయవాడ (Vijayawada) నుంచి తిరుపతికి వెళ్లాలని వీరు ఆదివారం బయలుదేరారు. ఉదయం 7 గంటల సమయంలో రాజు, తన భార్య స్వరూపారాణి, కుమారులు యశ్వంత్ (5), దీక్షిత్‌తో కలిసి బైక్‌పై జగన్నాథపురం నుంచి కిష్టారంలోని ఓబీ క్యాంపు వద్దకు చేరుకున్నారు. అప్పటికే ప్రసాద్ కుటుంబ సభ్యులు అక్కడ వేచి ఉన్నారు. స్థానిక బస్టాండుకు వెళ్లే క్రమంలో జాతీయ రహదారి పక్కన నిల్చుని ఉండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ ఒక్కసారిగా వీరిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజు కుమారుడు యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రసాద్ నాలుగేళ్ల కుమార్తె నిహితకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు అక్కడికి వచ్చిన ప్రదీప్ కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. నిహిత పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు కళ్ల ముందే మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. 


Also Read: Vajedu SI Suicide News: వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?