Sajjala Bhargav Reddy News Today: వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్‌గా పని చేసిన సజ్జల భార్గవ్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టించారన్న కేసులు కొట్టేయాలని ముందస్తు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏమైనా ఉంటే హైకోర్టులో చెప్పుకోవాలని పేర్కొంది. అయితే రెండు వారాల వరకు అరెస్టు చేయొద్దని మాత్రం ఊరట కల్పించింది.


వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్చార్జిగా ఉన్నప్పుడు సజ్జల భార్గవ టీడీపీ, జనసేనపై తప్పుడు ప్రచారం చేశారని కేసులు నమోదు అయ్యాయి. చంద్రబాబు, పవన్ పై అసభ్యకరంగా వ్యక్తిగత హననానికి పాల్పడేలా పోస్టులు పెట్టించారని రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్‌లో కార్యకర్తలు కేసులు పెట్టారు. ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు   పాల్పడ్డారని బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 కింద కేసులు పెట్టారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. 


సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ పెట్టిన కేసుల్లో వర్రా రవీందర్ రెడ్డి ఏ1గా ఉంటే... ఏ 2గా సజ్జల భార్గవ్‌్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కడప జైలుకు పంపించారు. ఇదే కేసుల్లో భార్గవ్ రెడ్డికి 41 A కింద నోటీసులు కూడా జారీ చేశారు. 


నోటీసులు అందుకున్న భార్గవ్ రెడ్డి పలు మార్లు విచారణకు హాజరుకాలేదు. వ్యక్తిగత పని ఉందని చెబుతూ పోలీసులు సమాచారం అందిస్తన్నారు. ఈ కేసులు నమోదు అయినప్‌పటి నుంచి ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.