Mulugu District News Today: ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న హరీష్ తుపాకితో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వాజేడు మండలం ముళ్ళ కట్ట వద్ద ఉన్న హరిత రిసార్ట్‌లోని గదిలో హరీష్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. హరీష్ నిన్న హరిత హోటల్లో రూం తీసుకున్నాడు. హరీష్ స్వగ్రామం భూపాలపల్లి జిల్లా వెంకటేశ్వర్ల పల్లి. వ్యక్తిగత కారణాల లేక విధి నిర్వహణ ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడ అనే కారణాలు తెలియాల్సి ఉంది. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
ములుగు జిల్లాలో నిన్న భారీ ఎన్ కౌంటర్ తర్వాత వాజేడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం ములుగు జిల్లా చర్చనీయాంశంగా మారింది. ఉన్నంత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
వాజేడు పోలీస్ స్టేషన్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న హరీష్ నిన్న ములుగు జిల్లా చెల్పాక అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్ కావడంతో వాహన తనిఖీల్లో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో వరుసకు కోడలు అయ్యే యువతి హరీష్ కోసం పోలీసుస్టేషన్ కు వెళ్ళింది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది హరీష్‌కు ఫోన్ చేయడంతో ఆ యువతిని హరిత ఫెరిడో రిసార్ట్‌లో దింపాలని సిబ్బందికి చెప్పారట. దీంతో ఆ యువతి రిసార్ట్ లోని 107 రూంలో దిగింది. హరీష్ సాయంత్రం సమయంలో రిసార్ట్ కు వచ్చారు.
పెళ్ళి ప్రస్తావన..?
ఎస్సై హరీష్‌కు వరంగల్ సిటీకి చెందిన అమ్మాయితో వివాహం కుదిరింది. మరో వారం రోజుల్లో హరీష్ ఎంగేజ్మెంట్ ఉంది. అయితే వరుసకు మేనకోడలు అయ్యే అమ్మాయితో హరీష్ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. పెళ్ళి విషయంలో నిన్నటి నుంచి రిసార్ట్ లో వాదన జరిగినట్లు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం సైతం గొడవ జరిగినట్లు సమాచారం. విధుల్లోకి వెళ్లేందుకు సిద్ధమై ఆరుగంటల డ్రైవర్ కు ఫోన్ సైతం చేశారట. ఇంతలోనే హరీష్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
క్షణికావేశంలో ఆత్మహత్య..!
హరీష్ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నారు. నవంబర్ 21 వ తేదీన వాజేడు పరిధిలోని పెనుగోడు కాలనీలో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేయడంతోపాటు నిన్న ఏటూరు నగరం అడవుల్లో ఎన్ కౌంటర్ కావడం మరో వైపు నేటి నుంచి మావోయిస్టుల పీఎల్జీఎ వారోత్సవాలు ఉండడంతో హరీష్ పని ఒత్తిడిలో ఉన్నారు. ఇదే సమయం యువతి పెళ్లి విషయంలో ఒత్తిడి తేవడం, పెళ్లి చేసుకుంటే తన పరిస్థితి ఏంటని ఆమె నిలదీయడంతో గొడవ జరగడంతో క్షణికావేశానికి లోనైన హరీష్ ఆ యువతి ఎదుటే సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్నాడు.
హరీష్ మెడకు చున్నీ ఉంది. రక్తం కారుతుండటంతో సదర్ యువతే మెడకు చున్ని చుట్టినట్లు తెలుస్తుంది. ఘటన స్థలంలో ఆ యువతి తప్ప మరెవరూ లేరు. పోలీస్ విచారణ తరువాత హరీష్ ఆత్మహత్య కు గల పూర్తి వివరాలు తెలియనున్నాయి.
పోలీస్ లో టెన్షన్...
నిన్న జరిగిన ఎన్కౌంటర్ ఏడుగురు మావోయిస్టులు మృతి చెందడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం బిజీ గా ఉన్నారు. మృతదేహాలు ములుగు ఏరియా ఆస్పత్రిలో ఉండడంతో అధికారులు అక్కడే అన్నారు. ఇదే సమయంలో ఎస్సై హరీష్ ఆత్మహత్య చేసుకోవడంతో టెన్షన్ లో పడ్డారు.