IBSA World Games 2023: అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని భారత మహిళా క్రికెటర్లు మరోసారి రెపరెపలాడించారు. ఇంగ్లాండ్ వేదికగా  జరుగుతున్న ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఐబీఎస్ఎ)  క్రికెట్  ఈవెంట్‌లో భాగంగా శనివారం భారత్  - ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్‌లో టీమిండియా.. కంగారూలను ఓడించి స్వర్ణం గెలుచుకుంది.  ఐబీఎస్ఎ తొలిసారి నిర్వహించిన అంధుల క్రికెట్  పోటీలలో తొలి ప్రయత్నంలోనే  భారత జట్టు పసిడి పతకం నెగ్గింది. ఈ  ఈవెంట్‌లో భారత మహిళల జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా  ఉండటం గమనార్హం. 


బర్మింగ్‌హామ్ వేదికగా శనివారం ముగిసిన  ఫైనల్ పోరుకు వర్షం అంతరాయం కలిగించినా విజయం మాత్రం భారత్‌నే వరించింది. ఆస్ట్రేలియాపై భారత్.. 9 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది.  తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 114 పరుగులు మాత్రమే చేసింది. నాలుగో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. 9వ ఓవర్  ముగిసేసరికి  మూడు కీలకవికెట్లు నష్టపోయింది.  అనంతరం సి. లూయిస్, సి. వెబెక్‌లు నాలుగో వికెట్‌కు 54 పరుగులు  జోడించారు.  కానీ తర్వాత పుంజుకున్న భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు  తీశారు. ఆసీస్‌ను 114 పరుగులకే కట్టడిచేశారు. 


అనంతరం వర్షం కారణంగా  డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత లక్యాన్ని   4 ఓవర్లలో 42 పరుగులకు కుదించారు. భారత్ ఈ లక్ష్యాన్ని 3.3 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి  ఛేదించింది.   ఈ విజయంతో  ఐబీఎస్ఎ వరల్డ్ గేమ్స్‌లో విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. ఈ టోర్నీలో భారత్.. ఆసీస్‌పై 3 సార్లు, ఇంగ్లాండ్ పై రెండుసార్లు గెలుపొందింది.  






స్వర్ణం గెలిచిన  భారత జట్టుకు ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర రాజకీయ నాయకులు, క్రీడా  ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.  మోడీ ఎక్స్ (ట్విటర్‌) వేదికగా స్పందిస్తూ.. ఇది భారత్‌కు గర్వకారణమని,  మన క్రీడాకారిణుల తిరుగులేని స్ఫూర్తికి, ప్రతిభకు  ఈ విజయం ఒక ఉదాహరణగా నిలిచిందని కొనియాడారు.  ప్రపంచ విజేతగా నిలిచిన భారత జట్టులో ముగ్గురు తెలంగాణ  క్రీడాకారిణులు ఉండటం గమనార్హం. తెలగాణకు చెందిన సంధ్య, సత్యవతి,  రవన్ని భారత విజయాలలో కీలకంగా నిలిచారు. ఈ ముగ్గురూ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామికి చెందిన నేత్ర విద్యాలయ విద్యార్థులు. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినందుకు గాను సంధ్య, సత్యవతి, రవన్నిలకు చిన్నజీయర్ స్వామి తలా ఒక లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. 


పురుషులకు రజతం.. 


మహిళల విభాగంలో  స్వర్ణం నెగ్గిన భారత జట్టు పురుషుల విభాగంలో మాత్రం రజతంతో సరిపెట్టుకుంది.  చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో  జరిగిన ఫైనల్‌ పోరులో భారత జట్టుపై పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.  తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 3 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగా.. పాకిస్తాన్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


 











ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial