Karuna Jain Retirement: టీమిండియా సీనియర్‌ క్రికెటర్ కరుణా జైన్‌ రిటైర్మెంట్ ప్రకటించారు. తాను అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని రకాల ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ఈ మహిళా వికెట్‌ కీపర్‌ ప్రకటించింది. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కరుణా జైన్‌ జూలై 24, 2022న ఆటకు వీడ్కోలు పలికింది. 18 ఏళ్లపాటు భారత క్రికెట్ జట్టుకు సేవలు అందించిన కరుణా జైన్ రిటైర్మెంట్‌ పలికేందుకు ఇది సరైన సమయం అన్నారు.


18 ఏళ్ల కిందట 2004లో జాతీయ జట్టుకు ఎంపికైంది కరుణా జైన్. తొలి మ్యాచ్‌లోనే వెస్టిండీస్‌పై హాఫ్ సెంచరీ చేసింది. లక్నోలో జరిగిన ఆ వన్డేలో 64 పరుగులతో రాణించి, అరంగేట్రంలోనే అదరగొట్టింది ఈ వికెట్ కీపర్ బ్యాటర్. కెరీర్‌లో 5 టెస్టులు, 44 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించింది. టెస్టుల్లో 195 పరుగులు, వన్డేల్లో 987, టీ20లలో 9 పరుగులు చేసింది. ఓవరాల్‌గా భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ 1100 పరుగులు స్కోర్ చేసింది. వన్డేల్లో ఒక సెంచరీ, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఆమె ఖాతాలో ఉన్నాయి






మిథాలీ రాజ్‌తో కలిసి ఆడిన కరుణా జైన్..
2004లో జాతీయ జట్టుకు ఎంపికైన కరుణా జైన్‌  2005లో ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన భారత మహిళా జట్టులో సభ్యురాలు. దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్‌తో కలిసి కొన్ని మ్యాచ్‌లలో జట్టు కోసం కీలక ఇన్నింగ్స్ ఆడిన కరుణా జైన్ స్వస్థలం బెంగళూరు.






టెస్టుల్లో రికార్డ్ డిస్మిసల్స్..
కీపింగ్ ద్వారా 17 బ్యాటర్లను ఔట్ చేయడంలో పాలు పంచుకుంది. అంజు జైన్ 23 వికెట్లు తరువాత భారత్ తరఫున అత్యధిక ప్రత్యర్థి టీమ్ వికెట్లలో పాలుపంచుకున్న రెండో వికెట్ కీపర్ నిలిచింది కరుణా జైన్. ఓవరాల్‌గా తన కెరీర్‌లో 50 క్యాచ్‌లు పట్టిన కరుణ, 37 స్టంపింగ్స్ చేసింది. 


అందరికీ థ్యాంక్స్.. 
క్రికెట్ కెరీర్‌లో భాగస్వాములైన, తనకు తోడ్పాటు అందించిన కోచ్‌లు, సపోర్టు స్టాఫ్, సహచర క్రీడాకారిణులకు కృతజ్ఞతలు తెలిసింది. ఒడిదుడుకుల సమయంలో మద్దతు తెలిపిన వారిని ఎప్పటికి గుర్తుంచుకుంటాను. సోదరుడు క్రికెటర్ కావడంతో ఆసక్తి కలిగి, నేను ఈ రంగంలోకి వచ్చాను. కుటుంబం త్యాగాలతో ఆటను కొనసాగించగలిగానని చెప్పారు.