BCCI Review Meeting:


నూతన సంవత్సరం తొలిరోజున బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించనుంది. 2022లో టీమ్‌ఇండియా ప్రదర్శనపై ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ముంబయిలో సమీక్షించనుంది. బోర్డు అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జే షా, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, ఎన్‌సీఏ అధినేత వీవీఎస్‌ లక్ష్మణ్‌,చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ హాజరవుతున్నారని తెలిసింది. ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టి సారిస్తారని సమాచారం.


టీమ్‌ఇండియా 2011లో చివరిసారి ఐసీసీ ప్రపంచకప్‌ గెలిచింది. 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ సొంతం చేసుకుంది. అప్పట్నుంచి ఎంత ప్రయత్నించినా ఏ ఫార్మాట్లోనూ ఐసీసీ ట్రోఫీ అందుకోలేదు. ఆఖరి వరకు వచ్చి బోల్తా పడుతోంది. చివరి రెండేళ్ల ప్రదర్శన మరీ ఘోరం. దుబాయ్‌లో జరిగిన ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్పుల్లో నాకౌట్‌కు చేరుకోనేలేదు. ఆస్ట్రేలియాలో నిర్వహించిన తాజా టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఆంగ్లేయుల చేతిలో అవమానకర రీతిలో పరాజయం చవిచూసింది. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీసు చేజార్చుకోవడం దుమారమే రేపింది.


భారత జట్టు ప్రదర్శనపై సమీక్షించాలని బీసీసీఐ చాలా రోజులుగా భావించింది. అందుకు సమయం దొరక్కపోవడంతో నిర్వహించలేదు. చివరికి జనవరి 1న సమావేశానికి ముహూర్తం కుదిరింది. సమీక్షకు కార్యదర్శి జే షా నేరుగా వస్తున్నాడు. కర్ణాటకలో ఉన్న బోర్డు అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరవుతున్నాడు. ప్రస్తుతం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో విహరిస్తున్నాడు. అతడూ వీడియో కాన్ఫరెన్స్‌కే మొగ్గు చూపిస్తున్నాడని తెలిసింది. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, చీఫ్ సెలక్టర్‌ చేతన్‌ శర్మ, వీవీఎస్‌ లక్ష్మణ్‌ నేరుగానే సమావేశం అవుతారని అంచనా.


ఎజెండాలోని అంశాలు



  • ఒకటో అంశం: ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్పుల్లో ఓటములపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, చీఫ్ సెలక్టర్‌ చేతన్ శర్మ వివరణ ఇవ్వనున్నారు. ఈ ముగ్గురూ వేర్వేరుగా వివరణ ఇవ్వనున్నారు.

  • రెండో అంశం: ఆటగాళ్లు పదేపదే గాయాలవ్వడానికి కారణాలేంటి? పనిభారం, ఫిట్‌నెస్‌ పర్యవేక్షణపై పై ముగ్గురితో పాటు ఎన్‌సీఏ చీఫ్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ వివరణ ఇవ్వాల్సి ఉంది.

  • మూడో అంశం: భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కెప్టెన్లను ఎంపిక చేయడం. 2023 వన్డే ప్రపంచకప్‌ ముగిసే వరకు వన్డే, టెస్టులకు రోహిత్‌ ఉంటాడు. ఆ తర్వాత ఎవరిని నియమించాలో నిర్ణయం తీసుకోవడం. టీ20 కెప్టెన్సీని హార్దిక్‌కు అప్పగించడంపై చర్చ.

  • నాలుగో అంశం: టీమ్‌ఇండియాలో చాలామంది వయసు 32 నుంచి 34 వరకు ఉంది. అలాంటప్పుడు అశ్విన్‌, రోహిత్‌, కోహ్లీ, డీకే, షమి, భువీ స్థానాల్లో కుర్రాళ్లను సానబెట్టడంపై చర్చ.

  • ఐదో అంశం: టీమ్‌ఇండియా ప్రస్తుతం విపరీతంగా క్రికెట్‌ ఆడుతోంది. మారుతున్న డైనమిక్స్‌ను అనుసరించి టీ20 జట్టుకు ప్రత్యేక కోచ్‌ను నియమించడం.