ICC Women's T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్(Women's T20 World Cup 2024)లో టీమిండియా(India)కు గొప్ప శుభవార్త అందింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా(AUS) చేతిలో న్యూజిలాండ్(NZ) చిత్తయింది. తొలి మ్యాచ్‌లో భారత్‌ను మట్టి కరిపించిన న్యూజిలాండ్.. కంగారుల చేతిలో 60 పరుగుల తేడాతో చిత్తయింది. దీంతో టీమిండియా సెమీస్ అవకాశాలు పెరిగాయి. ఇవాళ శ్రీలంక(Srilanka)తో జరిగే మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధిస్తే సెమీస్ రేసులో ఉన్నట్లే.
ఛాంపియన్ ఆటతీరు
ఆరుసార్లు మహిళల టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ ఆస్ట్రేలియా... అన్ని విభాగాల్లో రాణించిన న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. ఏకంగా 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ దూకుడు బ్యాటింగ్‌తో భారీ స్కోరు చేసింది. అలిస్సా హీలీ (20 బంతుల్లో 26), బెత్ మూనీ (32 బంతుల్లో 40), ఎల్లీస్ పెర్రీ (24 బంతుల్లో 30), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (18 బంతుల్లో 18) పరుగులతో రాణించారు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో అమేలియా ఖేర్ నాలుగు వికెట్లతో రాణించింది. అనంతరం 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను కంగారు బౌలర్లు వణికించారు. మేగాన్ షట్ 3.2 ఓవర్లలో మూడే పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి సంచలన బౌలింగ్ ప్రదర్శన చేసింది. ఇందులో ఒక మెయిడిన్ ఓవర్ కూడా ఉంది. సోఫీ మోలినక్స్ (2/15), అన్నాబెల్ సదర్లాండ్ (3/21) కూడా బంతితో మెరిశారు. దీంతో న్యూజిలాండ్ 88 పరుగులకే కుప్పకూలి 60 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఎనిమిది మంది కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
భారత్‌కు లాభమే..
న్యూజిలాండ్ ఓటమి... భారత సెమీస్ అవకాశాలను మరింత పెంచింది. ఈ ఓటమితో న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ భారీగా పడిపోయింది. దీంతో గ్రూప్ Aలో తొలి రెండు స్థానాల్లో నిలిచే అవకాశం భారత్‌కు పెరిగింది. ఆస్ట్రేలియా ఆడిన రెండు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధించి సెమీస్ రేసులో ముందుంది. పాకిస్తాన్‌పై కూడా విజయం సాధించి కంగారులు సెమీస్ చేరడం దాదాపు ఖాయమే. ఇక ఇప్పుడు మిగిలిన మూడు జట్లు పాకిస్తాన్, న్యూజిలాండ్, భారత్ జట్లలో సెమీస్ బెర్తు దక్కించుకునేది ఎవరో తేలాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో ఓటమితో భారత్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ స్థితిలో కివీస్ ఓటమి.. భారత్-పాక్ సెమీస్ అవకాశాలను పెంచింది. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్... భారీ విజయాలు సాధిస్తే సెమీస్ బెర్తు దక్కించుకోవడం ఖాయం.
నేడు కీలక పోరు
భారత జట్టు నేడు శ్రీలంకతో కీలక మ్యాచ్ ఆడనుంది. ఆసియా కప్ ఫైనల్లో భారత్‌కు షాక్ ఇచ్చిన శ్రీలంక.. మరోసారి అదే ప్రదర్శన పునరావృతం చేయాలని చూస్తోంది. అయితే లంకపై ఘన విజయం సాధించి నెట్ రన్‌రేట్‌ను పెంచుకుని.. సెమీస్ వైపు మరో అడుగు ముందుకు వేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది.