Joe Root World Record | ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌ (WTC)లో అరుదైన ఘనత సాధించాడు. డబ్ల్యూటీసీలో 5000 పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా జో రూట్ సరికొత్త చరిత్ర లిఖించాడు. ముల్తాన్‌లో పాకిస్తాన్ తో జరిగిన తొలి టెస్టులో జో రూట్ ఈ మైలు రాయిని చేరుకున్నాడు. ఇంగ్లాండ్ రన్ మెషీన్ జో రూట్, జాక్ క్రాలీ రాణించడంతో తొలి టెస్టులో పాక్ పై ఇంగ్లీష్ జట్టు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 96 పరుగులు చేసింది. డబ్ల్యూటీసీలో భాగంగా 59వ టెస్టులో రూట్ ఈ ఘనత సాధించి, ఈ ఛాంపియన్ షిప్ లో ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్ గా నిలిచాడు.


పాక్ తో ముల్తాన్‌లో జరుగుతున్న తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ ఈ మైలురాయిని చేరుకోవడానికి కేవలం 27 పరుగుల దూరంలో ఉన్నాడు. రెండో రోజు ఆటలో మూడో సెషన్ లో 5000 పరుగులు చేసిన జో రూట్ డబ్లూటీసీ చరిత్రలో తొలి క్రికెటర్‌గా నిలిచాడు. మరోవైపు జో రూట్ సచిన్ రికార్డులను బద్దలుకొట్టే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో రూట్ అనంతరం అత్యధిక స్కోరు చేసిన రెండో ఆటగాడిగా ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ ఉన్నాడు. WTCలో లబుషేన్ 3904 పరుగులు సాధించాడు. స్టీవ్ స్మిత్ 3,486 పరుగులు, బెన్ స్టోక్స్ 3,101 పరుగులు, బాబర్ ఆజం 2,755 పరుగులు చేశాడు. టెస్ట్ ఛాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్లలో భారత్ నుంచి ఒక్కరు కూడా లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 






టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు:
1 - జో రూట్ (ఇంగ్లాండ్) - 59 టెస్టుల్లో 5,000 పరుగుల మార్క్ చేరాడు
2 - మార్నస్ లాబుషేన్ (ఆస్ట్రేలియా) 45 టెస్టుల్లో 3,904 పరుగులు
3 - స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) - 45 టెస్టుల్లో 3,486 పరుగులు
4 - బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) - 48 టెస్టుల్లో 3,101 పరుగులు
5 - బాబర్ ఆజమ్ (పాకిస్తాన్) - 32 టెస్టుల్లో 2,755 పరుగులు


టెస్టుల్లో ఈ ఏడాది 4 శతకాలతో రూట్ దూసుకుపోతున్నాడు. ఓ క్యాలెండర్ ఏడాదిలో 1000 టెస్టు పరుగులు అత్యధిక సార్లు సాధించిన బ్యాటర్లలో రెండో స్థానంలో రూట్ నిలిచాడు. 6 క్యాలెండర్ సంవత్సరాలలో వెయ్యికి పైగా టెస్టు పరుగులతో సచిన్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ తరువాత బ్రియాన్ లారా, మాథ్యూ హెడెన్, జాక్ కలిస్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, అలెస్టర్ కుక్, జో రూట్ 5 క్యాలెండర్ ఇయర్స్ లో టెస్టుల్లో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించారు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్ రికార్డుపై జో రూట్ కన్నేశాడు.


Also Read: Womens T20 World Cup: ఇంగ్లాండ్ విజయపరంపర , లంకతో పోరుకు భారత్ సిద్ధం