భార‌త(India) ప‌ర్యట‌న‌లో ఇంగ్లాండ్(England) మ‌హిళ జ‌ట్టు శుభారంభం చేసింది. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచులో 38 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. 198 పరుగుల భారీ  ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త మహిళల జ‌ట్టు 159 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో 38 పరుగుల తేడాతో తొలి టీ 20లో బ్రిటీష్‌ మహిళల జట్టు విజయం సాధించింది. తొలుత ఇంగ్లాండ్‌ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేయలేకపోయిన భారత బౌలర్లు... బ్యాటింగ్‌లోనూ ఏ దశలోనూ లక్ష్యాన్ని సాధించేలా కనిపించలేదు.



 ఈ మ్యాచ్‌లు టాస్‌ గెలిచిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి ఓవర్‌లోనే రేణుకా సింగ్‌ భారత్‌కు అదిరే ఆరంభాన్ని ఇచ్చింది. తొలి ఓవర్ నాలుగో బంతికే  డుంక్లీని అవుట్‌ చేసిన రేణుకా సింగ్‌... ఆ తర్వాతి బంతికే క్యాప్సీని కూడా అవుట్‌ చేసింది. దీంతో తొలి ఓవర్‌లోనే రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్‌ కష్టాల్లో పడింది. రెండు పరుగులకే బ్రిటీష్ మహిళల జట్టు రెండు వికెట్లు కోల్పోవడంతో పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తుందని అంతా అనుకున్నారు. బ్రిటీష్‌ జట్టు త్వరగానే అవుటయ్యేలా కనిపించింది. కానీ ఈ సంతోషం భారత్‌కు ఎక్కువసేపు నిలువలేదు. డానీ వ్యాట్‌... బ్రంట్‌ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. నాట్ స్కివర్-బ్రంట్ (77; 53 బంతుల్లో 13 ఫోర్లు), డేనియల్ వ్యాట్ (75; 47 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు.  రెండు పరుగుల వద్ద రెండు వికెట్లు తీసిన భారత బౌలర్లకు.... 140 పరుగుల వరకు మరో వికెట్‌ లభించలేదు. ఆరంభంలో ఆడితూచి ఆడిన ఈ జోడి క్రమంగా వేగం పెంచింది. భారత బౌలర్లపై బ్రంట్‌-వ్యాట్‌ ఎదురుదాడికి దిగారు.  ఈ క్రమంలో 34 బంతుల్లో డేనియల్ వ్యాట్, 36 బంతుల్లో నాట్ స్కివర్ లు అర్ధశ‌త‌కాలు పూర్తి చేసుకున్నారు. ఆ త‌రువాత వీరిద్దరు మరింత ధాటిగా బ్యాటింగ్ చేశారు. . స్కివర్-వ్యాట్ జోడి మూడో వికెట్‌కు 138 ప‌రుగులు జోడించారు. ఈ జోడీని ఇషాకీ విడదీసింది. ఆ తర్వాత నైట్‌ వెంటనే అవుటైపోయింది. కానీ చివర్లో జోన్స్‌ కేవలం 9 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సుతో 23 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.



 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటర్లు ఏ దశలోనూ గెలుపు దిశగా పయనించలేదు. షెఫాలి వర్మ తప్ప మిగిలిన బ్యాటర్లందరూ విఫలం కావడంతో టీమిండియా విజయానికి 38 పరుగుల దూరంలోనే ఆగిపోయింది. ఓపెనర్లు షెఫాలి వర్మ, స్మృతి మంథాన భారత్‌కు శుభారంభాన్ని అందించలేదు. కేవలం ఆరు పరుగులు చేసి స్మృతి మంధాన వెనుదిరిగింది. దీంతో 20 పరుగులకే టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత నాలుగు పరుగులకే రోడ్రిగ్స్‌ కూడా వెనుదిరిగింది. దీంతో 41 పరుగుల వద్ద భారత రెండో వికెట్‌ కోల్పోయింది. భార‌త బ్యాట‌ర్ల‌లో షఫాలీ వ‌ర్మ (52; 42 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధశ‌త‌కం చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (26), రిచా ఘోష్ (21) లు ఓ మోస్తరుగా రాణించ‌గా స్మృతి మంధాన (6), జెమీమా రోడ్రిగ్స్(4)లు విఫ‌లం అయ్యారు. దీంతో 198 పరుగుల భారీ  ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త మహిళల జ‌ట్టు 159 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో 38 పరుగుల తేడాతో తొలి టీ 20లో బ్రిటీష్‌ మహిళల జట్టు విజయం సాధించింది. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో సోఫీ ఎక్లెస్టోన్ మూడు వికెట్లు తీయ‌గా నాట్ స్కివర్-బ్రంట్, ఫ్రెయా కెంప్, సారా గ్లెన్ లు తలా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.