మీర్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫీకర్ రహీమ్ విచిత్రంగా అవుటయ్యాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ముష్ఫికర్ డిఫెన్స్ ఆడిన బంతి.. వికెట్ల మీదకు రావటంతో చేతితో ముష్ఫికర్ రహీమ్ వెంటనే చేతితో అడ్డుకున్నాడు. బౌలర్ జేమీసన్ వేసిన బంతిని చేత్తో అడ్డుకోవడంతో థర్డ్ అంపైర్ హ్యాడ్లింగ్ ది బాల్‌గా అవుట్ ఇచ్చాడు. వాస్తవానికి బంతి వికెట్లకు దూరంగానే వెళ్లినా నిబంధనల ప్రకారం బాల్‌ను చేత్తో అడ్డుకోకూడదు. ముష్ఫీకర్ చేతితో బాల్‌ను ఆపడంతో అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ ప్రకారం ఔట్‌గా ప్రకటించారు. దీంతో రహీమ్ నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఈ అవుట్‌తో టెస్టుల్లో తొలిసారిగా హ్యాడ్లింగ్ ది బాల్ రూల్‌తో అవుటైన ఆటగాడిగా ముష్ఫీకర్ రహీమ్ తన పేరిట చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకూ పదిమంది ఆటగాళ్లు ఈ రకంగా ఔట్ కాగా.. 11 వ ప్లేయర్‍గా ముష్ఫికర్ రహీమ్ చేరాడు.ఈ జాబితాలో భారతజట్టు మాజీ ఆటగాడు మొహిందర్ అమర్‌నాథ్ కూడా ఉన్నాడు.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 41వ ఓవర్‌లో ఈ విచిత్ర ఘటన జరిగింది. కైల్ జేమిసన్ బౌలింగ్‌లో ముష్ఫికర్ రహీమ్ డిఫెన్స్ ఆడిన బంతి.. బౌన్స్ అయ్యి వికెట్ల మీదకు వచ్చింది. బంతి వికెట్లను తాకుతుందనే భయంతో ముష్ఫికర్ రహీమ్ బాల్‌ను చేత్తో పక్కకు నెట్టేశాడు. ముష్ఫీకర్ బంతిని అడ్డుకున్నాడనే కారణంతో న్యూజిలాండ్ ప్లేయర్లు ఔట్ కోసం అప్పీల్ చేశారు. దీంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు నివేదించారు. రీప్లేలో బంతిని ముష్ఫికర్ రహీమ్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్లు తేలడంతో థర్డ్ అంపైర్.. అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ నింబంధన కింద ముష్ఫికర్ రహీమ్‌ను ఔటైనట్లు ప్రకటించారు. దీంతో 35 పరుగులు చేసిన రహీమ్.. నిరాశగా పెవిలియన్ వైపు కదిలాడు. టెస్టుల్లో 18 ఏళ్ల సుధీర్ఘ అనుభవం ఉన్న ముష్ఫికర్ రహీమ్ ఇలా ఔట్ కావటంపై నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ముష్ఫికర్ బుర్ర అప్పుడు పని చేయలేదని ఒకరు కామెంట్ చేయగా మరికొంత మంది మాత్రం మ్యాథ్యూస్ టైమ్డ్ ఔట్ ఘటనను గుర్తు చేసుకుంటున్నారు.
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్ట్‌ను బంగ్లా గెలుచుకుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ పది వికెట్లతో మెరవడంతో 150 పరుగుల తేడాతో కివీస్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన తైజుల్... రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. తైజుల్ స్పిన్ మాయాజాలంతో 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే కుప్పకూలింది. ఐసీసీ ర్యాంకుల్లో మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌పై తొమ్మిదో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ ఘనవిజయం సాధించడం క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేసింది. సొంతగడ్డపై టెస్టుల్లో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజయం. ఈ విజయంతో బంగ్లా రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది. మొత్తంగా న్యూజిలాండ్‌పై బంగ్లాకు ఇది రెండో టెస్టు విజయం. నిరుడు మౌంట్ మౌంగనూలో బంగ్లా.. కివీస్‌ను ఓడించింది.